పవిత్ర కార్తికమాసం శివభక్తి పారవశ్యాన్ని పంచిపెడుతోంది. అమావాస్య వరకూ (డిసెంబర్ 14) మన ముంగిళ్లు దీపాలంకరణలతో ప్రకాశిస్తుంటాయి. కార్తికంలో రెండు సంధ్యలలో శివకేశవుల ప్రీతికోసం దీపారాధన చేయడం ఒక సత్సంప్రదాయం. అది అంతులేని శుభఫలితాలనిస్తుంది. కార్తికంలో ప్రతి ఏటా హైదరాబాద్ నగరంలో భక్తిటీవీ నిర్వహించే కోటిదీపోత్సవం ఆధ్యాత్మిక దీప్తులను పంచిపెడుతూ వస్తోంది. తెలుగువారి అభిమాన ఉత్సవంగా రూపుదిద్దుకుంది. ఈ ఏడాది కోవిడ్ నేపథ్యంలో భక్తిటీవీ కార్తిక దీపోత్సవం పరిమితస్థాయిలోనే నిర్వహిస్తున్నాం. అయినప్పటికీ ఈ కార్యక్రమానికి ప్రేక్షకాదరణ అపరిమితంగా లభిస్తూ ఉండడం భక్తిటీవీ నిబద్ధతకు తార్కాణంగా చెప్పుకోవచ్చు. ఈ ఉత్సవాన్ని తిలకిస్తూ దీపసంప్రదాయాన్ని కొనసాగిస్తున్న భక్తులకు ధన్యవాదాలు. డిసెంబర్ 16 నుంచి ధనుర్మాసం ప్రారంభమవుతోంది. వైష్ణవులకు అతి ముఖ్యమైన ధనుర్మాసం రాకతో విష్ణు ఆలయాలన్నింటా గోదాపాశురాలు ప్రతిధ్వనిస్తుంటాయి. ముక్కోటి ఏకాదశి నాడు (డిసెంబర్ 25) వైకుంఠద్వారాలు తెరిచి ఉంటాయని చెబుతారు. ఆరోజున విష్ణువును ఉత్తరద్వారం నుంచి దర్శిస్తే మోక్షం లభిస్తుందంటారు. అదేరోజు గీతాజయంతి కూడా కలిసివచ్చింది. ఇష్టదైవాన్ని త్రికరణశుద్ధిగా పూజిస్తే అన్ని ఆపదల నుంచి కాపాడతాడు. మనతో పాటు మన చుట్టూ ఉన్నవారంతా కరోనా కష్టకాలంలో క్షేమంగా ఉండాలని దైవాన్ని ప్రార్థిద్దాం. త్వరలోనే ఈ ఇక్కట్లు సకల మానవాళికి తొలగాలని ఆశిస్తూ... 

➠ శివుడే రక్షకుడు, కరుణాసముద్రుడు. బోళాశంకరుడు కనుక భక్తుల కోరికలను వెనువెంటనే నెరవేరుస్తుంటాడు. మన కార్తిక సమారాధనలను అంగీకరించి వరాలను అమితంగా కురిపిస్తుంటాడు. పైకి లయకారునిగా శివస్వరూపం కానవస్తుంది. కానీ ఆయన లీలావిశేషాలన్నీ అమిత కరుణ కలవాడని నిరూపిస్తూ ఉంటాయి. ఆయన కరుణకృత్యాలలో హాలాహల భక్షణ ఒకటి. ఈ కార్తిక శుభవేళలో ఆ సన్నివేశాన్ని తలచుకోవడం శివుని అనుగ్రహాన్ని కలగచేస్తుంది.

➠ విష్ణుభక్తులకు ధనుర్మాసం పవిత్రమైనది. ఆండాళ్ పాశురాలతో దేవదేవుణ్ణి మేలుకొల్పుతారు. ఈ నెల్లాళ్లూ తెల్లవారకముందే ఇళ్లముంగిళ్లలో అందమైన ముగ్గులు దర్శనమిస్తాయి. సూర్యోదయానికి పూర్వమే వైష్ణవులు పూజపూర్తి చేసి బాలభోగాన్ని సమర్పిస్తారు. నియమాలతో కూడిన వివిధ నైవేద్యాలు స్వామికి సమర్పిస్తూ ఉంటారు. ధనుర్మాస వ్రతనిష్ఠతో విష్ణులోకప్రాప్తి కలుగుతుంది.

➠ కృష్ణాజిల్లా మోపిదేవి కుమారక్షేత్రం. వల్లీ, దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వెలసిన దివ్యక్షేత్రం. ఇక్కడ సుబ్రహ్మణ్య షష్ఠినాడు స్వామి దివ్యకల్యాణం జరుగుతుంది. 

➠ వైకుంఠ ఏకాదశి పర్వదినాన విష్ణుఆలయాలన్నీ కిటకిటలాడతాయి. తెల్లవారుజామునుంచే ఉత్తరద్వార దర్శనం కోసం భక్తులు బారులు తీరుతారు. వైకుంఠ ఏకాదశినాడు ఉత్తర ద్వారదర్శనం చేస్తే మోక్షం లభిస్తుందని, ముక్కోటి దేవతల ఆశీస్సులు లభిస్తాయని భావిస్తారు. వైకుంఠ ఏకాదశి పర్వ వైశిష్ఠ్యం.

➠ హనుమంతుడు కేవలం దేవతామూర్తి కాదు. మంత్రమూర్తి. యోగస్వరూపుడు. హనుమత్ ఉపాసనలో గొప్ప ఫలితాలను అనుగ్రహించే హనుమద్వ్రతాన్ని పరాశర సంహిత చెప్పింది. సకల హితాలనూ చేకూర్చే హనుమద్వ్రత సందర్భం ఆయన భక్తులకు ముఖ్యమైనది. 

➠ శ్రీకాళహస్తిలో ఏడుగంగల జాతర ప్రతి ఏడాది కోలాహలంగా జరుగుతుంది. ఏడు ప్రధాన వీధులలో ఏడు గంగలు కొలువు దీరుతాయి. ప్రతి ఇంటిలోనూ పోలేరమ్మ కొలువు తీరుతుంది. కుంభాలలో వెలిగించిన దీపాలతో ముత్తయిదువలు గంగమ్మల వద్ద మొక్కులు తీర్చుకుంటారు. కులవివక్ష లేకుండా శ్రీకాళహస్తి పరిసర ప్రాంత ప్రజలందరూ విశేష సంఖ్యలో జాతరలో పాలు పంచుకుంటారు. 

Recent Comments