మన మనసు రాముడు. మాట రాముడు. మన బాట రాముడు. రాముడే మనకు ప్రియనేస్తం. ఆయనే మన ప్రభువు. తల్లి తండ్రి గురుపు దైవం. అటువంటి రాముడికి జన్మభూమిలో ఒక మందిరాన్ని నిర్మించాలని దేశ ప్రజలందరూ ఎంతగానో పరితపించారు. ఎట్టకేలకు ఆ సుముహూర్తం రానేవచ్చింది. శతాబ్దాల సంఘర్షణకు తెరపడింది. అయోధ్యలో రామమందిర నిర్మాణ స్వప్నం సాకారమైంది. భారత ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో అయోధ్యలో బాలరాముడు కోదండ ధనుర్ధారియై కొలువుదీరాడు. సుందర రామమందిర నిర్మాణ క్రతువు సంపూర్ణమైంది. భక్తిప్రపత్తులతో ఆయన ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన విధానం దేశవిదేశాలలోని రామభక్తులను హర్షపులకాంకితులను చేసింది. రామునికి తొలిపూజలు చేసి... పట్టు వస్త్రాలను, ఛత్రాన్ని సమర్పించారు. అంతేభక్తితో రామకార్యాన్ని నెరవేర్చిన ప్రతి ఒక్కరినీ ఆయన సముచిత రీతిన సన్మానించారు. అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ఠా మహోత్సవం నేపధ్యంలో భక్తిటీవీ చేపట్టిన విశేష కార్యక్రమాలకు లక్షలాది వీక్షకులు నీరాజనాలు పట్టారు.

అవినీతికి తావులేకుండా, సమతాభావంతో ప్రజలందరినీ తన బిడ్డల వలె భావించి రాముడు ఆనాడు రాజ్యాన్ని పాలించాడని చదువుతుంటాం. ఆనాటి రామరాజ్యం నేడు పునరావృతమవుతుందని... మన ధర్మానికి మళ్లీ మంచిరోజులు వచ్చాయని చెప్పడానికి రామమందిర ప్రారంభోత్సవమే తిరుగులేని సాక్ష్యం. నాలుగు పవిత్రమాసాల్లో ఒకటైన మాఘమాసం ప్రవేశిస్తోంది. ఈ మాసంలోనే వసంత పంచమి (ఫిబ్రవరి 14) సందర్భంగా సరస్వతీదేవిని ఆరాధించుకుంటాం. రథసప్తమి (ఫిబ్రవరి 16  నాటికి సూర్యుని రథాలు నిలబడతాయని, ఎండలు పెరుగుతాయని చెబుతుంటారు. సమస్కార ప్రియుడైన సూర్యునికి నిండు మనసుతో నమస్కరిద్దాం. విష్ణు సహస్రనామాన్ని జాతికి అందించిన భీష్మ ఏకాదశి పర్వదినం (ఫిబ్రవరి 20) సందర్భంగా పెద్దలందరినీ పూజించుకుందాం. మేడారం సమ్మక్క - సారమ్మ జాతర (ఫిబ్రరి 23) సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ నా శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను.

➠ తెలంగాణ ప్రాంతంలో సమ్మక్క సారలమ్మ జాతర తర్వాత రెండో అతి పెద్ద జాతర కేస్లాపూర్ నాగోబా జాతర. దీనిలో భాగంగా దాదాపుగా 80 కిలోమీటర్ల మేరకు పవిత్రయాత్ర సాగుతుంది. జాతర నిర్వహించే ప్రధాన తెగ అయిన మేస్రం వంశీయులు జాతరకు ముందుగా జరిపే యాత్ర ఇది. ఈ యాత్రాక్రమం, వారు పాటించే ఆచారాలు ఆసక్తికరంగా ఉంటాయి.

➠ కడపను దేవుని కడప అని పిలుస్తారు. యుగాలనాటి ఈ క్షేత్రాన్ని గురించి అన్నమయ్య పేర్కొన్నాడు. గరుడధ్వజుడైన దేవుని కడప వేంకటేశ్వరుడు రథంపై కదలివస్తుంటే పదివేల సూర్యబింబాలు ఒక్కసారి ఉదయించినట్లుగా ఉందన్నాడు. రథసప్తమినాడు దేవుని కడప వేంకటేశ్వర స్వామికి రథోత్సవం నిర్వహిస్తారు. దీనిని చూడడానికి రెండు కన్నులూ చాలవు.

➠ కృష్ణాజిల్లా పెనుగంచిప్రోలును గతంలో పెదకంచి అని పిలిచేవారు. శ్రీలక్ష్మీ తిరుపతమ్మ పేరంటాలుగా ఈ క్షేత్రంలో పూజలందుకుంటోంది. పతిభక్తికి దైవశక్తికి ప్రతీకగా తిరుపతమ్మను భక్తులు కొలుస్తారు. పెనుగంచిప్రోలులో ప్రతి మాఘపౌర్ణమికి శ్రీలక్ష్మీ తిరుపతమ్మ కల్యాణం వైభవంగా జరుగుతుంది.

➠ కృష్ణవేణీ నది సాగరగర్భంలోకి చేరేచోటు హంసలదీవి. ఇక్కడ వెలిసిన వేణుగోపాలస్వామి ఆలయం పరమ పావనమైనది. మాఘమాసంలో పున్నమి వెలుగుల్లో కల్యాణమూర్తిగా నిలిచే వేణుగోపాల స్వామిని దర్శించడం మరపురాని అనుభూతి. ఈనెల 24న హంసలదీవిలో స్వామికి కల్యాణోత్సవం జరుగుతుంది.

➠ అంతర్వేది లక్ష్మీనృసింహ స్వామి క్షేత్రం సుప్రసిద్ధం. ఏటా మాఘమాసంలో అంతర్వేది తీర్థం జరుగుతుంది. రథసప్తమి నుంచి బహుళ పాడ్యమి వరకూ స్వామి కల్యాణోత్సవ, బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. వివిధ వాహన సేవలతో పాటుగా రథోత్సవం కనులవిందు చేస్తుంది. పదిరోజులపాటు జరిగే ఈ ఉత్సవాలు తెప్పోత్సవంతో పూర్తి అవుతాయి.

➠ భారతదేశం మహాభక్తులకు నిలయం. నాద, స్వరబ్రహ్మలైన మహాభక్తులకు తెలుగునేల ఆవాసమిచ్చింది. భక్తికి కీలకమైన 'భజన' మార్గం సంగీతమే ఆలంబనగా మనగలుగుతుంది. సంగీతానికే జీవంపోసిన అటువంటి మహనీయుల్లో కంచెర్ల గోపన్న ప్రాతస్మరణీయుడు. ఈయనే తరువాత కాలంలో భక్త రామదాసుగా జగత్ ప్రసిద్ధి గాంచాడు.

Recent Comments