దీపదో లభతే విద్యాం దీపదో లభతే శ్రియం
దీపదో లభతే చాయుః దీపదో లభతే దివం

మహాదేవుని దయ, మహనీయుల దివ్యాశీస్సుల బలం వల్ల మేం సంకల్పించిన నాటినుంచి ఇప్పటి దాకా కోటి దీపోత్సవం దిగ్విజయంగా సాగుతోంది. అశేష భక్తజనం మా సంకల్పాన్ని సమాదరిస్తూ సహకరిస్తూ ఉత్సవానికి వెలుగులద్దుతున్నారు. అందరికీ వినమ్ర ప్రణామాలు. భాగ్యనగర వాసులు దీపోత్సవానికి ఆకర్షితులై ఐచ్ఛికంగా విచ్చేసి భక్తిప్రపత్తులతో ఇందులో పాల్గొంటున్నారు. దీపోత్సవంలో చోటు చేసుకుంటున్న పీఠాధిపతుల, మఠాధిపతుల అనుగ్రహ భాషణాలు, పెద్దల ప్రవచనాలు, మహనీయుల మంగళాశాసనాలు, అనేక భక్తిపరమైన సాంస్కృతిక కార్యక్రమాలతో వెన్నెలకు పరిమళం అబ్బుతోంది. ఈ సంవత్సరం తెలంగాణలోనే (అక్టోబర్ 22వ తేదీనుండి నవంబర్ 5వ తేదీ దాకా) కాకుండా, దీనికి కొనసాగింపుగా విజయవాడలోని పి.డబ్ల్యు.డి గ్రౌండ్స్ లో (నవంబర్ 6వ తేదినుంచి 13వ తేదీ దాకా) కూడా కోటిదీపోత్సవం ఇదే ఒరవడిలో ఇదే స్ఫూర్తితో మహనీయుల దివ్యాశీస్సులతో జరగనుంది. ఇది మా రచనా టెలివిజన్ చేసుకున్న సుకృతం. ఉభయ తెలుగు రాష్ట్రాల భక్తజనం మీకు అనువైన చోటికి విచ్చేసి ఈ దీపయజ్ఞాన్ని జయప్రదం చేయాలని ప్రార్థిస్తున్నాము. కార్తికానికి మరో సలక్షణమైన ప్రత్యేకత ఉంది. సమతను, మమతను పెంచే కార్తిక వన సమారాధనలు. కార్తిక మాస లక్ష్యాన్ని చాటి చెబుదాం. తరతమ భేదాలులేని సమూహ కార్తిక వనభోజనాలను మాత్రమే ప్రోత్సహిద్దాం. ఈ కార్తిక సంచికను మహాదేవుని దివ్యతత్త్వాన్ని స్తుతిస్తూ ఒక మారేడుదళంగా సమర్పించుకుంటున్నాం. తిరునాళ్లుగా సాగుతున్న దీపోత్సవ విశేషాలలో తొలి మూడునాళ్లను సచిత్రంగా పొందుపరిచాం. కార్తికంలో సర్వత్రా అయ్యప్ప దీక్షలు స్వీకరించి భక్తులు మాలలు ధరిస్తారు. ‘స్వామియే శరణమయ్యప్ప’ అనే శరణుఘోష శబరిమల దాకా చేరుతుంది. దీక్షాధారులకు కరదీపికగా అయ్యప్ప పూజావిధి, నిష్టలూ - నియమాలు తెలిపే చిరుపుస్తకాన్ని ఈ సంచికతో ఉచితంగా అందుకోండి. అయ్యప్ప స్వాముల దీక్షలు సఫలం కావాలని కాంక్షిస్తూ..

