లోకాభిరామం రణరంగధీరం రాజీవనేత్రం రఘువంశనాథమ్
కారుణ్యరూపం కరుణాకరం తం శ్రీరామచంద్రం శరణం ప్రపద్యే

రామనవమినాడు పెళ్లిసందళ్లు భక్తుల మనస్సులకు చలువపందిళ్లు. సీతారాముల తలల మీద నుండి జాలువారిన ముత్యాలతలంబ్రాలు అందరికీ శుభాలు చేకూరుస్తాయి. సీతారాముల కల్యాణం పూర్తయితేకానీ మన ఇళ్లలో వయసొచ్చిన పిల్ల పెళ్లి లగ్గాలు ఆరంభంకావు. సీతారాములు హిందూ వివాహవ్యవస్థకు ప్రతీకలు. గట్టి పునాదులు. ఈ మధుమాసోదయ మంగళవేళ సింహాద్రి అప్పన్న (ఏప్రిల్ 7), అరసవల్లి సూర్యనారాయణమూర్తి (ఏప్రిల్ 7) పెళ్లికి సిద్ధమవుతున్నారు. మదురై మీనాక్షి తల్లి, బెజవాడ కనకదుర్గమ్మ కల్యాణ తిలకం దిద్దుకోనున్న దివ్యవిశేషం కూడా ఈ తరుణంలోనే కావడం మహాభాగ్యం. ఈ దేవుళ్లందరూ పెళ్లిపీటల నుంచి మనందరినీ దీవించాలని ప్రార్థిద్దాం. జయదేవ జయదేవ జయసద్గురునాథ శ్రీసద్గురునాథ శ్రీభారతీతీర్థ గురుసార్వభౌమ జయదేవ జయదేవ చైత్రశుక్ల పంచమి ఏప్రిల్ 1వ తేదీ భారతీతీర్థ మహాస్వామి వారి జన్మోత్సవం. మహాదార్శనికులుగా, ధార్మికులుగా, మహాపండితులుగా, పుంభావశారదగా, శివపరావతారంగా 28 సంవత్సరాలుగా శృంగేరి పీఠానికి నూత్నగౌరవాలు అందిస్తున్నారు. శ్రీభారతీతీర్థ మహాస్వామివారికి జన్మదినోత్సవ శుభవేళ శిరసువంచి పాదాభివందనం ఆచరిస్తున్నాం. వాడపల్లి వెంకన్నతీర్థం ఏప్రిల్ 7న మరో వైభవం. ఈ నెల 28న సింహాచల అప్పన్న చందనసేవ కావించుకుని నిజరూప దర్శనం ఇస్తాడు. ఆ స్వామి అందరినీ కాచి రక్షించాలని ఆకాంక్షిద్దాం.

➠ రామనామం తారకమంత్రం. రామకథ శివప్రసాదం. కాశీ నివాసులకు అవసానవేళ శివుడు బోధించేది రామమంత్రమే. హనుమంతుని శక్తిసామర్ధ్యాలు రామనామమే. తులసీదాసుని మానసమంతా రామమయం. రామరసాన్ని గ్రోలమని భక్త కవులందరి ప్రబోధము. మీకోసం అందిస్తున్నాం...

➠ మానవ లోకంలో కవితావిర్భావానికి శ్రీకారం చుట్టినవాడు, రసలోకాలకు తొలిసారి ద్వారం తెరచినవాడు, అంతులేని ఆనందామృతాన్ని యుగయుగాల సహృదయ హృదయాలకు చూరలిచ్చినవాడు, మనస్సున్నవాడు, మనీషి, మహర్షి అయిన వాల్మీకి గురించి.. మీకోసం అందిస్తున్నాం...

➠ ఒంటిమిట్ట కోదండరామయ్య కల్యాణాన్ని అధికారికంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోంది. శ్రీరామనవమికి ఇక్కడ బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. చైత్ర పౌర్ణమికి ముందు రాత్రి పండువెన్నెల్లో కల్యాణం నిర్వహిస్తారు. ఒంటిమిట్ట కోదండరామయ్య వైభవం, కల్యాణాన్ని వీక్షించడం భక్తుల పూర్వజన్మ సుకృతమే...

➠ చైత్రమాసంలోని తొలి తొమ్మిదిరోజులూ దుర్గాపూజ చేయడం ఆచారం. గోలోకంలో శ్రీకృష్ణుడు చైత్రమాసంలోనే దుర్గాదేవిని అర్చించాడని బ్రహ్మవైవర్త పురాణం చెబుతుంది. ఈ అర్చనకు ప్రతీకగా చైత్రమాసంలో విజయవాడలోని కనకదుర్గాదేవికి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. చైత్రమాస ప్రత్యేక ఉత్సవాలు ఉగాదితో ప్రారంభమవుతాయి. ఈ బ్రహ్మోత్సవాలు చైత్ర బహుళ విదియనాడు పూర్తవుతాయి. ఈ బ్రహ్మోత్సవాల విశేషాలు మీకోసం అందిస్తున్నాం...

➠ శృంగేరి శారదా పీఠం జగద్గురు స్థానం. ధర్మసంస్థాపనే ధ్యేయంగా భారతావనికి మార్గనిర్దేశం చేస్తున్న గురువులకు కార్యక్షేత్రం. అప్రతిహతంగా 36 తరాలుగా జగద్విఖ్యాతులైన గురుపరంపరను అందించిన విశిష్ఠ ధార్మిక కేంద్రం. ఆశ్రమ ధర్మానికి అచ్చమైన చిరునామాగా నిలిచిన జగదేక గురుసార్వభౌములు శృంగేరీ జగద్గురు పీఠ చక్రవర్తి శ్రీశ్రీశ్రీ భారతీతీర్థ మహాస్వామి జన్మదినోత్సవం (ఏప్రిల్ 2) వేళ వారి దివ్యాశీస్సులు అర్ధిస్తూ భక్తి పత్రిక ప్రణతులర్పిస్తోంది.

➠ సింహాచలంలో పశ్చిమాభిముఖుడై వెలసిన వరాహ నృసింహస్వామి విజయ ప్రదాత. సింహాచల క్షేత్రంలో ప్రధాన ఉత్సవాలు రెండు. ఏడాదికి ఒక్కసారి మాత్రమే నిజరూప దర్శనం ఇచ్చే సింహాచల స్వామి చైత్రమాసంలో పెళ్లికొడుకవుతాడు. వైశాఖ శుద్ధ తదియనాడు ఆయనకు చందనసేవ జరుగుతుంది. మరిన్ని విశేషాలు భక్తి పత్రికలో మీకోసం అందిస్తున్నాం...

Recent Comments