యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః

విశ్వమంతా ఆవరించివున్న పంచభూతాలలోనూ శక్తిరూపంలో జగన్మాత కొలువై ఉంటుంది. అటువంటి తల్లిని దేవీ నవరాత్రుల పేరిట భక్తిపూర్వకంగా ఆరాధిస్తారు. చెడుపై మంచి సాధించిన గెలుపుకు ప్రతీకగా విజయదశమిని (అక్టోబర్ 25) అభివర్ణిస్తారు. కాశ్మీరం నుంచి కన్యాకుమారి దాకా ఆదిపరాశక్తిని నవదుర్గా రూపాలుగా ఆరాధించి తరిస్తారు. ఆయుధపూజ, అలయ్ బలయ్, బొమ్మల కొలువులు దసరాకు ప్రత్యేకించినవి. రామలీలా, దాండియా వంటివి దసరా సరదాను పెంచుతాయి. లక్ష్మి, సరస్వతి, దుర్గ అవతారాలు వాడవాడలా నెలకొని మనల్ని కాపాడతాయి. ఈ దసరాతో మానవాళిని వణికిస్తున్న మహమ్మారి అంతం కావాలని కోరుకుందాం. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో... బంగారు బతుకమ్మ ఉయ్యాలో అంటూ మన ఆడపడుచులు పచ్చపూల బతుకమ్మను తెప్పను చేసి నీటిలో వదులుతారు. తంగేడులు, తురాయిలు బతుకమ్మలకు పసుపు కుంకుమలై పచ్చగా అందరినీ దీవించాలని ఆశిద్దాం.

ఈనెలలోనే తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు 16 - 24 తేదీల మధ్య జరుగనున్నాయి. విశిష్టమైన వాహనసేవలు అందుకుంటూ తిరుమలేశుడు భక్తకోటిని కటాక్షిస్తాడు. ద్వారకా తిరుమల శ్రీనివాసుని కల్యాణం (30), తూరుపు దిక్కున విజయనగరం సిరిమానోత్సవం (27) వేడుక చేయనున్నాయి. విజయదశమి నాడే త్రిమతాచార్యుల్లో ఒకరైన మధ్వాచార్య జయంతి, శ్రీషిరిడీ సాయి సమాధి ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఆశ్వయుజం అందరికీ ఆరోగ్య ప్రదాయిని కావాలని ఆకాంక్షిస్తున్నాం.

➠ సర్వత్రా వ్యాపించివున్న పరమాత్ముని శక్తి స్వరూపిణిగా, జగన్మాతగా భావించి పూజించే పెద్దపండుగ దసరా. దశహరా అనేమాట నుంచి దసరా వచ్చింది. మనిషిలోని విషయ లాలసలు శరత్కాలంలో విజృంభించి మనసుకి, శరీరానికి తాపం కలిగిస్తాయి. శారదా నవరాత్ర పూజలు శరత్తాపాన్ని హరిస్తాయి. పది ఇంద్రియాలను నియంత్రించేది కనుక పదిరోజుల పండుగ దసరా.

➠ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అని త్రిశక్తి రూపాల్ని సంబోధిస్తారు. పరమ సాత్త్విక రూపంతో భాసించే సరస్వతి మహాసరస్వతిగా దానవసంహారం చేసింది. ఆశ్వయుజ సప్తమి నాడు శుంభనిశుంభులనే రాక్షసులను వధించిన మహాశక్తి రూపం మహాసరస్వతి.

➠ లౌకికులు ఆమె అసలుపేరు సంతృప్తి అంటారు. యోగులు ఆమెను అనాహత పద్మంలో దర్శిస్తారు. పౌరాణికులు శేషశాయి అయిన శ్రీమహావిష్ణువు అర్థాంగిగా చెబుతారు. మంత్రవేత్తలు ఆమెను కమలాదేవిగా ఆరాధిస్తారు. దసరాల్లో మూడోరోజున మధుకైటభులను సంహరించిన మహాశక్తిగా మహాలక్ష్మిని పూజిస్తారు. 

➠ శరన్నవరాత్రి వేళ తిరుమల కొండపై బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. తిరువేంకటనాథుడు పూటకో వాహనం అధిరోహించి భక్తకోటిని కటాక్షిస్తూ ఉంటాడు. ఈసారి కరోనా నేపథ్యంలో ఉత్సవాలను పరిమిత స్థాయిలోనే నిర్వహిస్తున్నారు. అధికమాసం వచ్చినందువల్ల ఈ ఏడాది బ్రహ్మోత్సవాలను అదనంగా మరోసారి నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాలతో సంతృప్తి చెందిన దేవదేవుడు ఈ పుడమిని చల్లగా కాపాడాలని కోరుకుందాం.

