నమో వాయుపుత్రాయ భీమరూపాయ ధీమతే
నమస్తే రామదూతాయ కామరూపాయ శ్రీమతే

ఆనందోత్సాహాలతో, భక్తిప్రపత్తులతో జరుపుకునే హనుమజ్జయంతి (మే 21) వస్తోంది. అది ఒక మహాశక్తి ఉద్భవించిన రోజు. ఒక నిష్ఠాగరిష్ఠుడు ఆవిర్భవించిన రోజు. శ్రీరామదూతగా సేవలందించి ఘనకీర్తి పొందిన కార్యశూరుడు. రామబంటు అయినా ఆ రామునికి దీటుగా ఇలపై పూజలందుకుంటున్నాడు. సర్వసద్గుణవంతుడు హనుమ. మర్యాద, మాటతీరు ఎరిగిన అతులిత బలశాలి. సాక్షాత్తూ సూర్యునివద్ద విద్యలు నేర్చిన వేదవిద్యా పారంగతుడు. ఆ అవతారమూర్తి తత్త్వాన్ని పెద్దలీ సంచికలో వేర్వేరు కోణాలలో దర్శింపచేశారు. ఈ వైశాఖం మహనీయుల జన్మోత్సవ పర్వంగా, నిత్యోత్సవమై భాసిల్లుతోంది. మే1న శ్రీమద్రామానుజుల జయంతి. వెయ్యేళ్లనాడు అసమానతలపై సమరశంఖం పూరించిన సమతాయోగి ఆయన. ఆ విశిష్టాద్వైతమూర్తికి అంజలి ఘటిస్తున్నాం. ‘సంగీతము భక్తి వినా సన్మార్గము గలదే’ అంటూ జీవితాన్ని రామభక్తికి ధారపోసిన త్యాగరాజ జయంతి (మే 1) కూడా కలిసివచ్చింది. సీతాజయంతి, వాసవి కన్యక జయంతి (మే 5), నృసింహ జయంతి (మే 9), తరిగొండ వెంగమాంబ జయంతి (మే 9), నారద జయంతి, అన్నమయ్య జయంతి (మే 11) జిడ్డు కృష్ణమూర్తి జయంతి (మే 12) ఈ మాసాన్ని సంపన్నం చేస్తున్నాయి. మే భక్తి సంచికతో పాటుగా శ్రీసత్యనారాయణ స్వామి వ్రతవిధానాన్ని చిరుపుస్తకంగా ఉచితంగా అందిస్తున్నాం.

➠ స్త్రీ సహజమైన ఆత్మీయతకు, అనురాగానికి, సౌమ్యతకి, త్యాగానికి, పవిత్రతకు నిలువెత్తు నిదర్శనం వాసవీ కన్యకా పరమేశ్వరి. ఆమె పవిత్రధామాలు భారతదేశమంతటా ఉన్నాయి. 

➠ కృష్ణమూర్తి చెప్పేది అర్థం చేసుకోవడానికి ప్రత్యేకమైన వేదాంత పరిభాష నేర్చుకోవాల్సిన అవసరం లేదు. సామాన్యుల పరిభాషలోనే వేదాంతాన్ని చక్కగా విడమరిచారాయన. జటిల పదాడంబరాల పీటముడిని విప్పి, ఆధునిక మానవుని జీవితం ఆనందమయం కావడానికి తగిన ఆలోచనా ధోరణిని అలవాటు చేశారు.

➠ తిరుచానూరు పద్మావతీదేవిని దర్శించకుండా తిరుమల యాత్ర పరిపూర్ణం కాదు. పద్మసరస్సులో పుట్టి ఆకాశరాజు కూతురుగా శ్రీనివాసుని చేపట్టిన అలమేలు మంగ సాక్షాత్తూ మహాలక్ష్మియే. పద్మావతీ శ్రీనివాసుల వార్షిక కల్యాణం వైశాఖమాసంలో మూడురోజుల పాటు తిరుచానూరులో వైభవంగా నిర్వహిస్తారు.

➠ సుదర్శనక్రియాయోగంతో జీవనకళ నేర్పుతూ అందమైన జీవితాన్ని జీవించడం నేర్పుతున్న ఆధ్యాత్మికవేత్త శ్రీశ్రీ రవిశంకర్. మే 13వ తేదీన ఆయన జన్మదినం సందర్భంగా ప్రత్యేకవ్యాసం.

➠ త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఒకే లోగిలిలో కొలువుదీరిన అరుదైన సన్నిధి అన్నవరం. త్రిమూర్త్యాత్మకుడై మహేశ్వర సహితంగా అనంతలక్ష్మీ సత్యవతీదేవి సమేతుడై సత్యనారాయణుడు ఈ క్షేత్రంలో వర్థిల్లుతున్నాడు. వైశాఖమాసంలో శుద్ధ ఏకాదశినాడు శ్రీసత్యనారాయణస్వామి వార్షిక కల్యాణం నిర్వహిస్తారు.

➠ మానవాళిని దుఃఖబంధనాల నుండి రక్షించాలని తపనపడ్డవాడు గౌతమ బుద్ధుడు. దుఃఖానికీ ఓ కారణముందని, ఆ కారణానికీ ఓ నివారణ ఉందని, ఆ నివారణకీ ఓ మార్గముందని చెప్పి ప్రపంచానికి సరైన దారిని చూపాడు తథాగతుడు. ఆ మార్గమే ‘అష్టాంగ మార్గం’.

Recent Comments