కాలం అనంతం. దైవస్వరూపం. కాలమనే మంత్రదండాన్ని చేతపట్టుకుని భగవంతుడు స్వయంగా ఇంద్రజాలం చేస్తుంటాడు. వసంతం నుంచి శిశిరం వరకు ఎన్నెన్నో అద్భుతాలను మన కళ్లముందు ఆవిష్కరిస్తుంటాడు. కాలం రూపంలోనే భగవంతుడు మనకు కావాల్సినవన్నీ ప్రసాదిస్తుంటాడు. అటువంటి కాలానికి తొలివేకువ వంటి ఉగాది (ఏప్రిల్ 9) నవవసంతాన్ని మనకోసం మోసుకొస్తోంది. ఈ పండుగపూట ఉదయాన్నే తలస్నానం చేసి, షడ్రుచుల ప్రసాదం స్వీకరిస్తాం. ఏడాది పొడవునా దేశకాలమాన పరిస్థితులు, వ్యక్తిగత రాశి కందాయ ఫలాలు తెలుసుకునేందుకు పంచాంగ శ్రవణం చేస్తుంటాం. కొత్త ఏడాది అందరికీ శుభదాయకంగా గడవాలని కోరుకుందాం. 

ఉగాదినుంచే వసంత నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. 17న శ్రీరామనవమి తెలుగువారికి మహోత్సవం. సీతారామ కల్యాణానికి ఊరూరా చలవ పందిళ్లు వెలుస్తాయి. భక్తులు పానకం, వడపప్పు ప్రసాదాలు పంచుతూ అందరికీ వేసవి ఎండనుంచి సేదదీరుస్తుంటారు. భద్రాచలంలోనూ, తెలుగునాట అన్ని ఆలయాల్లోనూ శ్రీరామ నవమినాడే కల్యాణాలు జరుగుతాయి. కానీ ఒంటిమిట్టలో మాత్రం శ్రీరామచంద్రుని కల్యాణం నిండుపున్నమినాడు (ఏప్రిల్ 22) నిర్వహిస్తారు. శ్రీరాముని పేరు చెప్పగానే మానవాళి పులకించి పోతుంది. మనిషిగా పుట్టి, చక్రవర్తి కుమారునిగా జీవించి, మనలాగే అనేక కష్టసుఖాలను రుచిచూసినవాడు రాముడు. సాక్షాత్తూ ధర్మమే రామునిగా పోతపోసుకుంది. దుష్టశిక్షణకు పరిపూర్ణ మానవుడు మాత్రమే అర్హుడు అనే సందేశాన్ని శ్రీరాముడు మనకు అందించాడు. ఆయనను ఆదర్శంగా తీసుకుని ధర్మరక్షణకు పాటుపడదాం. శ్రీరామకర్ణామృతంలో చెప్పినట్లు...
శ్రీరాఘవం దశరథాత్మజ మప్రమేయం
సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం
ఆజానుబాహు మరవింద దళాయతాక్షం
రామం నిశాచర వినాశకరం నమామి
... అంటూ ఆ రామచంద్రునికి నమస్కరిద్దాం.

➠ ఉత్తరాది వారికి చైత్ర పూర్ణిమ హనుమజ్జయంతి. దానినే మనవారు హనుమద్విజయోత్సవం అంటారు. ఒరియా ప్రజలు మేష సంక్రాంతినాడు హనుమజ్జయంతి జరిగినట్లు భావిస్తారు. తమిళనాట మార్గశిర అమావాస్య నాడు హనుమజ్జయంతిని నిర్వహిస్తారు. జ్యేష్ఠమాసంలో సువర్చలా హనుమంతుల కల్యాణం నిర్వహిస్తారు.

➠ చైత్రశుద్ధ పాడ్యమి అంటే ఉగాది రోజునే అమ్మవారి వసంత నవరాత్రులు ప్రారంభమౌతాయి. స్నపనాభిషేకం తరువాత కలశ స్థాపనతో వసంత నవరాత్రులు ప్రారంభమౌతాయి. కలశస్థాపన తరువాత క్రమంగా అగ్ని ప్రతిష్ఠాపన, హోమాలు, వేదపారాయణం జరుగుతాయి.

➠ ప్రభవ నుంచి అక్షయ వరకూ తెలుగు సంవత్సరాలు అరవై. కాగా, ఆ వరుసలో శ్రీక్రోధి నామసంవత్సరం 38వది. భారతీయ కాలగణన ప్రకారం సృష్టి ప్రారంభమై ఈ ఏడాదితో 195కోట్ల 58 లక్షల 85 వేల 125 సంవత్సరాలవుతున్నాయి. ఈ క్రోధి నామ సంవత్సరంలో కాలమాన పరిస్థితులు, వాతావరణ స్థితిగతులు, వ్యక్తిగత రాశిఫలితాలు మీకు అందిస్తున్నాం.

➠ భగవాన్ సత్యసాయికి రామకథంటే పరమప్రీతి. సాయిరాం అంటూ సంబోధించుకోవడం, పలకరించుకోవడం శ్రీసత్యసాయి భక్తులకూ పరిపాటి. ఏప్రిల్ 24వ తేదీ ఆయన ఆరాధన దినోత్సవం సందర్భంగా పుట్టపర్తిలోని సమాధి వద్ద ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రపంచవ్యాప్తంగా సత్యసాయి సేవాసమితి విభిన్న సేవా కార్యక్రమాలను చేపడుతుంది.

➠ ఒంటిమిట్ట కోదండరామయ్య కల్యాణాన్ని అధికారికంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. శ్రీరామనవమికి ఇక్కడ బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. చైత్ర పౌర్ణమికి ముందు రాత్రి పండువెన్నెల్లో కల్యాణం నిర్వహిస్తారు. ఒంటిమిట్ట కోదండరామయ్య వైభవం, కల్యాణాన్ని వీక్షించడం భక్తుల పూర్వజన్మ సుకృతమే.

➠ భద్రాచల సీతారామస్వామి తెలుగువారి ఇష్టదైవం. అక్కడ జరిగే సీతారామ కల్యాణం కోసం భక్తులందరూ ఎదురుచూస్తుంటారు. తమ ఇంటినుంచి తలంబ్రాలు పంపాలని, కల్యాణాన్ని ప్రత్యక్షంగా వీక్షించి, సీతారామచంద్రుని ముత్యాల తలంబ్రాలు తమతో పాటు తెచ్చుకోవాలని ఉవ్విళ్లూరుతారు.

Recent Comments