"గంగా గంగేతి యో బ్రూయాత్ యో జనానాం శతైరపి
ముచ్యతే సర్వపాపేభ్యో విష్ణులోకం స గచ్ఛతి"

మన సంస్కృతి జీవగంగ. ఏ నదినీళ్లు తాగి బతికినా గంగామాతగానే భావించడం భారతీయులకు అలవాటు. గంగా గంగా అని పదేపదే తలచే వారికి సర్వపాపాలూ హరించుకుపోతాయి. పరమపదం లభిస్తుంది. భగీరథుని తపస్సు వల్ల స్వర్గంలో ఉండే గంగ మన నేలపై ప్రవహించిందని విశ్వాసం. గంగాజయంతిని దశపాపహర దశమిగా నిర్వహించుకుంటాం. కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలతో జీవులు ఆచరించే పది రకాలైన పాపాలను గంగ కడిగేస్తుందని పెద్దలు చెబుతారు. గంగాజయంతి నాడు (జూన్ 1) గంగాస్మరణం ముక్తినిస్తుంది. ఇక భారతీయుల పరంపరాగత యోగవిద్యకు నేడు ప్రపంచమంతా నీరాజనం పడుతోంది. అంతర్జాతీయ యోగదినోత్సవం (జూన్ 21) మనందరికీ ఒక మహాపర్వదినంగా మారింది. మనలోని మానసిక, శారీరక, సామాజిక రుగ్మతలను నివారించే శక్తి యోగవిద్యకే ఉంది. వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవడానికి అనుదినం యోగాభ్యాసం అందరూ చేయాలి. ఈ సందర్భంగా యోగ శాస్త్రంపై విశ్లేషణాత్మక రచనలను అందిస్తున్నాం. యోగవిద్యకు మూలమైన శ్రీవిద్యా రహస్యాలను ఆదిశంకరులు సౌందర్యలహరి పేరుతో రచించారు. ఆదిశంకరుల కైలాస గమనం (3వ తేదీ) సందర్భంగా ఆ దివ్యకావ్యాన్ని స్మరించుకుందాం. కృషీవలుడైన రైతన్నకు కర్తవ్యం గుర్తుచేసే ఏరువాక పున్నమి (5వ తేదీ) చల్లని మేఘసందేశాలతో విచ్చేస్తోంది. అందరికీ నేత్రపర్వంగా కొనసాగే పూరీ జగన్నాథుని రథోత్సవం (జూన్ 23) దారిపొడవునా ఎన్నెన్నో గాథలు చెబుతూ మన ముందుకు రానుంది. ఆషాఢమాసం (జూన్ 22 నుంచి జూలై 20 వరకు) సందర్భంగా తెలంగాణ ప్రజలు శక్తిమాతకు భక్తితో బోనాలు సమర్పిస్తారు. కల్యాణోత్సవాలు జరుపుతారు. కరోనా నేపథ్యంలో ఉత్సవాల నిర్వహణల్లో మార్పు చేర్పులుంటాయి. కానీ మన మనసుల్లోని భక్తిభావంలో ఎటువంటి మార్పు ఉండదు. భక్తితో చేసే ప్రార్థనకు స్పందించడానికి భగవంతుడు ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటాడు. అదే మనకు శ్రీరామరక్ష. ఆ మనోధైర్యంతోనే మనం ముందుకు సాగాలి.

 

➠ ఆదిశంకరులు కైలాసగమనం అని మనకు పంచాంగాల్లో కనిపిస్తుంది. జ్యేష్ఠ శుద్ధ ద్వాదశినాడు శంకరులు కైలాసానికి వెళ్లినట్లు మనవారి విశ్వాసం. కైలాసం నుంచి అయ్య కానుకగా అయిదు చంద్రమౌళీశ్వర లింగాలను, అమ్మ కానుకగా సౌందర్యలహరిని శంకరులు తీసుకువచ్చారు. సాధకులకు, ముముక్షువులకు చరమలక్ష్యాన్ని సిద్ధింప చేసేది సౌందర్యలహరియే. తెలిసి చదివినా, తెలియక చదివినా ఫలితాన్నిస్తుంది.

➠ పది విధాలైన పాపాల్ని పోగొట్టే పర్వం దశపాపహర దశమి. జ్యేష్ఠ శుక్ల పాడ్యమి నుంచి దశమి వరకూ పదిరోజులపాటు వ్రతంగా ఆచరించాలి. సోమవారంనాడు హస్తా నక్షత్రంతో కలిసివచ్చినప్పుడు దశపాపహర దశమి వ్రతాన్ని ఆచరిస్తే మరింత విశేష ఫలం లభిస్తుంది.

