భక్తి టివి కోటిదీపోత్సవం దిగ్విజయంగా పూర్తయింది. కరోనా కష్టకాలంలో కూడా మీ అందరి సహకారంతో, దీపయజ్ఞాన్ని నిర్విఘ్నంగా నెరవేర్చాం. ఎప్పటిలాగే హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియం వేదికపై పదకొండు రోజుల పాటు అంగరంగ వైభవంగా కోటి దీపోత్సవాన్ని నిర్వహించాం. వివిధ క్షేత్రాల నుంచి దేవీదేవతలకు కల్యాణాలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తావళిని మెప్పించాయి. పీఠాధిపతులు, ప్రవచన కర్తల ఆగమనం కోటిదీపోత్సవానికి నిండుదనాన్ని సమకూర్చాయి. విభిన్న కళావిన్యాసాలతో కళాకారులెందరో కోటిదీపోత్సవ ప్రాంగణంలో మహాదేవునికి కళానీరాజనాలు సమర్పించారు. ఈ మహత్తర కార్యక్రమానికి సహకరించిన ప్రభుత్వ యంత్రాంగానికి, భక్తులకు అందరికీ కృతజ్ఞతాభివందనాలు. మా పట్ల మీ ఆదరాభిమానాలు ఇలాగే ఎప్పుడూ కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. తొమ్మిదేళ్ల క్రితం ప్రారంభమైన దీపయజ్ఞం తెలుగునాటనే కాకుండా దేశవిదేశాల్లో కూడా కాంతులు చిమ్ముతోంది. ఆలయాల్లోనూ, నదీతీరాల్లోనూ, బహిరంగ ప్రదేశాల్లోనూ సామూహిక దీపోత్సవాలు నేడు చోటు చేసుకుంటున్నాయి. భక్తిటివి కోటిదీపోత్సవ స్ఫూర్తి అంతటా ప్రతిఫలిస్తోంది. 
"యదాయదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత
అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహమ్"
సాక్షాత్తూ భగవానుని నోటివెంట జాలువారిన మహత్తర సందేశమే భగవద్గీత. మానవాళికి గీతాసందేశం దక్కిన శుభఘడియనే గీతాజయంతి పేరిట నిర్వహించుకుంటూ ఉంటాం. ఈనెల 14న గీతాజయంతి సందర్భంగా భగవానుని వాక్కులను స్మరించుకుందాం. ఈ పవిత్ర మార్గశిరమాసంలోనే (డిసెంబర్ 5 నుంచి జనవరి 2 వరకు) అనేక విశిష్ట సందర్భాలు వస్తున్నాయి. తిరుచానూరు పద్మావతీ దేవి పంచమీ తీర్థం 8వ తేదీన జరుగుతుంది. దత్తజయంతి, హనుమద్వ్రతం, కాలభైరవాష్టమి వంటి పర్వదినాలు కూడా ఈ నెలలోనే రానున్నాయి. మండల దీక్షలు చేస్తున్న అయ్యప్ప భక్తులు చన్నీటి స్నానాలతో, స్వామియే శరణమయ్యప్ప అనే సంబోధనలతో ఆ శబరి గిరీశుని అనుగ్రహాన్ని పొందే తరుణం కూడా ఇదే. ఇక అన్నింటికంటే ము

➠ తెలుగుప్రజలకు కార్తికం అనగానే భక్తిటివి కోటిదీపోత్సవం స్ఫురణకు వస్తుంది. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ స్టేడియం వేదికగా ఏర్పాటు చేసే కోటి దీపోత్సవ ప్రాంగణం... ఉత్సవం జరిగినన్ని రోజులూ సంధ్యవేళ ఓ కాంతివనంలా గోచరిస్తుంది. ఇక్కడ భక్తజనులు వెలిగించే ప్రతి దివ్వె మహాదేవుని కాలిమువ్వ అవుతుంది. రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత నరేంద్ర చౌదరి, రమాదేవి దంపతుల సత్సంకల్పంతో కోటి దీపోత్సవం అత్యంత వైభవంగా రూపుదిద్దుకుంది. 2012 నుంచి నిరాటకంగా కొనసాగుతూ వస్తోంది. కరోనా కష్టకాలంలో ఈ ఏడాది కూడా మరోసారి భక్తులకు ఆనందోత్సాహాలను పంచిపెట్టింది. ఇందులో వేలాదిమంది ప్రత్యక్షంగా పాల్గొన్నారు. కోటిదీపాలలో తమవంతు దీపాలను వారే స్వయంగా వెలిగించి, దర్శించి, నమస్కరించి తన్మయులయ్యారు. కాగా టివి మాధ్యమంగా ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది వీక్షించి, ఆనందించి, ఆశీర్వదించారు.

