"అగజానన పద్మార్కం గజానన మహర్నిశం
అనేకదం తం భక్తానాం ఏకదంత ముపాస్మహే"

ప్రకృతి స్వరూపిణి అయిన పార్వతీదేవి ముఖపద్మాన్ని వికసింప చేసేసూర్యునివి నీవే. అసంఖ్యాక భక్తకోటి చేత పూజలందుకునే ఓయి గజాననా! నిన్ను అహర్నిశలూ పూజిస్తాను అని ఈ ప్రార్థనాశ్లోకానికి భావం. గణపతి ప్రకృతి ప్రియుడు. ఆయన పూజా సంవిధానంలోనూ పర్యావరణ హితం, ప్రకృతి పరిరక్షణ కలగలసి ఉంటాయి. పర్యావరణాన్ని మనం కలిసికట్టుగా పరిరక్షించుకుంటేనే, విపత్తుల నుంచి తేలికగా బయటపడగలం. ఇప్పటి కాలానికి సంబంధించినంత వరకూ తోటిమానవులకు మనం చేయగల మహోపకారం పర్యావరణాన్ని కాపాడడం ఒక్కటే. మంచి పని చేయాలని, సమాజానికి మేలు చేయాలని సంకల్పించడమే దైవత్వం. ఆ సంకల్పానికి చిత్తశుద్ధి తోడైతే దైవం కూడా సహకరిస్తాడు. ముందుండి మనల్ని నడిపిస్తాడు. అప్పుడు ఎంతటి బరువైన పని
అయినా తేలిగ్గా పూర్తవుతుంది. అందుకే సత్సంకల్పానికి మించిన పూజ లేదు అని పెద్దలు చెబుతారు.

ఈ వినాయక చవితికి (ఆగస్టు 22) మునుపటివలె భారీపూజా కార్యక్రమాలను నిర్వహించుకునే అవకాశం లభించకపోవచ్చు. అందుకు చింతించాల్సిన పనిలేదు. ఈ భూమిని రక్షించుకోవాలనే సత్సంకల్పమే భగవంతునికి మనం చేయగలిగిన పెద్దపూజ. భౌతికదూరాన్ని పాటిస్తూ మనమందరం ఇళ్లలోనే వినాయక చవితిని ఘనంగా నిర్వహించుకుందాం. అందుకు ఉపయోగపడేవిధంగా వినాయక పూజావిధానాన్ని లోపలిపేజీల్లో భక్తిపత్రిక అందిస్తోంది. వినాయకచవితి కంటే ముందుగా ఈ నెలలో రాఖీపండుగ (ఆగస్టు 3) వస్తోంది. అన్నాచెల్లెళ్ల అనురాగానికి చిహ్నంగా నిలిచే రాఖీపండుగ సందర్భంగా మీ కుటుంబ సభ్యులందరికీ ఆరోగ్యం, సంక్షేమం కలగాలని కోరుకుంటున్నాం. కలి కల్మషాలునశించి, మానవాళికి హితం చేకూర్చమని శ్రీకృష్ణజన్మాష్టమి (ఆగస్టు 11) వేళ ఆ జగద్గురువును ప్రార్థిద్దాం. సర్వేజనాఃసుఖినోభవంతు.

 

➠ విఘ్నేశ్వర ప్రార్థనలో స్వామి పదహారు నామాలు కనిపిస్తున్నాయి. వీటినే షోడశ నామాలు అంటారు. ఇవి వినాయక తత్త్వాన్ని విశదీకరిస్తాయి. అనేక పురాణ గాథలను స్మరణకు తెస్తాయి. వివిధ సందర్భాల్లో గణేశుడు వివిధ నామాలతో కొలుపులు అందుకున్నాడు. ఆయన అవతారాలు మొత్తం ముప్పైరెండు అయితే అందులో పదహారు అవతారాలు ముఖ్యమైనవి. అలాగే వినాయకుని నామాలన్నింటిలోనూ ఈ పదహారు నామాలు అనునిత్యం స్మరించాల్సినవి.

➠ మన దేవతలందరిలోనూ గణపతిని మాత్రమే మహాగణపతి అని పిలుస్తాం. మహాగణపతి అంటే గొప్ప గణపతి, విశేషమైన గణపతి అని అర్థం. ప్రతి సంవత్సరం మనం పూజించే గణపతికి సైతం పూజనీయుడైన గణపతియే మహాగణపతి. ఆయనను మనం
పసుపు ముద్దగా రూపొందించి పూజిస్తాం.

