దేశమంతా ఎంతో భక్తితో జరుపుకొనే దేవీ నవరాత్రులు ఈ నెల ప్రత్యేక శోభను తెస్తున్నాయి. కాశ్మీరం నుంచి కన్యాకుమారి వరకు ఆ శక్తి స్వరూపిణిని భక్తజనం నవరూపాల్లో ఆరాధించి తరిస్తుంటారు. బొమ్మల కొలువులు, పూజలు, వ్రతాలు, ఉత్సవాలు వ్రతాలతో పరవశత్వాన్ని పొందుతారు. తెలంగాణ ఆడపడుచులు పచ్చపూల బతుకమ్మని తెప్పమ్మని చేసి కొలుస్తారు. జానపదాలు తంగేడులై, తురాయిపూలై, పసుపు కుంకుమలై ప్రతిఫలిస్తాయి. సద్దుల బతుకమ్మ వాల్లాడింపుతో దుర్గాష్టమినాడు ఈ కోలాహలం ముగుస్తుంది. ఈ నెలలోనే మహాలయ అమావాస్య వచ్చింది. గతించిన పెద్దలందరినీ నియమ నిష్టలతో తలచుకుంటూ వారికిచ్చే సంబారాలను దానధర్మాల రూపంతో సమర్పిస్తారు. విజయనగరం పైడితల్లి సిరిమానోత్సవం ఈ నెల 23న రానుంది. ద్వారకాతిరుమల కల్యాణోత్సవం కూడా అదేరోజు వచ్చింది. ఇంకా శ్రీ మద్వాచార్య దివ్య ప్రబోధాలను స్మరించుకొనేందుకు వారి జయంతి కూడా అక్టోబర్ 18న వస్తోంది. అంతేకాకుండా శ్రీశిరిడి సాయి సమాధి ఉత్సవం కూడా ఇదే రోజు.

➠ విశ్వమంతా వ్యాపించి, నిర్వహించే పరమ చైతన్యాన్ని జగదంబగా ఆరాధించే సంప్రదాయానికి శాక్తేయమని పేరు. ఏ శక్తి కారణంగా బ్రహ్మాది పిపీలిక పర్యంతం చైతన్యమౌతుందో ఆ శక్తే దేవి. ఇది విశ్వజనని పేరుతో సామవేదం షణ్ముఖశర్మ రాసిన వివరణ చూద్దాం.

➠ ఆశ్వయుజ మాసంలో అమ్మ గాథలను వివరించే దేవీ భాగవతాన్ని స్మరించడం పుణ్యప్రదం. దేవీ గాథలన్నింటికీ ఉనికిపట్టు. అష్టాదశ పురాణాలలో పురాణరాజం దేవీభాగవతం. ఎర్రాప్రగడ రాసిన సామాజిక తత్త్వశాస్త్రం దేవీ భాగవతం వివరణ చూద్దాం.

➠ అరవైనాలుగు ఉపచారాలను అందుకోవడానికి జగదంబకే అధికారం ఉంది. ఆదిశంకరులు కర్ణాటకలోని మూకాంబికా క్షేత్రంలో చతుష్షష్టి కళలతో జగదంబను దర్శించారు. అప్పాల శ్యామప్రణీత్ రాసిన జగదంబకు 64 ఉపచారాలు వివరణ చూద్దాం.

➠ సంవత్సర ప్రారంభంలో వచ్చే వసంత రుతువు, శరదృతువు  ప్రజానీకానికి చాలా ప్రమాదకరమైనవి. అందుకే ఆయా రుతువులలో శుక్ల పక్షంలో పాడ్యమి నుంచి నవమి వరకు తొమ్మిదిరోజుల పాటు అమ్మవారిని ఆరాధించాలి. ఈ విషయాన్ని మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి రాసిన దేవీ అర్చనం వివరణ చూద్దాం.

➠ ఇంకా పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ రాసిన శ్రీమాత్రే నమ:, ఈమని కృష్ణ రాసిన జయహో దుర్గాభవానీ, దండెబోయిన పార్వతీదేవి రాసిన లోక శుభంరకి అనే వివరణలు చూద్దాం.

➠ ఇంకా వీటితో పాటు ధర్మప్రియ రాసిన జ్ఞానానికి మూలం శ్రద్ధ, మాసఫలం వంటివి.. నవరాత్రి ఉత్సవాల సమయంలో దసరా పూజలలో భక్తులకు కలిగే ధర్మ సందేహాలను నివృత్తి చేసే చిరుపుస్తకాన్ని ఈ సంచికతో అందిస్తున్నాం.

Recent Comments