➠ పరమశివుని మహదవతారమైన శ్రీ కాలభైరవస్వామి ఆవిర్భవించిన పవిత్రదినం మార్గశిర బహుళ అష్టమి. దీనినే కాలభైరవాష్టమి అని వ్యవహరిస్తారు. కాలభైరవుని ప్రస్తావన లేని శివపురాణాలు, గాథలు లేవని చెప్పవచ్చు. చాలా శివక్షేత్రాలకు క్షేత్రస్వామి కాలభైరవుడే.

➠ శ్రీకాళహస్తిలో ఏడుగంగల జాతర ప్రతి ఏడాది కోలాహలంగా జరుగుతుంది. ఏడు ప్రధాన వీధులలో ఏడు గంగలు కొలువు దీరుతాయి. ప్రతి ఇంటిలోనూ పోలేరమ్మ కొలువు తీరుతుంది. కుంభాలలో వెలిగించిన దీపాలతో ముత్తయిదువలు గంగమ్మల వద్ద మొక్కులు తీర్చుకుంటారు. కులవివక్ష లేకుండా పరిసర ప్రాంత ప్రజలందరూ విశేష సంఖ్యలో జాతరలో పాలు పంచుకుంటారు. కరోనా నేపధ్యంలో జాతర నిర్వహణలో మార్పు చేర్పులుంటాయి.

➠ అరటిదొప్పలో వెలుగుతున్న దీపాన్ని ప్రవహించే నీటిలో విడిచిపెట్టే పర్వం తెలుగు మహిళలు ఆచరించే పోలిస్వర్గ దీపం. మార్గశిర శుద్ధ పాడ్యమి నాటి తెల్లవారుజామున నదీతీరాలన్నీ పుణ్యస్నానాలు ఆచరించే, దీపాలు విడిచే మహిళామణులతో నిండిపోతాయి. పోలిస్వర్గ దీపం వెనుక ఆసక్తి దాయకమైన కథ, వివరాలు.

➠ దత్తాత్రేయస్వామి పరిపూర్ణజ్ఞానమూర్తి. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ఏకత్వాన్ని సూచించే స్వరూపం. త్రిమూర్తుల ప్రత్యక్ష అంశంతో జన్మించినవాడు. స్థూల, సూక్ష్మ, కారణాలనే దేహత్రయాన్ని త్యజించిన కారణంగా (దత్తము అంటే త్యజించటం అనే అర్థం ఉంది) దత్తుడయ్యాడు. నిరంతర చైతన్య స్వరూపుడు. జాగ్రత్, స్వప్న, సుషుప్తి అనే అవస్థాత్రయం లేనివాడు. సత్వ,రజ, తమో గుణాలకు అతీతుడైనవాడు. అకార, ఉకార, మకారాల సంయోగమైన ఓంకారానికి మూలస్వరూపుడు. మొత్తంగా సత్య జ్ఞానానందమూర్తి. అన్నిటికన్నా మిన్నగా పరబ్రహ్మ తత్త్వమూర్తి దత్తాత్రేయస్వామి. 

➠ ఏలోరెంబావై అనేది మేలుకొలుపు. ధనుర్మాసంలో తరచుగా వినబడుతుంది. వైష్ణవులకు, శైవులకు కూడా పవిత్రమాసం ధనుర్మాసం. ఈ మాసంలో ఆలయాల్లో నిర్వహించే సుప్రభాత సేవల్లో వైష్ణవులైతే తిరుప్పావై, శైవులైతే తిరువెంబావై గానం చేస్తారు. మాణిక్యవాచకర్ రచించిన తిరువెంబావైలో మొత్తం ఇరవై పాశురాలుంటాయి. తిరువెంబావై మంత్రమయము, మహిమాన్వితమని పెద్దలు చెబుతారు. ఇరవై పాశురాల తిరువెంబావై అర్థనారీశ్వర తత్త్వాన్ని కవితాత్మకంగా చెబుతుంది. జగత్తంతా శివమయమని ప్రబోధిస్తుంది. శక్తిసమేతుడైన శివుని ఆరాధించి తరించమని సందేశమిస్తుంది.

Recent Comments