అశేష భక్తకోటి ఆదరాభిమానాలతో భక్తిటీవీ కోటిదీపోత్సవాన్ని నిర్వహించుకుంది. కోట్లాదిమంది భక్తుల మనోమందిరాలను పునీతం చేసింది. అక్టోబర్ 31 నుంచి నవంబర్ 14 వరకు నిర్వహించిన ఉత్సవంలో లక్షలాదిమంది భక్తజనులు ప్రత్యక్షంగా పాలుపంచుకున్నారు. దేశం నలుమూలల నుంచి విశిష్ట పీఠాధిపతులు, ప్రవచన కారులు తమ సందేశంతో దీపోత్సవానికి దివ్యకాంతులద్దారు. రాజకీయ, న్యాయ రంగ ప్రముఖులెందరో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. మరెన్నో భక్తి కళారూపాలతో ఉత్సవాన్ని సుసంపన్నం చేసిన కళాకారులకు అభివందనాలు. కోటిదీపోత్సవాన్ని తమ అభిమాన కార్యక్రమంగా భావిస్తున్న భక్తులకు, భక్తిటీవీ ప్రేక్షకులకు శిరసా వందనం. భక్తిప్రపత్తులతో మేం సంకల్పించి నిర్వహిస్తున్న ఈ దీపోత్సవం ఏటికేడాది కొత్తకాంతులతో విరాజిల్లడం మాలో నూతనోత్సహాన్ని నింపుతోంది. ఈ సంప్రదాయం సర్వత్ర వ్యాపించడం మాకెంతో ఆనందాన్నిస్తోంది. మీ ప్రోత్సాహం సదా మాపై ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాం. 

‘మాసాలలో మార్గశీర్షాన్ని నేనే’ అని గీతాచార్యుడు సెలవిచ్చాడు. ఈనెల 4న గీతాజయంతి పర్వదినం వస్తోంది. సూర్యుడు ధనూరాశిలో ప్రవేశించే సమయం ధనుర్మాసం. ఈనెల 16 నుంచి సంక్రాంతి పండుగ వరకు పల్లెముంగిళ్లలో  గొబ్బెమ్మలు దర్శనమిస్తాయి. రంగురంగుల రంగవల్లులు తీర్చిదిద్ది ఆవుపేడ, బంతిపూలతో గొబ్బిళ్లను తయారు చేస్తారు. గోదాదేవి రచించిన తిరుప్పావై పాశురాలతో రంగనాథుని సేవిస్తారు. మంచుకురిసే ఈ వేళలో... తెల్లవారుజామునే కన్నెపిల్లల తిరుప్పావై గీతాలాపనలు ఒకపక్క, శివాలయాల్లో పరుల తిరువెంబావై గానాలు మరోపక్క, దీక్ష తీసుకున్న అయ్యప్పస్వాముల భజన గీతాలు ఇంకోపక్క, పండితుల గీతాసందేశాలు మరోపక్క... ఈ మాసమంతా భక్తి పారిజాతాలను విరబూయిస్తూ ఉంటుంది. అలా పూసిన ప్రతిపువ్వు భగవానుని పాదాలను చేరి, మన మనోభీష్టాలను నెరవేర్చాలని కోరుకుందాం.

➠ డిసెంబర్, జనవరి మాసాల్లో తెలుగునాట ఆలయాలు, వీధులన్నీ అయ్యప్ప భజనలతో, మండల పూజలతో సందడిగా ఉంటాయి. అయ్యప్ప భక్తులు కఠిన నియమాలతో 41 రోజుల పాటు మండలదీక్ష చేస్తారు. నల్లవస్త్రాలు, మాలధరించి, చందన ధారణతో ఆధ్యాత్మికంగా జీవితాన్ని పునీతం చేసుకుంటారు. ఇరుముడి శిరస్సున దాల్చి, ఎన్నెన్నో కష్టనష్టాలకోర్చి శబరిమల చేసుకుంటారు.

➠ స్మరణాత్ అరుణాచలే అంటారు పెద్దలు జ్ఞానులు మాత్రమే చిదంబరాన్ని దర్శిస్తారు. తిరువారూరులో జన్మించినవారు, కాశీలో మరణించినవారు మోక్షానికి అర్హులవుతారు. అరుణాచలం అని ఊరుపేరు మాత్రం తలిచిన వారందరికీ... మోక్షం లభిస్తుంది. అరుణాచల శివ భక్తులు పున్నమి గిరిప్రదక్షిణ, కార్తిక దీపదర్శనాలు తప్పకుండా చేస్తుంటారు.

➠ మహాభాగవతం ప్రకారం పరమాత్మ ధరించిన 21 అవతారాల్లో దత్తావతారం కూడా ఒకటి. దుష్టశిక్షణ కోసం పరమాత్మ అవతారాలు ధరిస్తాడు. దత్తాత్రేయుడి అవతారంలో మనలో ఉన్న అజ్ఞానం, దుష్ట సంస్కారాలు అనే అసురుల్ని సంహరిస్తాడు. ఆయన నిత్యావతారమూర్తి. మార్గశిర పౌర్ణమిని దత్తజయంతిగా భక్తులు పాటిస్తారు.

➠ హనుమంతుని ఆరాధించే విశేష పర్వం హనుమద్వ్రతం. మార్గశిర శుద్ధ త్రయోదశినాడు హనుమంతుని ప్రీతికోసం వ్రతాచరణ చేయాలి. పదమూడు ముడులతో ఎర్రటి తాడును పూజలో ఉంచి, చివరిగా దానిని కట్టుకోవడం ఈ వ్రతంలో ప్రధానంగా కనిపిస్తుంది.

➠ శ్రీకృష్ణ భగవానుడు కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడికి గీతోపదేశం చేశాడు. అందులో ఏడువందలకు పైబడిన శ్లోకాలు, పద్దెనిమిది అధ్యాయాల్లో ఉన్నాయి. గీతాజయంతినాడు కొందరు గ్రంథాన్ని పూజిస్తారు. మరికొందరు పారాయణలు చేస్తారు. అవేమీ కాకుండా భగవద్గీతను ఏ కొద్దిగా అయినా అధ్యయనం చేయగలిగితే... జన్మ ధన్యం అవుతుందని పెద్దలు చెబుతుంటారు.

➠ తెలంగాణాలో జరిగే జాతరలలో కొమరెల్లి మల్లన్న జాతర ప్రసిద్ధి పొందింది. డిసెంబర్ 18 నాడు మల్లన్న జాతర... కల్యాణోత్సవం, శకటోత్సవాలతో ప్రారంభమవుతుంది. సంక్రాంతి తరువాత వచ్చే ఆదివారం అంటే 2023 జనవరి 22 నుంచి మూడునెలలపాటు ప్రతి ఆదివారం జాతర జరుగుతుంది.

Recent Comments