దీపలక్ష్మి మహాలక్ష్మి సర్వవిద్యా ప్రకాశినీ
విద్యాందేహి శ్రియందేహి సర్వకామ్యాంశ్చ దేహిమే

చీకట్ల పోకార్చి భువనమంతా వెలుగులు విరజిమ్మే దీపావళి ఒక సందేశమై ఈ నెల 19న వేడుక చేస్తోంది. దివ్య దీపావళి అందరికీ శాంతిని, కాంతిని ప్రసాదించాలని ఆకాంక్షిస్తున్నాం. ఈ నెల ఆరంభంలోనే (3వ తేదీన) వస్తున్న సిరిమానోత్సవం తూర్పు దిక్కుకు పెద్ద పండగ. పైడితల్లి అందరినీ చల్లగా చూడాలని వేడుకుందాం. మన తెలుగు పల్లెలు ఆడపడచుల రాకతో కళకళలాడే అట్లతద్ది (8వ తేదీ) కొమ్మకొమ్మకి ఊయలల్తో సందడి చేయనుంది. ఆదికవి వాల్మీకి మహర్షి జయంతి, యాజ్ఞవల్క్య మహర్షి జయంతులు ఈ మాసపు విశేషాలు. ఈ నెల 21న శ్రీచినజీయర్ స్వామి జన్మోత్సవం. వారి తపోఫలాలు, మంగళశాసనాలు మనందరికీ అందుతాయి. కార్తికం భక్తి టీవీకి ప్రత్యేకం, మణిపూస. యేటేటా జరిపే కోటి దీపోత్సవాన్ని ఈ పొద్దు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ నిర్వహించ సంకల్పించింది. మహనీయులు, మఠాధిపతులు, మాతాజీలు విచ్చేసి దీపోత్సవానికి దివ్యత చేకూర్చనున్నారు. ఈ దీపయజ్ఞంలో విరివిగా పాల్గొని మా సంకల్పాన్ని సఫలం చేయండి. అందరూ సద్భావనలతో, శాంతి సహనాలతో సదాశివుని సేవించుకోవాలని కోరుకుంటూ...

➠ సత్యజ్ఞానాలకు సంకేతం పరబ్రహ్మ స్వరూపం. దానికి లక్ష్యభూతుడు శ్రీరాముడు. తన ధర్మ, న్యాయ ప్రవర్తనతో రాముడు పురుషోత్తముడై ప్రకాశించాడు. రామకథను గానం చేసి వాల్మీకి మహర్షి లోకాన్ని ఉద్ధరించాడు. ఆశ్వయుజ పౌర్ణమి వాల్మీకి జయంతి సందర్భంగా...

➠ మీరాబాయి జీవితం ఆధ్యాత్మిక వేత్తలకు, సాహితివేత్తలకు, కళాకారులకు ప్రేరణ. భగవంతునిపై అచంచలమైన ప్రేమతో శ్యామసుందరుడైన గోపాలకృష్ణుడే భర్తగా భావించి జీవితం త్యాగం చేసిన ఆ భక్తురాలి చరిత్ర ఈ నేలపై కేవలం కొన్ని వందల ఏండ్లకు పూర్వమే జరిగింది. ఆధ్యాత్మిక జగత్తులో మీరాస్థానం అజరామరం.

➠ తిరుమల బ్రహ్మోత్సవాలలో స్వామి వివిధ వాహనాలపై మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులను అనుగ్రహిస్తాడు. పేదల తిరుమలయ్యగా ప్రఖ్యాతిగాంచిన కురుమూర్తి క్షేత్రంలో స్వామివారి పాదుకలు సైతం ఊరేగుతాయి. తెలంగాణ తిరుపతి కురుమూర్తి ఉద్దాలోత్సవంలో లక్షలాది భక్తులు పాల్గొంటారు.

➠ ఏటా ఆశ్వయుజ బహుళ తదియని అట్ల తదియ, అట్ల తద్దిని జరుపుకుంటారు. ప్రధానంగా ఇది గ్రామీణుల పండగ. అశూన్యశయన వ్రతం, చంద్రోదయ ఉమావ్రతం అనే పేర్లతో మన పంచాంగాల్లో పేర్కొంటారు. కానీ జానపదులు పిలుచుకునే అట్లతద్ది అనే పేరు ఎక్కువ ప్రాచుర్యం పొందింది.

➠ కళల కాణాచి విజయనగరంలో భక్తులకు కొంగుబంగారమై భాసిల్లుతోంది పైడిమాంబ. విజయదశమి తరువాత వచ్చే మంగళవారం నాడు పైడితల్లికి సిరిమానోత్సవం జరుగుతుంది. ఈ ఉత్సవానికి ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తారు. విజయనగరంలో తొలిసారి సిరిమానోత్సవం 1758లో నిర్వహించారు.

➠ నాగుల చవితినాడు పుట్టకు పూజచేస్తారు. పుట్టమన్ను పవిత్రం. సారవంతం. కుమారస్వామిని సర్పరూపంలో పూజిస్తాం. కార్తికమాసంలో సూర్యుడు కామానికి, మృత్యువుకూ స్థానమైన వృశ్చికరాశిలో సంచరిస్తాడు. ఆ సమయంలో నాగారాధన వల్ల కామాన్ని, మృత్యువును జయించే సిద్ధి కలుగుతుంది. అందుకే కార్తికమాసమంతా నాగారాధన ప్రత్యేకంగా చేస్తారు.

Recent Comments