అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా
చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః

మా గురుదేవులు కంచిపీఠాధిపతి శ్రీజయేంద్ర సరస్వతీ మహాస్వామి సిద్ధిపొందడం మానవాళికి తీరనిలోటు. వారు సనాతన హైందవ ధర్మాలకు మారుపేరుగా నిలిచారు. మా పట్ల వారికి ప్రత్యేక వాత్సల్యం ఉండడం మా అదృష్టం. మా శ్రేయోగురువుగా వారు సదా మా మనసులలో నిలిచివుంటారు. భక్తిటివి నిర్వహించే కోటిదీపోత్సవానికి అనారోగ్యాన్ని కూడా లెక్కచేయక ప్రతి ఏటా విచ్చేసి, అశేష భక్తకోటిని ప్రత్యక్షంగా దీవించేవారు. ఇది మేము మరువలేని మధురస్మృతి. వారి ఆత్మశక్తి సదా మా వెన్నంటి ఉండి మమ్మల్ని ముందుకు నడిపించాలని ఆ పరమగురువును ప్రార్ధిస్తున్నాం. అద్వైత చక్రవర్తి ఆదిశంకరజయంతి ఈ మాసం 20న రావడం ఆనందదాయకం. 21న శ్రీరామానుజ జయంతి వస్తోంది. శ్రీసింహాద్రి అప్పన్న చందనోత్సవం జరుపుకుని 18న అశేష భక్తకోటికి నిజరూపదర్శనం ఇవ్వనున్నాడు. ఈనెల 24న శ్రీసత్యసాయి ఆరాధనోత్సవం దేశవిదేశాల్లో జరగనుంది. ఏప్రిల్ చివరిరోజున బుద్ధపూర్ణిమ వస్తోంది. యావత్ప్రపంచానికి వెన్నెలలు పంచిన ఆ దివ్యమానవునికి నీరాజనాలర్పిద్దాం. శ్రీసత్యనారాయణస్వామి వ్రతవిధానాన్ని చిరుపుస్తకంగా అందిస్తున్నాం.

➠ ఆకటి వేళల అలసిన వేళల తేకువ హరినామమే దిక్కు అని ఆలపించిన అన్నమయ్య హరినందకాంశలో పుట్టినవాడు. పురిటి ప్రాయంలో తిరుమల్లప్ప ప్రసాదం అని చెప్పందే ఉగ్గు కూడా తాగేవాడు కాదని ప్రతీతి. రాయలసీమలో రాజంపేట తాలూకా తాళ్లపాక గ్రామంలో లక్కమాంబ, నారాయణసూరి దంపతులకు 1408 మే 9న వైశాఖ పూర్ణిమనాడు జన్మించాడు అన్నమయ్య. 

➠ అతడు శివభక్తికి నిధి. అతని నడత శివచైతన్యం. లోక హితాభిలాషయే అతని శివాచారలక్ష్యం. ఆపాదమస్తకం శివుణ్ణే నింపుకున్న మహనీయుడు బసవేశ్వరుడు. ఈశ్వర పరతత్త్వాన్ని ప్రవచించడం కోసమే పుట్టిన ఆదివృషభేంద్రుని అవతారం. సకలసృష్టి శివస్వరూపమేనని నిరూపిస్తూ, ప్రజల హృదయసీమల్లో శివభక్తిని పదిలపరచటం కోసం నేలకు వచ్చిన రెండో శివుడు బసవేశ్వరుడు.

➠ నెమ్మదిగా నడుస్తాడు కాబట్టి శనికి మందుడని పేరు. నవగ్రహాలలో శనిది కర్మాధికారి స్థానం. జీవుల పాపపుణ్యాలకు తగిన ఫలాలను అనుగ్రహిస్తాడు. ఫలితాలను అందించడంలో మాత్రం శని అత్యంత వేగంగా, ప్రభావశీలంగా పనిచేస్తాడు. క్రూర గ్రహాలుగా జ్యోతిశ్శాస్త్రం చెప్పిన శనిగ్రహం అంటే చాలమంది భయపడతారు. ప్రజల్లో శనిదోషాల పట్ల ఉన్న అపోహలు స్వార్ధపరుల మోసపోవడానికి కారణమవుతున్నాయి.

➠ నిత్యకల్యాణ వైభవ సంపన్నుడు శ్రీనివాసుడు. ద్వారకా తిరుమలలో ఏటా రెండుసార్లు తిరు కల్యాణ మహోత్సవాలు అదనంగా జరిపించుకుంటాడు. ఆ వేంకటేశుని వైశాఖ తిరు కల్యాణోత్సవాల సందర్భంగా ఈ నెల 25వ తేదీ నుంచి వచ్చేనెల 2 వరకూ వివిధ అలంకారాలతో, వాహన సేవలతో ద్వారకా తిరుమల క్షేత్రం ఇల వైకుంఠంగా మారుతుంది.

➠ పట్టపగలే పట్టబోరే చోరులు... పట్టదలిచితివి నీవొక పట్టమేలే రాజవట! అనే ధిక్కార స్వరం వాసవీ కన్యక. బలిమికి లొంగని ఆత్మగౌరవ దీపిక. అహింసామూర్తి. త్యాగ పతాక. పెనుగొండ నగరేశ్వరుని పతిగా వరించిన జగన్మాత. దేశవిదేశాల్లో వాసవీ కన్యక ఆరాధ్యనీయగా పూజలందుకుంటోంది.

➠ సింహాచలంలో పశ్చిమాభిముఖుడై వెలసిన వరాహ నృసింహస్వామి విజయ ప్రదాత. సింహాచల క్షేత్రంలో ప్రధాన ఉత్సవాలు రెండు. ఏడాదికి ఒక్కసారి మాత్రమే నిజరూప దర్శనం ఇచ్చే సింహాచల స్వామి చైత్రమాసంలో పెళ్లికొడుకవుతాడు. వైశాఖ శుద్ధ తదియనాడు ఆయనకు చందనసేవ జరుగుతుంది.

Recent Comments