శ్రీప్లవనామ సంవత్స రానికి స్వాగతం! శుభస్వాగతం!! కోటి ఆశలతో కొత్త ఏడాదిలో అడుగు పెట్టబోతున్నాం. జగతికి శుభం కలగాలని ప్రార్థిద్దాం. గత ఏడాదినుంచి మనల్ని పీడిస్తున్న మహమ్మారి ఈ ఏడాదైనా పూర్తిగా తొలగిపోవాలని కోరుకుందాం. లేత చిగుళ్లతో, కొత్తపూల నెత్తావులతో, మామిళ్ల సందళ్లతో, కోయిల పాటలతో మొదలయ్యే పచ్చని వసంతం ప్రాణికోటికి సకల శుభాలనూ ప్రసాదించాలని కాలపురుషుని వేడుకుందాం. షడ్రుచుల ఉగాది ప్రసాదంతో ఈ ఏడాదిలో మన జీవనం అన్నింటా నవ్యంగా సాగిపోవాలని కోరుకుందాం. ఉగాది (ఏప్రిల్ 13) సంప్రదాయంగా పంచాంగకర్తలు అందించే సంవత్సర ఫలితాలు, కందాయ ఫలాలు, రాశిఫలాలను ఆలకిద్దాం. నూతన సంవత్సరం రాగానే తొలిపండుగ శ్రీరామనవమి (ఏప్రిల్ 21) కల్యాణప్రదంగా వస్తుంది. రాముని పేరు చెప్పగానే
మానవాళి పులకించి పోతుంది. మనిషిగా పుట్టి, చక్రవర్తి కుమారునిగా పెరిగి, మనలాగే అనేక కష్టసుఖాలను రుచి చూసినవాడు రాముడు. సాక్షాత్తూ ధర్మమే రామునిగా పోతపోసుకుంది. యుగాలుగా రాముడు మానవజాతికి ఆదర్శదైవంగా నిలిచాడు. రామకల్యాణవేళ ప్రతి లోగిలీ కల్యాణ మంటపం అవుతుంది. ప్రసిద్ధ శ్రీరామ క్షేత్రాల్లో జరిగే సీతారాముల పెళ్లిని కనీవినీ ఆనందిద్దాం. వసంతోదయ మంగళవేళ సీతారాముల పెళ్లి తలంబ్రాలు మనందరికీ దీవెనలు కురిపించాలని ఆశిద్దాం. శృంగేరీ పీఠ జగద్గురు శ్రీభారతీ తీర్థ మహాస్వామి ఈ ఏడాది (ఏప్రిల్ 18) డభ్భయ్యో ఏట అడుగు పెడుతున్నారు. వారి సప్తతి మహోత్సవం సందర్భంగా వారికి కైమోడ్పులు. ఈ మాసంలోనే ఎందరెందరో దేవీదేవతలు కల్యాణాలు జరిపించుకోబోతున్నారు. ఆ కల్యాణమూర్తులు మనకు సమస్త సన్మంగళాలు కలిగించాలని ఆశిస్తూ...

➠ యాత్ర అనే పదం నుంచే జాతర వచ్చింది. గ్రామాన్ని చల్లగా చూసే గ్రామదేవత గ్రామమంతా కలయతిరిగి గ్రామస్తుల బాగోగులను చూసే సందర్భమే జాతర. ఆ రోజుల్లో గ్రామస్తులే కాకుండా, ఆ గ్రామంతో అనుబంధం ఉన్నవారంతా తరలివస్తారు. అయిదు శతాబ్దాలకు పైబడిన చరిత్ర కలిగిన అనకాపల్లి నూకాంబిక జాతరలో అన్ని ప్రాంతాల నుంచి భక్తులు పాల్గొంటారు. గరగ నృత్యాల వంటి జానపద కళారూపాలకు ఈ జాతర వేదిక. 

➠ గ్రామాన్ని చల్లగా చూసేది గ్రామదేవత. గ్రామస్థులను అంటు వ్యాధుల నుండి రక్షిస్తుంది. పంటలను పచ్చగా ఉండేలా చేస్తుంది. తూర్పుకనుపూరు ముత్యాలమ్మ తల్లికి ప్రతి ఏడాది ఉగాదికి ముందు జాతర నిర్వహిస్తారు. ఈ జాతరకు ఆమె సోదరి అయిన పోలేరమ్మ తరలి వస్తుంది. నాలుగురోజులపాటు వైభవంగా జరిగే ముత్యాలమ్మ జాతరలో వేలాది భక్తులు పాల్గొంటారు. 

➠ భగవాన్ సత్యసాయికి రామకథంటే పరమప్రీతి. సాయిరాం అంటూ సంబోధించుకోవడం, పలకరించుకోవడం శ్రీసత్యసాయి భక్తులకూ పరిపాటి. రామకథా రసవాహిని అనేపేరుతో రామాయణాన్ని సత్యసాయి విరచించారు. సత్యసాయి పుణ్యతిథి సందర్భంగా రామాయణానికి పీఠికగా వారు కూర్చిన శ్రీరామతత్త్వ సారాంశాన్ని అందిస్తున్నాం.

➠ తిరుమల రాముడు వేంకటేశ్వరుడిని వేలాది కీర్తనలతో అర్చించిన అన్నమయ్య రాముడిని కూడా తన పదపుష్పాలతో కొలుచుకున్నాడు. అన్నమయ్య రచించిన రామ సంకీర్తనల్లో దేవదేవం భజే, రాముడు రఘుకులుడు అన్న పల్లవులతో ప్రారంభమయ్యే సంకీర్తనలు ప్రజలందరికీ తెలిసినవి. ఏప్రిల్ 8, అన్నమాచార్య వర్ధంతి సందర్భంగా....

➠ ఒంటిమిట్ట కోదండరామయ్య కల్యాణాన్ని అధికారికంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోంది. శ్రీరామనవమికి ఇక్కడ బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. చైత్ర పౌర్ణమికి ముందు రాత్రి పండువెన్నెల్లో కల్యాణం నిర్వహిస్తారు. 

➠ భద్రాచలం తెలుగువారి అయోధ్య. భద్రాద్రి సీతారాముడు మనందరివాడు. ఏటా భద్రాచలం సీతారామ కల్యాణం చూడాలని, కనీసం వ్యాఖ్యాన రూపంగా అయినా ఆలకించాలని భక్తులు ఆశపడుతుంటారు. సీతమ్మ తాళిబొట్టును గురించి, ముత్యాల తలంబ్రాలను గురించి పదేపదే చెప్పుకుని పులకించిపోతుంటారు. కరోనా నేపథ్యంలో ఈసారి రామకల్యాణ వేడుకల నిర్వహణల్లో మార్పు చేర్పులు ఉండవచ్చు. 

Recent Comments