"శ్రీరాఘవం దశరథాత్మజ మప్రమేయం
సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం
ఆజానుబాహు మరవింద దళాయతాక్షం
రామం నిశాచర వినాశకరం నమామి"

సీతమ్మ మాయమ్మ, శ్రీరాముడు మా తండ్రి అని తెలుగు వారంతా భక్తితో భజనపాటలు నిత్యం పాడుకుంటూ ఉంటారు. ఆ భార్యాభర్తలు మనలాంటి వాళ్లే. కష్టసుఖాలు తెలిసిన వాళ్లు. అంతఃపుర వైభవాలని, అరణ్యవాసాన్ని సమదృష్టితో అనుభవించిన ఆదర్శమూర్తులు. మనలాంటి మనుషులు. రామావతారంలో ఎక్కడా ఆర్భాటాలూ, అతీతశక్తులూ ఉండవు. సంపూర్ణ మానవునిగా ఉంటేనే వరప్రసాది అయిన రావణాసురుణ్ణి సంహరించగలడు. పోతపోసిన ధర్మం శ్రీరామచంద్రుడు. మానవ జాతిలో యుగాలుగా అనేక చర్చలకు తెరతీసి కడకు రాముడు మాకు అనుసరణీయుడు, ఆరాధ్యుడు అని నిర్థారించుకున్నారు. నాలుగిళ్లున్న చోట అయిదోదిగా రామమందిరం వెలిసింది. ఈ నెల వస్తూనే సీతారామకల్యాణ శుభముహుర్తాన్ని వెంట పెట్టుకొచ్చింది. భద్రాద్రిలో ఏప్రిల్ 2 రామకల్యాణం, 3న రామ పట్టాభిషేకం జరుగుతున్నాయి. 7వతేదీన పున్నమిపూట ఒంటిమిట్ట కోదండరామయ్య కల్యాణం జరుగుతుంది. సీతారాములు తలంబ్రాలు పోసుకుంటే ఇంక తెలుగు ఇళ్లలో కొత్త తాటాకు పందిళ్లు పచ్చతోరణాలు సిద్ధమవుతాయి. ఈడొచ్చిన పిల్లలకి పెళ్లి ముహూర్తాలు ఖాయం అవుతాయి. నూతన వరులంతా రామయ్యలై, నూతన వధువులంతా సీతమ్మలుగా పారాణి పాదాలతో సాక్షాత్కరిస్తారు. ధర్మ సందేహాలకు పెద్దల సమాధానాలు చిరుపుస్తకంగా ఈ సంచికతో అందుకోండి.

 

➠ ఏ వ్రతమైనా, జపమైనా, హోమమైనా, దానాదులైనా అక్షయ తృతీయనాడు చేస్తే ఫలితం అనంతమౌతుంది. పుణ్య కార్యాచరణ వల్ల వచ్చే ఫలితమే కాదు... పాపకార్యాచరణవల్ల వచ్చే పాపం కూడా ఈనాడు చేసినది ఏనాటికీ క్షీణించనంత పెద్దదిగా మారుతుంది. ఈ తిథినాడు అక్షయుడైన విష్ణువును పూజించాలి.

➠ సింహాద్రి అప్పన్నకు శ్రీచందనం నిరంతరమూ మైపూతగా ఉంటుంది. ఏడాదికి ఒకసారి అక్షయ తృతీయ నాడు మాత్రమే ఆయన నిజరూపాన్ని అనుగ్రహిస్తాడు. అప్పన్న చందనోత్సవ సంప్రదాయం వెనుక ఎన్నెన్నో విశేషాలున్నాయి.

➠ హనుమంతుని తత్త్వం ఆదర్శప్రాయం. ఆయనను కార్యశూరునిగా నిరూపించిన సుందరకాండ మనకు నిత్యపారాయణ గ్రంథం. హనుమంతుడు అభీష్ట దైవం. ఉత్తరాదివారు చైత్రమాసంలో హనుమజ్జయంతిని నిర్వహిస్తారు.

➠ భగవాన్ సత్యసాయిది ప్రేమావతారం. మానవత్వాన్ని తట్టిలేపితే దివ్యత్వం సాక్షాత్కరిస్తుందని చెప్పేవారు. ఆత్మతత్త్వాన్ని తెలుసుకున్న మానవుడు కర్మమార్గాన్ని అనుసరిస్తాడని, అపకారికి సైతం ఉపకారిగా మారతాడన్నారు. భగవత్ భావం చేత సర్వమూ సాధించవచ్చనేదే శ్రీసత్యసాయి సందేశం....

➠ నిలువెత్తు దివ్యమంగళ స్వరూపం వాడపల్లి వేంకటేశ్వరునిది. ఆనంద ధాముడై లక్ష్మీ స్వరూపుడై దర్శనమిస్తాడు. మూడు మండపాలలో ఎత్తైన ప్రాకార గోపురాలతో దేవాలయంలో కనువిందు చేస్తాడు. చైత్రశుద్ధ ఏకాదశి రోజున స్వామి కల్యాణం, తీర్థం జరుగుతాయి. 

➠ హిమాలయం కేవలం మంచు పర్వతం కాదు, దేవతల ఆత్మ అంటాడు కాళిదాసు. జన్మ తరించాలంటే ఒక్కసారైనా మహిమాలయ క్షేత్రాలను దర్శించాలి. గంగపుట్టిన చోటైన గంగోత్రి, యమునానది పుట్టిన యమునోత్రి, నరనారాయణుల తపోభూమి బదరీనాథ్, ద్వాదశజ్యోతిర్లింగ క్షేత్రం కేదారాలు అందరూ దర్శించవలసినవి.

➠ ఆదిశంకరులు జగద్గురువు. సనాతన ధర్మానికి పునర్వైభవాన్ని తెచ్చిపెట్టిన వారు. జ్ఞానమార్గమే అత్యున్నతమని నిరూపించిన వారు. ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటూ కూడా మనిషిలో దైవత్వాన్ని నిలిపేందుకు శ్రమించినవారు. స్వల్ప జీవితకాలంలో ఎవరూ సాధించలేని ఘనకార్యాలెన్నో శంకరులు చేసి చూపించారు.

➠ రామానుజాచార్యులు సమతా మూర్తి. సమాజంలోని ప్రతి ఒక్కరికోసం ఆయన విశిష్ట సేవలందించారు. విద్యావంతులై సమర్ధులైన శిష్యులను లోకానికందించి సార్ధకమైన జీవనంతో నూటఇరవై సంవత్సరాల పాటు జీవించారు. తమ జీవనంలో నిర్విరామంగా పరిశ్రమించి సమాజంలో అద్భుత చైతన్యాన్ని కలిగించారు.

➠ సమస్త భువనాలకూ అధినేత్రి రాజ రాజేశ్వరి. ఆమెను పట్టపురాణిగా చేసుకున్న ప్రభువు వేములవాడ రాజరాజేశ్వర స్వామి. నీలలోహిత రుద్రునిగా వేములవాడలో వెలిశాడు. కోడెమొక్కులు చెల్లించి సంతాన భాగ్యాలు పొందుతారు. శ్రీరామనవమినాడు సీతారామ కల్యాణ తలంబ్రాల వేళ వేలాది భక్తులు రాజన్న సన్నిధిలో లింగధారణ చేస్తారు. 

Recent Comments