లక్ష్మీం క్షీరసముద్ర రాజతనయాం శ్రీ రంగ ధామేశ్వరీం
దాసీభూత సమస్త దేవవనితాం లోకై క దీపాంకురాం
శ్రీ మన్మంద కటాక్ష లబ్ధ విభవత్ బ్ర హ్మేంద్ర గంగాధరాం
త్వాం తరైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రి యా

సర్వశుభాలనూ ప్రసాదించే వరలక్ష్మీ వ్రతం (ఆగస్టు 9) వస్తోంది. ఈ శ్రావణపర్వం కోసం ముత్తయిదువలంతా వేయికళ్లతో నిరీక్షిస్తూ ఉంటారు. పండ్లు పూలు అమ్మవారి కోసమే అన్నట్లు విరివిగా వస్తాయి. లేతపచ్చని తమలపాకులు పేరంటానికి శోభ తెస్తాయి. ఈ శ్రావణమాసంలో చిత్తడి చినుకుల మధ్య పెద్ద ముత్తయిదువలు, కొత్త పెళ్లికూతురులు పసుపు పారాణి పాదాలతో పిలిచిన వారికి ప్రమోదం చేకూరుస్తూ తరలి వస్తారు. పట్టుపావడాల రెపరెపలతో, జడకుచ్చుల సయ్యాటలతో వీధి నిండా నడుస్తూ వచ్చే కన్నెపిల్లలు శ్రావణలక్ష్మికిచ్చే హారతుల్లా గుబాళిస్తారు. ఈ శ్రావణం నవవధువులకు పుట్టింటికి, అత్తవారింటికి ఆధ్యాత్మిక సేతువులా నిలుస్తుంది. ఏడాదిలో శ్రావణంలాంటి సందడి మాసం మరొకటి లేదు.

➠ సర్వమానవ సౌభ్రాతృత్వాన్ని, ప్రతి మహిళని సోదరీభావంతో సమాదరించే ఆదర్శ చింతనని కంకణంగా ధరింపచేసే గొప్ప పండగ రాఖీ పూర్ణిమ కూడా ఈ మాసంలోనే వస్తుంది.

➠ భారతీయుల దాస్యశృంఖలాలు విడిపోయిన ఆగస్టు 15 శుభవేళ శాంతి సమరాన్ని నడిపిన మహనీయులకు అంజలి ఘటిద్దాం.

➠ చెట్టుని పుట్టని సైతం కొలిచే మన సంస్కృతీ సంప్రదాయాలకు నిలువుటద్దంలా నాగపంచమి, గరుడపంచమి పర్వాలు (5వ తేదీన) ఒకేసారి వస్తున్నాయి.

➠ శ్రీశృంగేరీ విధుశేఖర భారతీస్వామి జన్మోత్సవం ఈ నెల 5వ తేదీన విజయం చేస్తోంది. ఇది మనందరికీ పర్వదినం.

➠ శ్రీకృష్ణ జన్మాష్టమి (ఆగస్టు 23) యావత్ భారతావనిని వేడుకలలో ముంచెత్తనుంది. పిల్లందరూ ఆడమగ తేడా లేకుండా బాలకృష్ణులుగా మారిపోతారు. వసంతాలు జల్లుకోవడం, ఎగిరెగిరి ఉట్లు కొట్టి వినోదించడం గోకులాష్టమి నాటి ముచ్చట.

➠ శ్రావణ పర్వం వేళ శ్రీవరలక్ష్మీ వ్రతకల్పం చిరుపుస్తకాన్ని ఉచితంగా అందిస్తున్నాం.

Recent Comments