➠ ద్వైత వనంలో విరబూసిన పారిజాతం శ్రీరాఘవేంద్ర యతీంద్రులు. ఆయన బోధలు పవిత్ర తులసీ దళం వంటివి. కలియుగ కల్పతరువుగా, కామధేనువుగా గురు రాఘవేంద్రులు ప్రసిద్ధి గాంచారు. కోరిన కోర్కెలు తీర్చేచింతామణిగా ఆయన భక్తులు భావిస్తారు.
జ్ఞానులకు చరమగమ్యం, యోగుల హృదయాలలో చూడామణి రాఘవేంద్రులే. ఆయన బృందావన వాసం చేస్తున్న మంత్రాలయంలో ప్రతి శ్రావణమాసంలోనూ ఆరాధనోత్సవాలు జరుగుతాయి.

➠ తమిళనాడులోని తిరువారూరు జిల్లా ఇరుల్ నీక్కి అనే కుగ్రామంలో శ్రీజయేంద్ర సరస్వతీ మహాస్వామి 1935 జూలై 18న జన్మించారు. 1954 మార్చి 22న సంన్యాసాశ్రమం స్వీకరించి శ్రీజయేంద్ర సరస్వతిగా మారారు. 1970 నుంచి ప్రారంభించి జీవిత కాలంలో 14 సార్లు విజయయాత్రలు చేపట్టారు. ప్రాచీన ఆలయాల జీర్ణోద్ధరణ గావించారు. కుంభాభిషేకాలు జరిపించారు. దేశవిదేశాల్లో ఆధ్యాత్మిక, సామాజిక చైతన్యదీప్తులను ప్రసరింపచేశారు. 2018 ఫిబ్రవరి 28న సిద్ధి పొందారు. 

➠ శ్రీకృష్ణ జననం ప్రతి హృదయంలోనూ నిత్యం జరుగుతూనే ఉంటుంది. ఆనందమే కృష్ణతత్త్వం అయినప్పుడు దానిని నిలుపుకున్న ప్రతిక్షణం జన్మాష్టమి అవుతుందంటారు. గీతాచార్యుడై జగత్తుకు జ్ఞానబోధ చేసిన కృష్ణునిలో అణువణువూ మనకు ఓ గొప్ప
సందేశం ఇస్తుంది.

➠ అనుబంధాలను బలోపేతం చేసి, అనురాగాలను వర్ధిల్లచేసే అపురూప పర్వం రక్షాబంధనం. చారిత్రక కాలంలోనూ రాజ్యాలమధ్య శాంతి సమరస భావనలను పెంపొందించింది రాఖీ. సోదరీ సోదరుల మధ్య ప్రేమ, ఆప్యాయతలను కలబోసుకునే పండుగగా రక్షాబంధనం భారతీయ కుటుంబ వ్యవస్థను పదిలంగా కాపాడుతోంది. ఒకప్పుడు ఉత్తరాది సంస్క‌ృతిలో మిళితమైన పండుగ రక్షాబంధన్. రాఖీ వేడుకకు ఎల్లలు లేవు.

➠ నారాయణ గురు కుల వ్యవస్థను తిరస్కరించాడు. స్వేచ్ఛా చింతనను ప్రోత్సహించాడు. సాంఘిక సమానత్వానికి ఆధ్యాత్మిక ధోరణులకు నూతన మార్గాలను నిర్దేశించాడు. కేరళలో సంఘసంస్కరణను మహోద్యమంగా నడిపాడు. సాంఘిక సమానత్వం కోసం కృషి చేశాడు. అట్టడుగు వర్గాలలో ఆధ్యాత్మిక చైతన్యం తీసుకురావాలన్నాడు. అప్పుడే మూఢనమ్మకాలు తొలగిపోయి అసలైన హైందవ సంస్కృతి శిఖరాలను అందుకుంటుందని ప్రవచించాడు.

➠ కేరళీయులకు ఓణం పెద్దపండుగ. వర్షానికి కారణమైన వరుణ, ఇంద్రులను పూజించడం ఓణం పండుగ అంతరార్ధం. వానకాలంలో ప్రకృతి ప్రసాదించే పూవులతో దేవతారూపాలను చేస్తారు. కొత్తధాన్యంతో అప్పాల వంటి మధుర పదార్ధాలు తయారుచేస్తారు. కొబ్బరికోరునూ నైవేద్యమిస్తారు. వానలో తడుస్తూనే మళయాళీలు రకరకాల ఆటలు ఆడతారు. 

➠ మాస్టర్ సివివి మార్గాన్ని అనుసరించే వారికి ఆగస్టు నెల పవిత్రమైనది. మాస్టర్ సి.వి.వి.తో పాటు మాస్టర్ ఎం.ఎన్., మాస్టర్ ఇ. కె., మేడమ్ బ్లావెట్ స్కీ వంటివారి జయంతులు కూడా ఆగస్టు నెలలోనే వస్తాయి. కుంభకోణం గురువుగా ప్రసిద్ధులైన మాస్టర్ సి.వి.వి. అసలు పేరు కంచుపాటి వీర వెంకాస్వామిరావు. వీరు క్రీ.శ. 1868 ఆగస్టు 4 న కుంభకోణంలో జన్మించారు.

Recent Comments