బ్రహ్మమురారి సురార్చిత లింగం
నిర్మలభాసిత శోభిత లింగం
జన్మజ దుఃఖ వినాశక లింగం
తత్ప్రణమామి సదాశివ లింగం

జన్మకో శివరాత్రి అని సామెత. ఒక్క శివరాత్రినాడైనా ఉపవాసంతో, అభిషేకంతో శివుని మెప్పించాలి. అలా చేస్తే పూర్వజన్మల పాపాలు తొలగిపోతాయి. క్రమంగా మోక్షానికి చేరువ అవుతాం. ఇటువంటి గొప్ప పర్వం ఫిబ్రవరి 18నాడు రాబోతోంది. ప్రతి శివాలయంలో ఆనాడు రోజంతా అభిషేకాలు, విశేష పూజలు జరుగుతాయి. ఊరూవాడా శివరాత్రి ఉపవాసాలు, జాగరాలు కొనసాగుతాయి. తిరునాళ్లు కోలాహలంగా సాగుతాయి. రంగురంగుల ప్రభలు కట్టుకుని వచ్చి శివుని సేవించేవారు, కోడెలను సమర్పించే వారితో ఆలయాలన్నీ కిటకిటలాడుతాయి. తెలుగునాట శ్రీశైలం, కాళహస్తి వంటి క్షేత్రాల్లో బ్రహ్మోత్సవాలు, కల్యాణాలు జరుగుతాయి. శివరాత్రికి ఉన్న ప్రాచుర్యం, ప్రాభవం మరో పర్వానికి లేవు. హరహర మహాదేవ అని ఒక్కసారి స్మరిస్తే చాలు, ఒక్కచెంబుడు నీళ్లతో ఆయనను అభిషేకిస్తే చాలు బోళాశంకరుడు వెంటనే కరిగిపోయి వరాలు కురిపిస్తాడు. అటువంటి మహాపర్వాన్ని సద్వినియోగం చేసుకుందాం. మహాదేవుని కరుణకు పాత్రులం అవుదాం. 

విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని జగత్తుకు అందించిన భీష్మాచార్యుని పేరుమీదుగా నిర్వహించుకునే భీష్మ ఏకాదశి పర్వదినంతో (ఫిబ్రవరి 1) ఈ మాసం ప్రారంభమవుతోంది. నృసింహ స్వామి ఆరాధనకు ప్రత్యేకించిన ఫాల్గుణ మాసాన్ని కూడా వెంట తెస్తోంది. యాదాద్రి, అహోబిలం క్షేత్రాల్లోఫిబ్రవరి 22న కల్యాణోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. వచ్చే మాసంలో కూడా కొనసాగనున్నాయి. వసంత ఋతువుకు తలగుమ్మంగా భావించే మాఘ, ఫాల్గుణ మాసాల్లో... ఆరాధనలు అందుకునే దేవతలు మనందరి కోరికలనూ నెరవేర్చాలని కోరుకుందాం. మనకు సకల శ్రేయస్సులనూ ప్రసాదించాలని వేడుకుందాం.

➠ ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర.. ములుగు జిల్లాలో జరిగే మేడారం జాతరకు దేశ నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా భక్తులు తరలివస్తుంటారు. అందుకే ఈ జాతరకు తెలంగాణ కుంభమేళా అనే పేరుకూడా ప్రసిద్ధి. జాతర సమయంలో వనదేవతలు సమ్మక్క-సారలమ్మను పూజించేందుకు లక్షలాది భక్తులు తరలివస్తారు.

➠ ఏడాదిలో వచ్చే పవిత్రమైన నాలుగు మాసాల్లో మాఘం ఒకటి. ఆషాఢం, కార్తికం, మాఘం, వైశాఖం అనే ఈ పరంపరలో కార్తికం, మాఘం స్నానాలకు ప్రసిద్ధి. మాఘమాసంలో సముద్రస్నానం, నదీస్నానం తప్పనిసరిగా చేస్తుంటారు. కార్తికంలో దీపవ్రతాలు చేసినట్లే, మాఘంలో స్నానవ్రతం చేయడం పురాణ ప్రసిద్ధంగా కనిపిస్తోంది. మాఘపౌర్ణమిని మనవారు మహామాఘి అంటారు. 

➠ భీష్ముడు తన బ్రహ్మచర్య వ్రతంతో, త్యాగనిరతితో లోకప్రసిద్ధిని పొందాడు. విష్ణు సహస్రనామాన్ని జగత్తుకు అందించాడు. అందరికీ ఆచార్యుడయ్యాడు. అష్టవసువులలో చివరివాడైన ఆయన పేరుతో జరుపుకునే భీష్మ ఏకాదశి పరమ పవిత్రమైనది. ఈ ఏకాదశినాడు విష్ణుపూజ, ఉపవాస నియమాదుల ఆచరణతో పాటుగా భీష్మ పితామహుని కూడా అర్చించాలి.

➠ మాఘమాసంలో అమావాస్యకు ముందురోజు శివరాత్రి వస్తుంది. అన్ని పండుగల్లోనూ చిట్టచివరిది మహాశివరాత్రి. ఆడంబరాలు, ఆర్భాటాలు లేని ఒకేఒక్క పండుగ శివరాత్రి. జన్మమొత్తంమీద ఒక్కసారి అభిషేకం చేసినా, శివపూజ చేసినా మోక్షాన్ని అనుగ్రహించేది మహాశివరాత్రి.

➠ మహాశివరాత్రికి శివాలయాలన్నీ భక్తజన సంద్రాలవుతాయి. కంచిలో మాత్రం శివరాత్రికి పదిహేను రోజులముందునుంచే లోకాలనేలే జగన్మాత అయిన కామాక్షీదేవికి అద్భుతరీతిలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఆ సందర్భంగా ప్రతి ఉదయం, సాయంత్రం వేళల్లో కంచి కామాక్షీదేవి మనోహరమైన వాహన సేవలందుకుంటూ భక్తకోటిని అనుగ్రహిస్తుంది. 

➠ కేవలం శిఖర దర్శనం చేసుకుంటే చాలు పునర్జన్మ ఎత్తవలసిన అవసరం లేకుండా చేసే దివ్యక్షేత్రం శ్రీశైలం. మహాశివరాత్రి సందర్భంగా ఈ క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. శివరాత్రినాటి లింగోద్భవకాలం తరువాత శివపార్వతుల కల్యాణం జరుగుతుంది.

Recent Comments