"రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే
రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః"

దేశప్రజల స్వప్నం సాకారమైంది. అయోధ్యలో రామమందిర నిర్మాణానికి భూమిపూజా క్రతువు జయప్రదంగా నెరవేరింది. అతిత్వరలోనే అయోధ్య రాముడు సుందర మందిరంలో కొలువుదీరి దర్శనమివ్వనున్నాడు. ఈ నేపథ్యంలో శ్రీరామ భక్తులందరికీ శుభాభినందనలు. తిరుమలలో అధికమాస బ్రహ్మోత్సవాలు 19న ప్రారంభమవుతున్నాయి. ఈసారి అధిక ఆశ్వయుజమాసం వచ్చిన సందర్భంగా తిరుమలలో రెండుసార్లు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. పూటపూటకూ ఒక్కటి చొప్పున వాహనసేవలు అందుకుంటూ భక్తులకు కనువిందు చేసే శ్రీనివాసుడు మన కామితాలను నెరవేర్చాలని వేడుకుందాం. పితరులకు ప్రియమైన మహాలయ అమావాస్యను శ్రద్ధతో ఆచరించి పితృదేవతల ఆశీస్సులను అందుకుందాం.

మన ఆధ్యాత్మిక జ్ఞాన ఔన్నత్యాన్ని నేటి యువతరానికి అర్థమయ్యేలా చెబుతున్న సద్గురు జగ్గీవాసుదేవ్ బోధలు ఎందరికో స్ఫూర్తి కలిగిస్తున్నాయి. గాఢమైన, లోతైన విషయాలను సైతం నవీన వైజ్ఞానిక కోణాల్లో విశ్లేషిస్తూ సాగుతున్న సద్గురు జన్మదినోత్సవం ఈ నెల విశేషం. ఆర్తులకు, ఆపన్నులకు అమృతహస్తం అందించి, సుధలు పంచడానికే పుట్టిన పున్నమి జాబిలి... మాతా అమృ తానందమయి. సెప్టెంబర్ 27 జన్మదినోత్సవ శుభవేళ ఆమెకు ప్రణతి. ఈసారి ఆధ్యాత్మిక జగత్తులో నక్షత్రాల వంటి ఎందరెందరో మహనీయుల వ్యాసాలు ప్రచురించాం. అక్షరాలలో పొదిగిన వారి సందేశాలను శ్రద్ధగా పఠించి, పాటించి జీవన సార్ధక్యాన్ని పొందుదాం. మన కన్నీరు తుడుచుకున్నంత సహజంగానే ఇతరుల కన్నీరునూ తుడిచే ప్రయత్నం చేయాలి. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడమే పుణ్యం. ఆర్తులకు చేయూతనందించడమే గొప్ప పూజ. కరోనా మహమ్మారి నేపధ్యంలో తోటివారికి సాయం చేద్దాం. మహమ్మారిని తరిమికొడదాం.

➠ మట్టి బొమ్మగా వినాయకుణ్ణి పూజించి, నీటిలో నిమజ్జనం చేయడం సంప్రదాయం. సాధారణంగా చాలమంది చవితి వెళ్లిన మర్నాడే నిమజ్జనం చేస్తూ ఉంటారు. తొమ్మిదిరోజుల పాటు వినాయకుణ్ణి పూజించిన వారు, అనంత పద్మనాభ చతుర్ధినాడు నిమజ్జనం చేస్తారు.

➠ మట్టి బొమ్మగా వినాయకుణ్ణి పూజించి, నీటిలో నిమజ్జనం చేయడం సంప్రదాయం. సాధారణంగా చాలమంది చవితి వెళ్లిన మర్నాడే నిమజ్జనం చేస్తూ ఉంటారు. తొమ్మిదిరోజుల పాటు వినాయకుణ్ణి పూజించిన వారు, అనంత పద్మనాభ చతుర్ధినాడు నిమజ్జనం చేస్తారు.

➠ మహనీయుల ముఖారవిందాలే ఆనందదాయకాలు, అనుభూతి కారకాలు. వివేకానందస్వామి చిత్రపటాన్ని చూస్తే భారతీయులుగా పుట్టినందుకు మన హృదయం ఉప్పొంగుతుంది. వివేకానందుల రచనలు అప్పటి నుంచి ఇప్పటి వరకు అన్నితరాలపై గాఢమైన ముద్ర వేస్తూనే ఉన్నాయి. 1893లో చికాగో నగరంలో నిర్వహించిన సర్వమత సమ్మేళనంలో పాల్గొని, స్వామి వివేకానంద భారతీయ వేదాంత పతాకాన్ని ఎగురవేసి ఈ ఏడాది సెప్టెంబర్ 11 నాటికి 126 సంవత్సరాలు పూర్తి కావస్తున్నాయి.

