సత్య దేవుడు భక్త సులభుడు. చిన్న వ్రతంతో కోరిన వరాలు కురిపిస్తాడు. తెలుగువారి ఇలవేలుపు. ఈ మాసంలోని అన్నవరం సత్యనారాయణుని కల్యాణోత్సవం అత్యంత వైభవంగా జరగనుంది. అందులో పాల్గొని ఆ స్వామి వారి కృపకు పాత్రులమవుదాం. అద్వైతమూర్తి ఆదిశంకరాచార్య జయంతి వైశాఖమాసానికి వన్నె తెస్తుంది. ఈ సారి సమతామూర్తి రామానుజుని పుట్టినరోజు కూడా ఒకే రోజు రావడం గొప్ప విశేషం. అలాగే సింహాద్రి అప్పన్న చందనోత్సవం అక్షయ తృతీయ వేళ జరుగుతుంది. ఆరోజు స్వామివారి నిజరూప దర్శనం లభిస్తుంది. సంస్కరణ వాది బసవేశ్వరుడు పుట్టిన రోజు కూడా అదే రోజున వస్తుంది. మే 13న ఆధునిక యోగి పుంగవుడు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ సృష్టికర్త శ్రీశ్రీ రవిశంకర్ జన్మదినం. ఆయనను అనుసరించి జీవితాన్ని పండించుకుందాం. ఆత్మర్పణం చేసుకున్న అపరదేవత, వాసవీ కన్యక పుట్టినరోజు ఈ మాసాన్ని మరింత సుసంపన్నం చేస్తుంది. భవిష్యవాణిని దివ్యశక్తితో దర్శించి, తత్త్వాలుగా బోధించి, పామరులను కూడా చైతన్యపరచిన వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధనోత్సవం భక్తిప్రపత్తులతో నిర్వహించుకుంటారు. మానవజాతికి ఒక సందేశంగా అందిన బుద్ధదేవుడు విశాల విశ్వానికి వెన్నెలలు పంచాడు. వెన్నెలకు తావి అబ్బిన బుద్ధపూర్ణిమ మే18. దేశమంతా భక్తి ప్రపత్తులతో జరుపుకొనే పెద్ద ఉత్సవం హనుమాన్ జయంతి.అన్నవరం క్షేత్రం నిత్యకల్యాణం పచ్చతోరణంగా అలరారుతుంది. ప్రతినిత్యం అక్కడ మంగళవాద్యాలు, పెళ్లి బాజాలు, వీనులు విందు చేస్తాయి. సత్యనారాయణ స్వామి, అమ్మవార్లకు తామే కల్యాణ కర్తలుగా వ్యవహరించి కల్యాణం చేయించాలని భక్తులు ఉవ్విళ్లూరు తుంటారు. ఐఎల్ఎన్ చంద్రశేఖర్ రావు రాసిన శ్రీ 'సత్యదేవుని సేవకు రారండీ' వివరణ చూద్దాం.

➠ ఏవ్రతమైనా, జపమైనా, హోమమైనా, దానాదులైనా అక్షయ తృతీయ నాడు చేస్తే ఫలితం ఉంటుంది అంటారు. పుణ్య కార్యాచరణ వల్ల వచ్చే ఫలితమే కాదు... పాప కార్యాచరణ వల్ల వచ్చే పాపం కూడా ఈనాడు చేసినది ఏనాటికీ క్షీణించనంత పెద్దదిగా మారుతుంది. ధూళపాళ మహదేవమణి రాసిన 'అక్షయ తృతీయ' వివరణ చూద్దాం. 

➠ నిరంతరం మైపూతగా శ్రీచందనాన్ని ధరించే సింహాద్రి అప్పన్న పరమ శాంతమూర్తి. ఏడాదికి ఒకసారి అక్షయ తృతీయ నాడు మాత్రమే నిజరూపాన్ని అనుగ్రహిస్తాడు. దర్శనం చేసి వరం వేడుకున్న క్షణంలోనే అనుగ్రహించే కారుణ్యమూర్తి అప్పన్న చందనోత్సవ విశేషాలు తెలుసుకొనేందుకు 'మంగళమూర్తికి చందన సేవ' వివరణ చూద్దాం. 

➠ ఉత్సవమంటే ఉత్కృష్ణమైన రసాన్ని పిండుకోవడం అని అర్థం. జయంత్యుత్సవం నాడు విశిష్టులైన గుణకర్మలను విశ్లేషించుకోవాలి. వాటిని సాధ్యమైనంత వరకు అనుసరిస్తూ...అనుకరించడానికి ప్రయత్నించాలి. ఆ మహానుభావుణ్ని గుర్తు చేసుకొని మహదానంద రసాన్ని పిండుకొని ఆస్వాదించే సమయం జయంతి. ఉగ్రత్వం ఉట్టిపడే నరసింహస్వామి అవతారం వెనుక ఎన్నో యోగరహస్యాలున్నాయి. డా. ముంజులూరి నరసింహారావు రాసిన 'నృసింహ జయంతి' వ్యాసంలోని వివరణ చూద్దాం. 

➠ అదేవిధంగా 'అమృత రసాత్మకం శంకర స్మరణం', డా. పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ రాసిన 'వేదాంత శిఖరపతాకం', శ్రీ రామానుజ దర్శనం, శ్రీ కన్యకా పరమేశ్వరి, డా.కప్పగంతు రామకృష్ణ రాసిన ఆంజనేయం.. మహావీరం, డా. కె. చెన్నకేశవ రెడ్డి రాసిన నీ మూర్తి తిలకించి... దత్తావధూత, డా. యల్లాప్రగడ మల్లికార్జున రావు రాసిన నందామయా గురుడ... డా. దండెబోయిన పార్వతీదేవి రాసిన శ్రమలోనే శివుడున్నాడు వంటి వ్యాసాలను చూడవచ్చు. 

➠ అంతేకాకుండా బొర్రా గోవర్ధన్ రాసిన ఆదర్శ ధార్మికుడు, ధ్యానమే వరం, ఆదోని తిక్కలక్ష్మవ్వ, డా. జి.వి పూర్ణచందు రాసిన తాంబూల సేవ వంటి వ్యాసాలను చూడవచ్చు. 

➠ ఇంకా మాసఫలం వంటివే కాకుండా ఈ సంచికతోపాటు ధర్మ సందేహాలకు సమాధానాలతో కూడిన చిరు పుస్తకాన్ని ఉచితంగా అందిస్తున్నాం.

Recent Comments