"వందే శంభుముమాపతిం సురగురం వందే జగత్కారణం
వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిమ్"

ఆదిదేవుడు లింగరూపుడై ఉద్భవించిన పర్వదినం మహాశివరాత్రి. (ఫిబ్రవరి 21) అమావాస్య చీకట్లలో సృష్టి కనుమరుగైపోకుండా ముందుగానే శివుడు వెలుగుల స్తంభంగా వెలిశాడు. హరహర మహాదేవ ఘోషలతో ఆనాడు దేవతలంతా చేసిన శివపూజ నేటికీ మనకు సంప్రదాయమై నిలిచింది. ఈ పర్వదినాన ఉపవాస జాగరణలతో శివభక్తులు లింగోద్భవ పుణ్యకాలం కోసం వేయికళ్లతో నిరీక్షిస్తారు. మహాభిషేకాలతో, శివరాత్రి ప్రభలతో, కోడెమొక్కులతో, పార్వతీ కల్యాణాలతో శైవధామాలన్నీ కైలాస కోలాహలంగా మారిపోతాయి. ఆ మహాదేవుని తొలిరూపం సూర్యుడే అని చెబుతారు. సూర్యదేవుని మనవారు ప్రత్యక్ష శివునిగానూ నారాయణునిగానూ కూడా దర్శించారు. అటువంటి సూర్యుడు అవతరించిన రథసప్తమి మనకు ఈనెలలోనే (ఫిబ్రవరి 1) వస్తోంది. విష్ణుసహస్ర నామ స్తోత్రాన్ని అందించిన భీష్ముని పేరుమీదుగా ఏర్పడిన భీష్మ ఏకాదశి కూడా ఈ వరుసలో వచ్చే విశిష్ట పర్వమే. దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన శివాలయాల పరి చయంతో కూడిన శివదర్శనం చిరు పుస్తకాన్ని ఈనెల ప్రత్యేక అను బంధంగా అందిస్తున్నాం. శివరాత్రి శివుడు అందరికీ సకల శుభాలు ప్రసాదించాలని కోరుతూ...

➠ భగభగలాడే ఆ వెలుగుల ముద్ద యుగయుగాలుగా, తరతరాలుగా ప్రపంచానికి శక్తియుక్తుల్ని అందిస్తూనే ఉంది. అలుపే ఎరుగని అవిశ్రాంత యోధునిగా తూర్పునుంచి పడమరకు అనవరతం సంచరిస్తూ లోక బాంధవునిగా కీర్తినందుకుంటున్న ప్రత్యక్షనారాయణుడు – సూర్యభగవానుడు.

➠ సుప్రసిద్ధ అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవస్థానంలో రథసప్తమికి విశేష ఆరాధనలు జరుగుతాయి. ఆనాడు అరసవల్లి సూర్యనారాయణుడు భక్తులకు నిజరూప దర్శనం ఇస్తాడు.

➠ ప్రహ్లాద వరద గోవిందుడైన లక్ష్మీనృసింహుడు వెలసిన సంగమ క్షేత్రం అంతర్వేది. ఏటా మాఘమాసంలో రథసప్తమి నుంచి బహుళ పాడ్యమి వరకూ అంతర్వేది లక్ష్మీ నృసింహస్వామి కల్యాణోత్సవ, బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఈ నేపధ్యంలో అంతర్వేది క్షేత్ర ప్రశస్తి, బ్రహ్మోత్సవ వైభవ విశేషాలు.

➠ శిష్ట సంప్రదాయంలో లలితా ఆరాధనంగా ఈ శక్తి ఆరాధనం కనబడుతుంటే, జానపదుల్లో ఈ ఆచారం అమ్మతల్లుల పూజలు, జాతరల రూపంలో నిలిచి ఉంది. ఇలాంటి జాతరలలో మేడారం జాతర విశిష్టమైనది. ఇది తెలంగాణా ప్రాంతంలో జరిగే అతి పెద్ద, విశిష్ట గిరిజన జాతర. దీన్ని జానపదుల కుంభమేళాగా వర్ణించవచ్చు.

➠ శివుడు అంటే ఒక వ్యక్తి కాదు. మనలో ఉన్న శివత్వాన్ని ప్రతికణం నుంచి గమనిస్తూ జాగృతం కావడమే శివరాత్రి నాడు చేయవలసింది. సంఘర్షణల నుంచి వైరుధ్యాల నుంచి దూరంగా జరిగి సత్యం, శాంతి, ఆనందం సౌందర్యమనే శివతత్త్వాల వైపు మనల్ని మనం
నడిపించుకోవడమే శివరాత్రి అంటున్నారు శ్రీశ్రీ రవిశంకర్.

➠ సమస్త భువనాలకూ అధినేత్రి రాజరాజేశ్వరి. ఆమెను పట్టపురాణిగా చేసుకున్న ప్రభువు వేములవాడ రాజరాజేశ్వర స్వామి. తెలంగాణ ప్రజలు ఎములాడ రాజన్నగా పిలుచుకుంటారు. కోడెమొక్కులు చెల్లించి సంతాన భాగ్యాలు పొందుతారు. మహాశివరాత్రికి వేములవాడలో జాతర జరుగుతుంది.

➠ శివరాత్రి అంటే జాగారం... శివరాత్రి అంటే ఉపవాసం. శివరాత్రి అంటే శివస్మరణం... శివరాత్రి అంటే కోలాహలం. ఆరోజు అభిషేకాలలో మహాశివుడు నానుతూ ఉంటాడు. ఈ పర్వదినాన నిష్ఠనియమాలతో ప్రసన్నం చేసుకుంటే మహాశివుడు వరాలు కురిపిస్తాడు. 

➠ అది శ్రీకాళహస్తి. కైలాసం దిగివచ్చి పరమేశ్వరుడు విడిది చేసిన దివ్యభూమి. గట్టుల నొరయుచు ప్రవహించి వచ్చిన హేమముఖరి ఆగి ఆగి, ఒదిగి ఒదిగి భక్త మందారుని పాదాలను కళ్లకు అద్దుకుని సాగిపోతోంది.

Recent Comments