పండుగలకు నెలవు శ్రావణమాసం. సిరులు కురిపించే ఈ మాసం ఆగస్టు 9నుంచి ఆరంభమవుతుంది. లక్ష్మీకటాక్షాన్ని అనుగ్రహాన్నికలిగించే శ్రావణాన్ని పవిత్రమాసంగా మహిళలు భావిస్తారు. వరలక్ష్మీదేవిని భక్తిశ్రద్ధలతో కొలుస్తారు. ముత్తయిదువలకు శనగల వాయనం, తాంబూలంలో పెట్టిన పండు, పువ్వులు సమర్పిస్తారు. వరలక్ష్మీవత్రం (ఆగస్టు 20) సందర్భంగా సమగ్రమైన వ్రతవిధానాన్ని ఈ సంచికతో పాటు అందిస్తున్నాం. ఆగస్టు మాసంలోనే అన్నవరం సత్యనారాయణ స్వామి ఆవిర్భావదినోత్సవం, గోదాదేవి జయంతి, గురు రాఘవేంద్రుల ఆరాధనవంటి విశిష్ట సందర్భాలు కూడా కలిసివస్తున్నాయి. వాటితోపాటు అన్నాచెల్లెళ్ల అనురాగానికి అద్దం పట్టేరాఖీ పండుగ (ఆగస్టు 22) కూడా వస్తోంది. తోబుట్టువులతో పాటు అభిమానపూర్వకంగా ఆడపడుచులు తమ అన్నలకు, తమ్ముళ్లకు రక్షలు కడతారు. అన్నివేళలా తమకు తోడుగా నిలబడతామని సోదరుల నుంచి వాగ్దానం అందుకుంటారు. శృంగేరీపీఠ ఉత్తరాధికారి శ్రీవిధుశేఖర భారతీస్వామి జన్మోత్సవ శుభ వేళ (ఆగస్టు 13) వారి దివ్యాశీస్సులు అర్థిద్దాం. అంతేకాకుండా ఆగస్టు మాసంలో జన్మించిన మరికొందరు సిద్ధపురుషులు, మహనీయుల చరిత్రలను ఈ సంచికలో స్థాలీపులాకంగా అందిస్తున్నాం.

ఇక నీలిమేఘాల రాకతోనే నీలమేఘశ్యాముని జన్మాష్టమి (ఆగస్టు 30) కూడా వస్తుంది. దేశమంతా కృష్ణనామ స్మరణతో మార్మోగిపోతుంది. జగద్గురువైన శ్రీకృష్ణ పరమాత్మ మనల్ని ఎల్లవేళలా కాపాడాలని కోరుకుందాం. ఉట్టి సంబరాలకు, కోలాటాల పాటలకు మనకు మనమే పరిమితులు విధించుకోవాల్సిన అవసరం ఉంది. నేటి కోవిడ్ పరిస్థితుల నేపధ్యంలో అన్నిరకాల ఆరోగ్య సూత్రాలను తప్పకుండా పాటిద్దాం. వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులు అదుపులో ఉండాలని, కరోనా మహమ్మారి శాంతించాలని ఆ పరమాత్మను వేడుకుందాం. భక్తిపత్రిక పాఠకులకు భారత స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలతో.....

➠ అన్నవరం సత్యనారాయణస్వామి తెలుగువారికి ఇష్టదైవం. వివాహం, నూతన గృహప్రవేశం, వ్యాపార ప్రారంభం.... ఇలా ఏ శుభకార్యం నిర్వహించుకున్నా వెంటనే సత్యనారాయణ వ్రతం చేయడం మన సంప్రదాయం. అన్నవరం దివ్యక్షేత్రంలో ఆ స్వామి వెలిసిన పవిత్రదినాన ఆగస్టు 10 ఆవిర్భావోత్సవాలు జరుగుతాయి.

➠ రాఘవేంద్ర యతీంద్రులు కారణజన్ములు. మధ్వ పరంపర మణిహారంలో మేటి మణి. అజ్ఞానాన్ని నశింపజేసి సత్యధర్మాలను మానవులలో పెంపొందించేందుకు కృషి చేశారు. అధ్యాత్మ క్షీరాన్ని ప్రసాదించే కామధేనువు. మంత్రాలయ మహాక్షేత్రం దర్శించినవారికి ఆయన ఆప్యాయ స్పర్శతో ఊరట చెందిన భావన కలుగుతుంది. ఆగస్టు 24న రాఘవేంద్రుల ఆరాధన సందర్భంగా మంత్రాలయంలో 21 నుంచి 27వరకు విశేష ఉత్సవాలు జరుగుతాయి. 

➠ అనుబంధాలను బలోపేతం చేసి, అనురాగాలను వర్ధిల్లచేసే అపురూప పర్వం రక్షాబంధనం. చారిత్రక కాలంలోనూ రాజ్యాలమధ్య శాంతి సమరస భావనలను పెంపొందించింది రాఖీ. సోదరీ సోదరుల మధ్య ప్రేమ, ఆప్యాయతలను కలబోసుకునే పండుగగా రక్షాబంధనం భారతీయ కుటుంబ వ్యవస్థను పదిలంగా కాపాడుతోంది. ఒకప్పుడు ఉత్తరాది సంస్కృతిలో మిళితమైన పండుగ రక్షాబంధన్. ఇప్పుడు రాఖీ వేడుకకు ఎల్లలు లేవు.

➠ గరుత్మంతుణ్ణి విష్ణు భక్తి పరాయణుడు, మాతృదాస్య విముక్తికి పాటుపడ్డవాడు. ఆయనను ధర్మస్వరూపునిగా పండితులు పేర్కొంటారు. విష్ణువుకు వాహనంగా నిలిచిన గరుత్మంతుణ్ణి... ఆయన జన్మతిథినాడు పూజిస్తారు. 

➠ జగత్తు అంతా లక్ష్మీస్వరూపమే. ఆమె పరమాత్ముని మాయాశక్తికి సంకేతం. ఎవ్వరివద్దా స్థిరంగా ఉండదన్న కీర్తి కూడా ఆమెకు ఉంది. పట్టపగలు వంటి సత్యాన్నీ ధర్మాన్నీ కనిపించనీయని... చిమ్మచీకటికి ప్రతీక అయిన గుడ్లగూబను ఆమె వాహనంగా చేసుకుంటుంది. లక్ష్మిని మనం సత్త్వబద్ధంగా, సత్యయుతంగా ఉపాసిస్తేనే మాయలో పడకుండా ఉంటాం. స్థిరమైన లక్ష్మీ అనుగ్రహాన్ని పొందగలం.

➠ దక్షిణామ్నాయ శృంగేరీ శ్రీశారదాపీఠానికి 36వ జగద్గురువు శ్రీభారతీ తీర్థ మహాస్వామి. శంకర సంప్రదాయానికి పథ నిర్దేశకులు. ఆధ్యాత్మ విద్యకు గురుసన్నిధానమైన శృంగేరీ పీఠ విఖ్యాతికి వన్నె తెచ్చినవారు. ఆ మహాస్వామి అడుగుజాడల్లో నడుస్తూ, శృంగేరీ పీఠ ఉత్తరాధికారి శ్రీవిధుశేఖర భారతీ స్వామి భక్తులకు సన్మార్గాన్ని ఉపదేశిస్తున్నారు. అద్వైతాన్ని ప్రబోధిస్తున్నారు.