సప్త్యాశ్వ రథ మారూఢం - ప్రచండం కశ్యపాత్మజమ్
శ్వేతపద్మధరం దేవం - త సూర్యం ప్రణమామ్యహం

ప్రత్యక్ష నారాయణుడైన సూర్యదేవుడు మకరరాశిలో ప్రవేశిస్తూ తెలుగు లోగిళ్లకు సంక్రాంతి శోభలందిస్తున్నాడు. ఉత్తరాయణ పుణ్యకాలం ఆరంభమవుతోంది. పండగ సంబరాలతోపాటు పితృదేవతలను ఆరాధించుకునే పర్వం కూడా ఇదే. కొత్తధాన్యాలతో, పాలపొంగళ్లతో, రంగవల్లులతో వాకిళ్లు కళకళలాడుతుంటాయి. ఇంటి ఆడపడుచులు పుట్టింటిని సేవించే పండుగ సంక్రాంతి - అందరికీ సర్వ శుభాలు సమకూర్చాలని కోరుకుంటున్నాం. అక్రమ పాలకులపై తిరుగుబాటు జెండా ఎగరేసి ఆత్మబలిదానం చేసుకున్న ధీరవనితలు సమ్మక్క-సారలమ్మ. వారిని కీర్తిస్తూ స్ఫూర్తిని పొందే మేడారం జాతర జనవరి 31న అత్యంత ప్రభావవంతంగా జరగనుంది. భక్తితత్త్వాన్ని సంగీతమయం చేసిన అమృతమూర్తులు త్యాగయ్య ఆరాధనోత్సవం, పురందరదాసు, రామదాసుల జయంతి ఉత్సవాలు ఈ నెల విశేషాలు. భారతీయ తత్త్వ చింతనకు స్వర్ణగోపురంగా నిలిచిన స్వామి వివేకానందుని జన్మదినం ఈ నెల 12న సంక్రాంతి పర్వానికి నాందిగా నిలిచింది. అంతర్వేది నృసింహస్వామి కల్యాణం (26వ తేదీ) శ్రీశైల సంక్రాంతి బ్రహ్మోత్సవాలు భక్తులకు వేడుక చేయనున్నాయి. శబరిమలపై పవిత్ర మకర జ్యోతి జనవరి 14న సాక్షాత్కరించనుంది. దీక్షాధారులై శబరిమల వెళుతున్న లక్షలాది అయ్యప్ప స్వాములు క్షేమంగా యాత్ర ముగించుకు రావాలని, వారి దీక్షలు ఫలించాలని కోరుకుంటున్నాం. జనవరి 26న భారతీయులంతా ఆనందోత్సాహాలతో జరుపుకునే జాతీయ పండగ. పరస్పరం శుభాకాంక్షలందించుకునే సంతోషసమయం. నూతన సంవత్సరారంభ భక్తి సంచికతోపాటు 2018 రాశిఫలాలను అనుబంధంగా అందిస్తున్నాం.

➠ భిన్నత్వంలో ఏకత్వం కలిగిన భారతదేశంలో అందరి పండుగలు రెండున్నాయి. ఒకటి ఒకటి భారత స్వాతంత్ర్య దినోత్సవం, రెండోది గణతంత్ర దినోత్సవం. ఈ రెండూ జెండా పండగలు. మన దేశాన్ని ప్రేమించే వారంతా నిండుగా, హృదయపూర్వకంగా జరుపుకోవాల్సిన విశేష పర్వాలివి.

➠ అలంపురం జోగుళాంబ బాలబ్రహ్మేశ్వరుల బ్రహ్మోత్సవాలతో మాఘమాసం ప్రారంభమవుతుంది. అయిదోజున శ్రీపంచమినాడు జోగుళాంబాదేవి భక్తులకు నిజరూప దర్శనం అనుగ్రహిస్తుంది. ఆది దంపతుల కల్యాణోత్సవ వైభోగంతో అలంపురం క్షేత్రం దివ్యంగా అలరారుతుంది.

➠ భీష్మ ఏకాదశి విశిష్ట పర్వం. రాజ్యాధికారాన్ని స్వచ్ఛందంగా వదులుకున్న భీష్ముడు ఇచ్ఛా  మరణాన్ని వరంగా పొందాడు. వాత్సల్యం, భగవద్భక్తి మూర్తీభవించిన కరుణామృత సింధువు భీష్ముడు. జగతికి విష్ణుసహస్రనామ స్తోత్రాన్ని అందించాడు. ఉత్తరాయణ పుణ్యకాలంలో తనువు చాలించాడు. అష్టవసువుల్లో ఒకనిగా భీష్ముడు సదాపూజనీయుడు. 

➠ అక్షయమైన సంపదలను అందించేది అక్షరం. అది సరస్వతీ మాత అనుగ్రహ వరదానం. పుస్తకం, లేఖిని ఆమె ప్రధాన నివాసాలు. శారదాదేవి మూలస్థానం శశాంక సదనం. ఆమె విగ్రహం శుద్ధ జ్ఞానమయం. ఆమె జన్మదినమైన వసంత పంచమినాడు సరస్వతీ దేవిని ఆరాధిస్తే విద్యాభివృద్ధి కలుగుతుంది. 

➠ ‘దేవుడు మానవుణ్ణి తన పోలికలతో సృష్టించాడు’ అనే మాట తప్పు. మానవుడే దేవుణ్ణి తన పోలికలతో సృష్టించుకున్నాడు అనడం ఒప్పు. విశ్వమంతటా మనం మనకు ప్రతిరూపాలుగా దేవుళ్లను సృష్టించుకుంటున్నాం అన్నారు స్వామి వివేకానంద. ఆయన చేసిన అద్వైత వేదాంత ప్రబోధకమైన ఈ ప్రసంగం చదివితే యువజనుల్లో ఆయన రగిలించిన స్ఫూర్తి ఎలాంటిదో అర్ధమవుతుంది.

➠ అక్కడ భక్తి విశ్వాసాలే ప్రధాన ఆలంబన. అనాదిగా వస్తున్న ఆచార సంప్రదాయాలే ముఖ్యమైన ఆచరణ. పూజా విధానాలుండవు. ఉత్సవమూర్తులు ఉండరు. మూలవిరాట్ స్వరూపమేదీ కనిపించదు. అయినా లక్షలమంది భక్తులు ఉత్తుంగ తరంగాల్లా తరలివస్తారు. భక్తి ప్రభంజనం వెల్లువలెత్తుతుంది. ఆ మహా  సంరంభం... ఆ విశిష్ట సంబరమే మేడారం సమ్మక్కసారలమ్మ జాతర.

Recent Comments