ఎందును పుష్పసౌరభమ ఎందును మంద మదాలి ఝంకృతుల్
ఎందును సాంద్ర పల్లవము లెందును కోకిల కంఠ కూజితం
బెందును విస్ఫుర త్ఫలము లెందును కోమల కీర భాషితం
బందము లయ్యె మందమరు దంచిత చారు వనాంతరంబులన్

చాంద్రమానం అనుసరించే మనందరికీ సంవత్సరాది ఉగాది. మార్చి 18న కోయిల పాటలతో, షడ్రుచుల ప్రసాదంతో, పంచాంగ శుభ శ్రవణంతో విచ్చేస్తోంది. పూల దోసిళ్లతో, మామిడి తోరణాలతో శ్రీవిళంబినామ సంవత్సరానికి స్వాగతం పలుకుదాం. కందాయ ఫలాలు అందరికీ లాభసాటిగా ఉండాలని కోరుకుంటూ, అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుందాం. వసంతానికి ముందే ఫాల్గుణ పూర్ణిమ (మార్చి 1) రంగురంగుల హోలీ సంబరాన్ని తీసుకొస్తోంది. దేశమంతా ఉత్సాహంగా, ఉల్లాసంగా జరుపుకునే పండగ ఇది. సుఖ సంతోషాలు అందరికీ కలగాలని చిన్నా, పెద్దా, ఆడా, మగా కేరింతలు కొట్టుకుంటూ, బుక్కాలు జల్లుకుంటూ మైమర్చిపోతారు. ఈ హోలీ రంగుల వేడుకలు మనుషుల్ని దగ్గర చేస్తాయి. మానవ సంబంధాలను మెరుగుపరుస్తాయి. రసాయనాలు కాకుండా సహజ వర్ణాలు వాడుకుని తగు జాగ్రత్తలు తీసుకోండి. శ్రీసీతారామ కల్యాణం తెలుగువారికి మహోత్సవం. పచ్చని తాటాకు పందిళ్లు, వడపప్పు ప్రసాదాలు, చెరకు పానకాలు రామనవమి ఆనవాళ్లు. అటు భద్రాచలం (26న), ఇటు ఒంటిమిట్ట (30న) అటు పగలు, ఇటు రాత్రి భక్తిశ్రద్ధలతో, మేళతాళాలతో, పెళ్లి వ్యాఖ్యానాలతో నూతన వధూవరులుగా సీతారాములు శిరస్సున ధరించిన ముత్యాల తలంబ్రాలు కమనీయ శోభతో వెలిగిపోతాయి. శ్రీవిళంబి నామసంవత్సరంలో పన్నెండు రాశులవారికీ పంచాంగ ఫలితాలు యెట్లా ఉన్నాయో పొందికగా సమకూర్చి ఈ భక్తిపత్రిక అనుబంధంగా అందిస్తున్నాం.

➠ హనుమంతుని భక్తులకు ఎన్నడూ అపజయం లేదు. ఓటమి లేదు. లక్ష్యసాధనలో తనకంటూ ఒక నిర్దుష్ట మార్గాన్ని ఆచరణాత్మకంగా ప్రకటించిన కార్యసాధకుడు. అమేయ బలపరాక్రమ సంపన్నుడైనా అంతా రామనామ మహిమ అనే ఒక్కమాటతో అచంచలమైన స్వామిభక్తిని ప్రకటించే దాసానుదాసుడు. ఇన్ని సుగుణాల కలబోత కనుకనే ఆంజనేయుడు అందరి దైవంగా పూజలందుకుంటున్నాడు.

➠ శ్రీమహావిష్ణువు శిష్టరక్షణ దుష్టశిక్షణ కావిస్తూ లోకకల్యాణ కారకుడయ్యాడు. దశావతార అనుక్రమణికలో తొట్టతొలి అవతారం మత్స్యావతారం. ఈ సృష్టిలోని బుద్ధిజీవులకు మార్గనిర్దేశనం చేస్తూ విచక్షణ జ్ఞానాన్ని ప్రసాదించే మహద్గ్రంథాలు వేదాలు. అవి అపహరణకు గురైనప్పుడు శ్రీమహావిష్ణువు మహామత్స్యంగా అవతరించాడు.

➠ ఒంటిమిట్ట కోదండరామయ్య కల్యాణాన్ని అధికారికంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోంది. శ్రీరామనవమికి ఇక్కడ బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. చైత్ర పౌర్ణమికి ముందు రాత్రి పండువెన్నెల్లో కల్యాణం నిర్వహిస్తారు. ఒంటిమిట్ట కోదండరామయ్య వైభవం, కల్యాణాన్ని వీక్షించడం భక్తుల పూర్వజన్మ సుకృతం.

➠ వసంత రుతువు అడుగిడే వేళ ప్రకృతి ఆహ్లాదభరితమైన రసాకృతిని సంతరించుకుంటుంది. హరిత వర్ణ శోభతో ముస్తాబవుతుంది. మధుమాసవేళ వయోభేదాలు మరిచి వసంతాలాడతారు. ఆనందహేల హోళీ వెనుక సంప్రదాయ విశేషాలెన్నో ఉన్నాయి.

➠ నడిచేదేవుడు శ్రీచంద్రశేఖర సరస్వతీ స్వామి ఎంపిక చేసిన బాలస్వామి ఆయన. గురువైన శ్రీజయేంద్ర సరస్వతీ స్వామిని అనుక్షణం వెన్నంటి ఉంటారు. కామకోటి పీఠ పరంపరను నిలబెట్టే, పీఠ ప్రతిష్ఠను ఇనుమడింప చేసే కార్యక్రమాలను ముందుండి నడిపిస్తున్నారు. కుంభమాసంలోని ఉత్తరాషాఢ శంకర విజయేంద్ర సరస్వతీ స్వామి జన్మనక్షత్రం.

➠ ఆది శంకరులు ప్రతిష్ఠించిన దక్షిణామ్నాయ శృంగేరి శారదా పీఠం జగద్గురు స్థానం. అప్రతిహతంగా 36 తరాలుగా జగద్విఖ్యాతులైన గురుపరంపరను అందించిన విశిష్ఠ ధార్మిక కేంద్రం. ఆశ్రమ ధర్మానికి అచ్చమైన చిరునామాగా నిలిచిన జగదేక గురుసార్వభౌములు శృంగేరీ జగద్గురు పీఠ చక్రవర్తి శ్రీశ్రీశ్రీ భారతీ తీర్థ మహాస్వామి జన్మోత్సవ (మార్చి 23) వేళ భక్తి పత్రిక ప్రణతులర్పిస్తోంది.

Recent Comments