➠ దసరా పదిరోజుల పండుగ. అయితే వీటిని శరన్నవరాత్రులు అంటారు. అమ్మవారు దుష్టరాక్షసులతో తొమ్మిదిరోజుల పాటు యుద్ధం చేసి విజయం పొందింది. చివరిరోజున రాజరాజేశ్వరిగా పూజలందుకుంది. ఆరోజున అందరికీ పండుగ రోజయింది. మహిషాసురుని సైన్యంలోని అనేకమంది రాక్షసులను వధించడానికి అమ్మవారు వివిధ అవతారాలను ధరించింది. దేవతలందరి వద్దనుంచి తీసుకున్న వివిధ ఆయుధాలతో దేవి సాగించిన పోరాటాన్ని దేవీభాగవతం వివరించింది. దసరా రోజుల్లో మహర్నవమినాడు ఆయుధపూజ ప్రత్యేకంగా చేస్తారు. 

➠ ఉత్సవం అంటే గొప్ప యజ్ఞం అని అర్థం. దేవాలయంలో చేసే ఉత్సవమనే యజ్ఞం దేశశాంతికి, క్షేమానికి దోహదపడుతుంది. ఈ ఉత్సవ సేవలవల్ల వర్షాలు సమృద్ధిగా కురిసి, పాడిపంటలు పుష్కలంగా లభిస్తాయి. ప్రపంచమంతా సుఖంగా ఉంటుందని వైఖానస ఆగమం చెబుతోంది. అటువంటి మహోన్నత ఆదర్శం గల ద్వారకాతిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా అక్టోబర్ 30న వార్షిక కల్యాణం జరగనుంది.

➠ ప్రకృతినే దేవతగా పూజించే పూల పండుగ బతుకమ్మ. బతుకు తెరువును మెరుగు పరిచే అమ్మ కనుక బతుకమ్మ అని పిలిచారు. ప్రకృతి నుంచి సేకరించిన పూలను తిరిగి ప్రకృతికే సమర్పించడం బతుకమ్మ పండుగ విశిష్టత. విభిన్నమైన పూలతో బతుకమ్మను చేసి, పూజించి తెలంగాణ ఆడపడుచులు ఆనందోత్సాహాలతో సంప్రదాయంగా, వేడుకగా జరుపుకుంటారు. తొమ్మిది రోజుల పాటు తెలంగాణ అంతటా ఒక జాతరగా బతుకమ్మ పండుగ సాగుతుంది. తెలంగాణలోనే కాకుండా ప్రపంచంలోని దాదాపు అరవై దేశాల్లో బతుకమ్మ ఉత్సవాలు జరుగుతున్నాయి.

➠ విజయనగరం సిరిమానోత్సవం అతిపెద్ద వేడుక. రెండున్నర శతాబ్దాలకు పైబడి నిరంతరాయంగా సిరిమానోత్సవం జరుగుతోంది. ఏటికేడాది పైడితల్లిని దర్శించవచ్చే భక్తుల సంఖ్య పెరుగుతోంది. సిరిమాను ఉత్సవంలో అమ్మవారిని దర్శించిన వారికి కోరిన కోర్కెలు తప్పక నెరవేరుతాయని విశ్వాసం.

➠ విజయదశమి పర్వదినాన సాయి పుణ్యతిథిని షిర్డీలో వైభవోపేతంగా నిర్వహిస్తారు. నాలుగురోజుల పాటు ఈ ఉత్సవాలు కొనసాగుతాయి. దేశవిదేశాల నుంచి లక్షలాది భక్తులు షిర్డీని సందర్శిస్తారు. విరోధాలు, విభేదాలు, వైషమ్యాలు లేని సమాజస్థాపనే సాయి ఆకాంక్ష. ఆ సద్గురువు చూపిన బాటలో నడవడమే అసలైన సాయి ఆరాధన.

➠ ఆయన ఓ స్వతంత్ర సమరయోధుడు, దేశ స్వాతంత్ర్యం కోసమే కాదు, ధార్మిక స్వేచ్ఛ కోసం కూడా పోరాడాడు. సర్వసంగ పరిత్యాగియై కూడా దారిద్ర్యానికి, అన్యాయానికి వ్యతిరేకంగా ఉద్యమించాడు. స్వరాజ్య నినాదంతో తిలక్ మహాశయునికే మార్గదర్శియైనాడు. మరెందరో స్వాతంత్ర్య సమర యోధులకు ప్రేరణైనాడు. కుల, వర్గాతీతంగా వేదాంత భావనలను అందరికీ దగ్గర చేశాడు. ధార్మిక కార్యాలలో కులవాదానికి మంగళం పాడాడు. సమానత్వ భావన ప్రచారంకోసం ఆర్యసమాజాన్ని స్థాపించాడు. ఆ ధర్మజ్యోతే స్వామి దయానంద సరస్వతి.

Recent Comments