➠ ఈ నెలలో ఈశాసద్గురు జగ్గీవాసుదేవ్ జన్మదినోత్సవం రాబోతోంది. సద్గురు జగ్గీవాసుదేవ్ ఆధ్యాత్మికతకు చూపే ఆధునిక కోణం ఆలోచింపచేస్తుంది. ఆధ్యాత్మిక వికాసానికి, జీవన మార్గంలో ఎదురయ్యే అనేక సందేహాలకు సమాధానాలుగా ఆయన ప్రవచనాలు సాగుతాయి. వివిధ సందర్భాల్లో ఆయన చెప్పినవి మనల్ని ముందుకు నడిపించే సూత్రాలు.

➠ పద్మనాభుడు అంటే నాభియందు పద్మాన్ని కలవాడని అర్థం. ఆ పద్మం ఈ సృష్టివలె అనంతమైనది. భాద్రపదమాసంలో వచ్చే అనంత పద్మనాభ చతుర్ధినాడు వినాయక నిమజ్జనం చేస్తారు. సంన్యాసాశ్రమంలోని వారు గురుపౌర్ణమి నాడు చేపట్టిన చాతుర్మాస్య వ్రతాన్ని అనంత చతుర్ధి మరునాడు వచ్చే పౌర్ణమితో ముగిస్తారు. పౌరాణికమైన అనంత పద్మనాభ వ్రతం అమేయఫలాలను అనుగ్రహిస్తుంది.

➠ భాద్రపద బహుళ పాడ్యమి మొదలు అమావాస్య వరకు పదిహేను రోజులకు మహాలయ పక్షం అని పేరు. ఈ పదిహేను రోజులూ పితృదేవతారాధనకు సంబంధించినవే. ఈనెల 2వ తేదీ నుంచి మహాలయపక్షం ఆరంభమవుతోంది. వీటిలో ఎవరి పితృతిథినాడువారు శ్రాద్ధా దులను ఇంటివద్ద నిర్వర్తించవచ్చు. పితృతిథినాడు సాధ్యం కానివారు మహాలయ అమావాస్య నాడు శ్రాద్ధవిధిని జరుపుకోవచ్చు.

➠ తిరుమల బ్రహ్మోత్సవాలు మానవాళికి మహోత్సవాలు. ప్రతి సంవత్సరం సౌరమానం ప్రకారం కన్యామాసంలో బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. అధికమాసం వచ్చినప్పుడు మాత్రం ఒకే ఏడాదిలో రెండుసార్లు నిర్వహిస్తారు. ఈ సంవత్సరం అధిక ఆశ్వయుజమాసం వచ్చింది. ఈ సందర్భంగా తిరుమలలో రెండుసార్లు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. వీటిలో సెప్టెంబర్ 19 నుంచి 27వరకు నిర్వహించే బ్రహ్మోత్సవాలను సాలకట్ల బ్రహ్మోత్సవాలని పిలుస్తారు. అక్టోబర్ 16 నుంచి 24 వరకు జరగబోయే వాటిని శరన్నవరాత్ర బ్రహ్మోత్సవాలంటారు. బ్రహ్మోత్సవాలలో ప్రతిరోజూ వాహన సేవలుంటాయి. రథోత్సవం, గరుడోత్సవం విశేషంగా నిర్వహిస్తారు. తిరుమల మాడవీధులలో మలయప్ప స్వామి ఇరువురు దేవేరులతోనూ, విభిన్న అలంకారాలలో భక్తులకు కనువిందు చేస్తాడు. అభీష్టాలను నెరవేరుస్తాడు. ఈసారి కరోనా నేపథ్యంలో కొన్ని పరిమితులకు లోబడి తిరుమలలో బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నారు.

➠ మనిషి, ప్రపంచం, దైవం.... ఈ విషయాలన్నిటి గురించి ఉపనిషత్తులు చర్చిస్తాయి. ప్రతిమానవుడు తన జీవితాన్ని ఆధ్మాత్మిక మార్గంలో ఎలా తీర్చిదిద్దుకోవాలో భగవద్గీత తెలియచేస్తుంది. వేదాంతం అని ప్రాచుర్యం పొందిన ఉపనిషత్తుల్లోని సారాంశాన్ని దైనందిన జీవితానికి ఎలా అన్వయించుకోవాలో మనకు భగవద్గీత చెబుతుంది. పేరుకు తగినట్లుగా, సాక్షాత్తు భగవంతుడి నోటి నుంచి వెలువడిన అమృతధార భగవద్గీత.

➠ సృష్టికి మూలధారమైన జగన్మాతకు గ్రామీణుల జాతరలంటే చాలా ఇష్టం. తెలుగు రాష్ట్రాల్లో గ్రామదేవతలకు జరిపించే జాతరల్లో మన సంస్కృతి ప్రతిబింబిస్తుంది. నెల్లూరు వెంకటగిరి శ్రీ పోలేరమ్మ జాతర తెలుగునాట ప్రసిద్ధమైనది.

Recent Comments