➠ ఆశ్వయుజ అమావాస్య మానవులకు దీపావళి. కార్తిక పున్నమి దేవ దీపావళి. అందుకు గుర్తుగానే కార్తికపున్నమినాడు శివాలయాల్లో జ్వాలాతోరణం నిర్వహిస్తారు. జ్వాలాతోరణ భస్మాన్ని భక్తులు దిష్టిచుక్కగా ధరిస్తారు. జ్వాలాతోరణంలో పాల్గొంటే సమస్త దోషాలు నశిస్తాయి. సకలశుభాలూ కలుగుతాయి.

➠ నేటి విద్యార్థులే రేపటి గురువులు. అయినప్పటికీ నేర్చుకోవడం ఏ స్థాయిలోనూ ఆగకూడదు. నిత్య విద్యార్థిగా ఉండేవాడే అసలైన వివేకవంతుడు. అటువంటివాడే తాను నేర్చుకుంటూ ఇతరులకు నేర్పగలుగుతాడు. ప్రకృతి గురువు. విశ్వం గురువు. దైవమే అసలైన గురువు అంటారు భగవాన్ సత్యసాయిబాబా.

➠ ఓంకారాన్ని ప్రతిధ్వనింపజేసే శంఖరావాలు.. డమరుకధ్వనులు వేదమంత్రాలతో మార్మోగే పండితుల చతుర్వేద పారాయణలు పరమనిష్టాగరిష్టులైన జగద్గురువులు, పీఠాధిపతుల ఆశీర్వచనాలు ప్రదోషకాలవేళ మహాదేవునికి జరిగే అభిషేకాలు.. బిల్వార్చనలు వివిధ క్షేత్రాల దేవతామూర్తుల దివ్య భవ్య కల్యాణోత్సవాలు బ్రహ్మోత్సవాలను తలపించే వైభవోపేత వాహనసేవలు భక్తులే స్వయంగా నిర్వహించుకునే విధంగా విశేష పూజలు అపూర్వ అద్వితీయ సాంస్కృతిక నృత్య నీరాజనాలు కైలాస ప్రాంగణాన్ని ప్రకాశింపజేసే కోటిదీపాల కాంతులు వెరసి.. మహాదేవునికి జరిగే మహాదీపయజ్ఞం.... భక్తిటీవీ కోటిదీపోత్సవం.

➠ కురుక్షేత్రంలో మార్గశీర్షమాస శుద్ధ  ఏకాదశినాడు మరోసారి భగవద్గీతగా చెప్పాడు. ఆ తిథిలో ఒక పరమార్ధముంది. ఏకాదశ అంటే మనస్సుతోసహా పదకొండు ఇంద్రియాలూ విశుద్ధమైనప్పుడు, వెనుబాము ‘మార్గం’ మీదుగా ఆత్మసంస్థానమైన ఏడోచక్రమున్న ‘శీర్షం’ దిశగా సాగిపోవటం... అదే గీతాయోగం.

➠ గురువాయూరప్ప భక్తసులభుడు. కోరుకున్నవారికి కోరుకున్నరీతిగా దర్శనమిస్తాడు. మూగజీవాలకు సైతం మోక్షమిచ్చాడు. ఏనుగు సైతం ఏకాదశి ఉపవాసం చేసిన మహాక్షేత్రం గురువాయూర్. మార్గశిరమాసంలో శుద్ధ ఏకాదశి తిథినాడు గురువాయూర్ ఏకాదశి మహోత్సవం జరుగుతుంది.

➠ తిరుచానూరులో వెలిసిన శ్రీపద్మావతీ అమ్మవారికి కార్తికమాసంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. అమ్మవారి జన్మతిథి అయిన కార్తిక బహుళ పంచమి నాడు పంచమీతీర్థంతో ఈ ఉత్సవాలు పూర్తవుతాయి. విశ్వనాయకి, జగన్మాత అయిన అలమేలు మంగమ్మకూ శ్రీవారి వలెనే అన్ని కైంకర్యాలూ, వాహనసేవలూ నేత్రపర్వంగా నిర్వహిస్తారు.

Recent Comments