"దీపం జ్యోతిః పరంబ్రహ్మ దీపం సర్వతమోపహం
దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీప నమోస్తుతే"

కార్తికం అత్యంత పవిత్ర మాసం. మహాదేవునికి ప్రీతిపాత్రమై, ఆధ్యాత్మిక నిష్ఠనియమాల పుణ్య మాసం. దీపారాధనలు, ఉపవాస దీక్షలు శివ జాగరణలతో పొద్దు తెలియక అనునిత్యం విలక్షణంగా ఉంటుంది. అన్ని రకాల భేద భావాలను పక్కన పెట్టి, అందరూ కలిసి ఏకబంతిన వనభోజనాలు చేయడం ఈ మాసపు ప్రత్యేకత. ఉసిరి దీపాల సాక్షిగా ఈ సమబంతి భోజనాలను భక్తితో సదాశయంతో నిర్వహించుకుందాం. మానసిక వత్తిళ్ల నుంచి ఊరట చెందుదాం. క్షీరాబ్ధి ద్వాదశి, అన్నవరం సత్యదేవుని తెప్పోత్సవం, శని త్రయోదశి ముప్పేటగా ఈ నెల 9న కలిసి వస్తున్నాయి. అపూర్వ పుణ్యబలాన్ని అందించే కార్తిక పూర్ణిమ నవంబరు 12న రానుంది. అదేరోజు జ్వాలాతోరణం శివాలయాలకు వినూత్న వెలుగులు అందిస్తుంది. గత ఏడేళ్లుగా కార్తికమాసంలో భక్తిటీవీ అపూర్వరీతిలో కోటిదీపోత్సవం నిర్వహిస్తోంది. ఈ ఏడాది కూడా ఆ సంప్రదాయాన్ని శ్రద్ధాభక్తులతో కొనసాగించనుంది. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ స్టేడియం వేదికగా నిర్వహించే భక్తి టీవీ కోటిదీపోత్సవంలో పాల్గొనడానికి మీ అందరికీ ఇదే ఆహ్వానం. రండి... తరలిరండి. దీపమహాయజ్ఞంలో పాల్గొని తరించండి. 

➠ కార్తికం సాధనామాసం. దక్షిణాయనంలో వచ్చే ఈ పుణ్యమాసంలో జీవుడు పరమేశ్వరుణ్ణి చేరుకోవడానికి కావలసిన సాధన ముఖ్యంగా చేయాలి. శివకేశవ అభేదమైన ఉపాసన చేయాలి. కార్తిక మాసంలో నదీస్నానం, దైవదర్శనం, దీపారాధన, ఉపవాసం అత్యంత ముఖ్యమైనవి.

➠ కార్తిక పౌర్ణమికి దీపారాధన అందరూ చేస్తారు. లోగిళ్లలో, ఆలయాలన్నింటిలో ప్రమిదలలో ఆవునేతి దీపాలను పెద్దసంఖ్యలో వెలిగిస్తారు. దీపోత్సవాలతో పాటు శివాలయాల్లో జ్వాలాతోరణం ప్రత్యేక ఉత్సవంగా నిర్వహిస్తారు.

➠ తిరుమల బ్రహ్మోత్సవాలలో స్వామి వివిధ వాహనాలపై మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులను అనుగ్రహిస్తాడు. పేదల తిరుమలయ్యగా ప్రఖ్యాతిగాంచిన కురుమూర్తి క్షేత్రంలో స్వామివారి పాదుకలు సైతం ఊరేగుతాయి. తెలంగాణ తిరుపతి కురుమూర్తి ఉద్దాలోత్సవంలో లక్షలాది భక్తులు పాల్గొంటారు.

➠ కార్తిక శుద్ధ ద్వాదశినాడు పంపానదిలో అన్నవరం సత్యదేవునికి తెప్పోత్సవం జరుగుతుంది. కార్తిక పౌర్ణమికి భక్తులు విశేష సంఖ్యలో రత్నగిరి ప్రదక్షిణలో పాల్గొంటారు.

➠ శివ కేశవులిద్దరికీ ప్రీతికరమైన కార్తికమాసంలో విశిష్ట పర్వదినం క్షీరాబ్ధిద్వాదశి. ఈరోజున చేసిన విష్ణుపూజ విశేష ఫలితాన్నిస్తుంది. కార్తిక శుక్ల ద్వాదశిని క్షీరాబ్ధి ద్వాదశిగా నిర్వహించుకుంటారు. తులసీ దామోదర కల్యాణం నిర్వహిస్తారు. చాతుర్మాస్య దీక్షలను విరమిస్తారు.

➠ కార్తికం వచ్చిందంటే కొండల మీంచి దివ్వెలు దిగివస్తాయి. భక్తిటీవి కోటిదీపోత్సవంలో దీపశిఖలు నేలపై రెపరెపలాడుతూ కోటికాంతులు పంచుతాయి. ఓంకారానికి వంతపాడే శంఖారావాలు, డమరుక ధ్వనులు, ఘనాపాఠీల వేదపారాయణలు, జగద్గురువుల అనుగ్రహ భాషణాలు, పీఠాధిపతుల దివ్య  ఆశీర్వచనాలు, మాతృశ్రీల మంగళాశాసనాలు దీపోత్సవ ప్రాంగణానికి ఆధ్యాత్మిక శోభని సంతరిస్తాయి. ప్రదోషవేళ మహాదేవునికి ప్రీతిపాత్రమైన అభిషేకాలు, బ్రహ్మోత్సవంగా వివిధ వాహన సేవలు, వైభవంగా దేవీదేవతల కల్యాణాలు, విశేష పూజలు విచ్చేసిన భక్తుల మనసులను భక్తిపారవశ్యంలో మునకలు వేయిస్తాయి. భక్తిటీవి అందిస్తున్న వార్షిక సంప్రదాయం కోటిదీపోత్సవం ఈ ఏడాది కూడా హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో నవంబర్ 3 నుంచి 18వరకు జరగనుంది. 

Recent Comments