నూతన ఆంగ్ల సంవత్సరం సంబరాలతో అడుగు పెడుతోంది. ప్రపంచ ప్రజలందరూ వారివారి సంప్రదాయ సంవత్సరం ఎప్పుడైనా, నిత్యకృత్యంలో మాత్రం వాడకానికి ఆంగ్ల క్యాలెండరునే అనుసరిస్తారు. అందువల్ల దీనికున్న ప్రాముఖ్యం మరి దేనికీ లేదు. భారతీయులు, మరీ ముఖ్యంగా దక్షిణాదివారు జనవరి 14, 15, 16 తేదీల్లో భోగి సంక్రాంతి కనుమ పండుగలను పెద్దపండుగగా మహోత్సాహంగా నిర్వహించుకుంటారు. మంచు పరదాలతో, బంతి చేమంతుల శోభలతో చలిమంటల వెచ్చదనపు ముచ్చట్లతో సంక్రాంతి నెలంతా పండగలా నడుస్తుంది. ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశించే ఈ తరుణంలో గతించిన పెద్దల్ని పేరుపేరునా స్మరించుకుని తర్పణలు విడుస్తారు. వారిపేరిట దానధర్మాలు చేస్తారు. ఏడాది పొడవునా తమతో శ్రమ పంచుకున్న పశుసంతతిని రైతులు కృతజ్ఞతాపూర్వకంగా అలంకరించి మంచిదాణాలతో సేదతీరుస్తారు. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా పండగ భోజనాలు చేస్తారు. బొమ్మలనోము, పిల్లకు భోగిపళ్లు వీటన్నింటికీ ఇంటింటా పేరంటాళ్లు సంక్రాంతి శోభకు ఆనవాళ్లు. రకరకాల జానపద కళాకారులు ఇంటిముందు తీర్చిదిద్దిన రంగవల్లుల్లో తమ విద్యలను ప్రదర్శించి మెప్పించి కొత్తధాన్యాలు కానుకగా అందుకుంటారు. ఇదొక మహాపర్వం. సంక్రాంతి శుభవేళ అందరికీ శుభాకాంక్షలు. బరిమల మకరజ్యోతి దర్శనం సంక్రాంతివేళ కనువిందు చేయనుంది. సరస్వతీ క్షేత్రాలలో ఈనెల 29న వసంత పంచమి వైభవంగానిర్వహిస్తారు. జనవరి నెల నిత్యం ఒక ప్రత్యేకతతో, ఆధ్యాత్మిక శోభతో సాగుతుంది. కొత్త సంవత్సర ఆరంభంలో అన్ని రాశులవారికీ తమ సంవత్సర ఫలాలను, ప్రముఖ జ్యోతిషవేత్తల విశ్లేషణలను ఈ సంచికలో పొందుపరిచాం. పన్నెండు రాశుల వారి జ్యోతిష ఫలితాలను విపులంగా సమకూర్చిన చిరుపుస్తకాన్ని భక్తిపత్రికతో అందుకోండి. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.

 

➠ వైష్ణవ క్షేత్రాల్లో ఉత్తరద్వార దర్శనం పెద్ద ఉత్సవం. దక్షిణాభిముఖుడైన స్వామిని ఉత్తరం వైపున నిలిచి సేవిస్తే సద్యోముక్తి లభిస్తుందని వైష్ణవాగమాలు చెపుతున్నాయి. అందుకు శ్రీరంగంలోని రంగనాథస్వామినే ప్రత్యక్ష ఉదాహరణగా చూపుతారు. ఇతర ఆలయాలలో కూడా భక్తులకు ఉత్తర ద్వారం నుంచి స్వామిని దర్శించుకునే అవకాశాన్ని కల్పించేందుకు ఉద్దేశించినదే ముక్కోటి ఏకాదశి. ఆనాడు వైష్ణవ క్షేత్రాలతో పాటు శైవక్షేత్రాలలోనూ ఇటీవల ఆ అవకాశం కలిగిస్తున్నారు.

➠ పండుగలు మన సంస్కృతికి చిహ్నాలు. మన సంప్రదాయానికి నిలువుటద్దాలు. మకర సంక్రాంతి తెలుగువారికి పెద్ద పండుగ. ధాన్యసిరులు ఇంటికి వచ్చే సంక్రాంతి పండుగను మనవారు ఉత్సాహంగా జరుపుకుంటారు. మకర సంక్రమణం ఖగోళరీత్యా కూడా
విశిష్టమైనది. భోగి, కనుమ మధ్యలో సంక్రాంతితో కలిపి ఈ పండుగ మూడురోజుల్లో పాటించాల్సిన సంప్రదాయ విశేషాలు ఎన్నెన్నో ఉన్నాయి. 

➠ అక్షయమైన సంపదలను అందించేది అక్షరం. అది సరస్వతీ మాత అనుగ్రహ వరదానం. పుస్తకం, లేఖిని ఆమె ప్రధాన నివాసాలు. శారదాదేవి మూలస్థానం శశాంక సదనం. ఆమె విగ్రహం శుద్ధ జ్ఞానమయం. ఆమె జన్మదినమైన వసంత పంచమినాడు సరస్వతీ దేవిని ఆరాధిస్తే విద్యాభివృద్ధి కలుగుతుంది. 

➠ దైవాన్ని సకలభోగాలతో పూజించే పండుగ భోగి. లోకారాధకుడైన దినకరుడిని ఆరాధించే పండుగ. కుటుంబాలన్నీ భోగభాగ్యాలతో తులతూగే పండుగ. పసిపిల్లకు భోగిపండ్లు పోసే పసందైన పండుగ. చలికి స్వస్తి పలుకుతూ ఊరూరా భోగిమంటలు వేసే భోగాల పండుగ. ఈ పండక్కి నెలనాళ్లముందు నుంచే తెలుగు లోగిళ్లన్నీ కళకళలాడుతుంటాయి. సరాగాలతో, ఆనందాలతో మకరసంక్రమణ పర్వం మహత్తరంగా గడిచిపోతుంది.

➠ ఆత్మీయ అనుబంధాల పల్లెలోగిళ్లలో నిజమైన సంక్రాంతి పండుగ శోభ కనుమ పండుగనాడు కానవస్తుంది. రైతుతో పాటు ఆరుగాలం శ్రమించే బసవన్నలకు అలంకరణలతో ప్రత్యేక పూజలు జరుగుతాయి. మానవ మనుగడకు సహకరించే పశుపక్ష్యాదులకు కృతజ్ఞతలు చెల్లించుకునే మహత్తర పర్వం కనుమ విశేషాలు.

➠ ధనుర్మాసం నెల్లాళ్లూ ఆడపిల్లలు ముంగిట ముగ్గులు పెడతారు. గొబ్బెమ్మలను అలంకరిస్తారు. గొబ్బిగౌరీవ్రతం, పెద్దసంక్రమణ నోము వంటి నోములు పడతారు. సంక్రాంతికి మహిళలు చేసుకునే వ్రతాల్లో బొమ్మలనోము ప్రత్యేకం.

Recent Comments