డిసెంబర్ 2019 ఆన్‌లైన్ ఎడిషన్

 

 

“భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే

త్రాహిమాం నరకాత్ ఘోరాత్ దివ్యజ్యోతిః నమోస్తుతే“

 

కార్తికం భక్తి తత్పరత కి చిహ్నంగా ముంగిళ్ల ముందు సంధ్యాదీపమై

వెలుగుతుంది. పెరటి, తులసికోట దివ్వెల కాంతులతో పచ్చలు

పూయిస్తుంది. దీపకాంతి తోరణంగా ఎనిమిదేళ్లనాడు శ్రీకారం

చుట్టుకున్న భక్తిటీవీ కోటి దీపోత్సవం ఏటికేడాది త్రివిక్రమించి

దేశమంతా ఆక్రమించింది. తిరుగులేని వార్షిక ఆనవాయితీగా

మారింది. గత నవంబర్ నెలలో భక్తిటీవీ ఎనిమిదో కోటి దీపోత్సవం

3 నుంచి 18 దాకా పదహారు రోజుల పాటు జంటనగరాల వారికే కాదు,

సరిహద్దు జిల్లా వాసులకి సైతం వెలుగుల పండుగలా గడిచింది.

వారి దర్శనమే అపురూపంగా భావించే మఠాధిపతులు,

పీఠాధిపతులు ఈ కోటి దీపోత్సవ

ప్రాంగణానికి విచ్చేసి పునీతం చేశారు. దివ్యమంగళాశాసనాలు,

హితవచనాలతో లక్షలాదిమంది ప్రజానీకాన్ని తాత్విక చైతన్యంలో

ముంచెత్తారు. ఆడబోయిన తీర్థాలు ఎదురైన తీరున పలు దైవక్షేత్రాల

నుంచి విచ్చేసిన ఉత్సవమూర్తులు భక్తిటీవీ సర్వాంగ సుందరంగా,

అపరకైలాసంగా సమకూర్చిన వేదికపై శాస్త్రోక్తంగా

అర్చక స్వాములతో వివాహ వేడుకలు జరిపించుకున్నారు.

 

నిత్యం జాతీయ నేతలు, రాష్ట్ర నాయకులు, ఉన్నత అధికారులు భక్తిప్రపత్తులతో కార్యక్రమానికి వచ్చి పెద్దల ఆశీస్సులు అందుకున్నారు.

భక్తిటీవీ కోటిదీపోత్సవ కార్యక్రమాన్ని మహాయజ్ఞంగా, అరుదైన సందర్భంగా అభివర్ణించి, మనసా అభినందించారు. అనంతరం

నిత్యం సాగే స్వర్ణలింగోద్భవం, సప్తహారతులు ఒక విలక్షణ సన్నివేశంగా నిలిచాయి. అనేక జానపద కళా ప్రదర్శనలు, మహిళామణుల

కోలాట ప్రదర్శనలు ప్రాంగణానికి నవ్యకాంతులు అద్దాయి. ఈ దీపమహాయజ్ఞ కార్యక్రమానికి తోడునీడగా నిలిచిన భక్తకోటికి వందనాలు.

కోటి దివ్వెలకు అండగా ఉన్న ప్రకృతికి చేతులెత్తి నమస్కరిస్తున్నాం. డిసెంబర్ మాసంలో గీతాజయంతి, హనుమద్వ్రతం రానున్నాయి.

16న ధనుర్మాసం ముంగిట ముగ్గులతో వర్ణవైభవంతో మొదలవుతోంది. సస్యలక్ష్మిని వెంటతెచ్చే సిరుల మాసానికి స్వాగతం.

 

డిసెంబర్ 2019 భక్తి పత్రిక గురించి మరింత తెలుసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి....

oil
santoor

Other Magazines