➠ పూరీ జగన్నాథ రథోత్సవం ప్రపంచ ప్రసిద్ధి పొందింది. నీలమాధవుడు, పురుషోత్తముడు అని పురాణాలు వర్ణించిన దైవమే జగన్నాథుడు. కలియుగంలో ఆయనను దారుమూర్తిగా (చెక్కశిల్పం) అర్చిస్తున్నారు. భార్యా సమేతుడైన దైవాన్ని కాకుండా తోబుట్టువులతో కలిసి వున్న స్వామిని అర్చించడం జగన్నాథ క్షేత్రంలోనే కనిపిస్తుంది.

➠ చిత్తవృత్తుల నిరోధమే యోగం అని శాస్త్రం. అయితే మనసుపై అదుపు సాధించడం కష్టసాధ్యం. మనసు చేసే సంచలనాలు అన్నింటినీ సాక్షీభూతంగా చూడమంటుంది యోగం. తరువాత మనసును ఒడిసి పట్టమంటుంది. మనోనిగ్రహానికి ప్రధానమైనవి ప్రత్యాహారం, ధారణ. వీటిని హఠయోగం, ప్రాణాయామం విధానాల్లోసాధించడం కష్టం. ఇవి రెండూ రాజయోగులు మాత్రమే సాధించగలరు.

➠ సాధనతో విషయగ్రహణ శక్తి పెరుగుతుంది. తెలుసుకోవాలనే కుతూహలం పెరుగుతుంది. గ్రహణ శక్తి లేకపోతే మిమ్మల్ని ఎవరూ చేరుకోలేరు. జీవితం కూడా మిమ్మల్ని చేరుకోలేదు. మీరు ప్రతిదానినీ వదులుకోవాల్సి వస్తుంది. కొత్త విషయాలను గ్రహించాలంటే మీరు శారీరకంగా, మానసికంగా సుముఖంగా ఉండాలి. మీలోని శక్తియుక్తులన్నీ సంసిద్ధమై ఉండాలి. అలా మీరు సంసిద్ధులై ఉంటే మీ గురువే కాదు శివుడు కూడా మిమ్మల్ని చేరుకోవలసిందే అంటున్నారు ఈశా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు జగ్గీవాసుదేవ్. 

➠ గ్రహణాలు ప్రధానంగా నాలుగు రకాలుగా ఉంటాయి. సంపూర్ణ, అంగుళీయక, సంకర, పాక్షికమని వాటికి పేర్లు. జూన్ 21వ తేదీన ఏర్పడుతున్న సూర్యగ్రహణం అంగుళీ అంటే ఉంగరం వలె అంతరిక్షంలో కనిపిస్తుంది. చంద్రుడు అడ్డుకున్నప్పటికీ పూర్తిగా సూర్యుని అడ్డుకోడు. నల్లని చంద్రబింబం చుట్టూసూర్యుని కాంతి ఉంగరం వలె కనిపించడమే చూడామణి నామక సూర్యగ్రహణం. 

➠ నీటిబండిపై వచ్చే వరుణదేవా! నీ రథాన్ని భూమిపైకి పంపు అని వేదం కోరుకుంది. శ్రీకృష్ణదేవరాయలు ఏరువాక పున్నమినాడు రైతులను సత్కరించేవాడని చరిత్ర చెబుతోంది. ఏడాది పొడవునా దేశప్రజలందరూ తినే బువ్వను పండించడానికి రైతన్న చేసే తొలి ప్రయత్నమే ఏరువాక. 

➠ గ్రామీణ సంస్కృతికి నిలువుటద్దం బోనాలు. కులమతాలకు అతీతమైన ఉత్సవాలు బోనాలు. ఆషాఢమాసంలో ప్రకృతి పూజకు ప్రతీకలు బోనాలు. ఆదిశక్తి అమ్మదనానికి ఆనవాళ్లు బోనాలు. కొత్తకుండల్లో అమ్మతల్లికి అన్నం పెట్టే పర్వదినాలు బోనాలు.

➠ కంచి కామకోటి పీఠానికి వన్నె తెచ్చిన విశేష వ్యక్తిత్వ సంపద పరమాచార్య. ఎనిమిది దశాబ్దాలపాటు పీఠాధ్యక్ష పదవిని అనితర సాధ్యంగా నిర్వహించారు. దేశం నాలుగు చెరగులా పాదయాత్రలు చేశారు. సంశయాత్ముల సందేహాలను తీర్చారు. జిజ్ఞాసువులకు
జ్ఞానార్తిని చల్లార్చారు. ఆధ్యాత్మికవిదుల కు అపర ఆదిశంకరులుగా దర్శనమిచ్చారు. భక్తులు ఆయనను నడిచే దేవునిగా కీర్తించారు.

Recent Comments