కాలం దైవస్వరూపం. మంచిచెడులు కాలాన్ని అనుసరించి ఉంటాయి. మార్పులేని కాలంలో మార్పులను మన మంచికోసమే పరమాత్మ ఏర్పాటు చేశాడు. ఆంగ్లనూతన సంవత్సరం కోటి ఆశలతో అడుగుపెడుతోంది. జనవరి నెల క్యాలెండర్ లెక్కలేనన్ని పండుగలతో నిండిపోయి, మనకు ఎనలేని ఉత్సాహాన్ని తెచ్చిపెడుతోంది. నారాయణునితో దేవతలందరి అనుగ్రహాన్ని మనకు సంపూర్ణంగా అనుగ్రహించే ఏకాదశి పర్వదినం 2న విచ్చేస్తోంది. ఆనాడు ఉత్తరద్వారం నుంచి విష్ణుదర్శనం చేసి, పునీతులం అవుదాం. సూర్యుడు మకరరాశిలో ప్రవేశించే ఉత్తరాయణ పుణ్యకాలాన్ని తనతోపాటు మోసుకొచ్చే సంక్రాంతి (జనవరి 15) మనకు పెద్దపండుగ. ధాన్యలక్ష్మి రైతుల లోగిళ్లలోకి ప్రవేశించే తరుణమిది. మంచుపరదాలతో, బంతిపువ్వు సిగలో తురుముకున్న ముగ్గుగొబ్బెమ్మల శోభతో, చలిమంటల వెచ్చదనంతో సంక్రాంతి నెలంతా శోభాయమానంగా ఉంటుంది. పిల్లకు భోగిపళ్ల పేరంటాలు, జానపద కళా ప్రదర్శనలు, కోడిపందేలతో మన గ్రామాలన్నీ పూర్వవైభవాన్ని సంతరించుకుంటాయి.
అటుపైన ఆలస్యం చేయకుండా నదీస్నానాలకు ప్రసిద్ధి పొందిన మాఘమాసం ప్రవేశిస్తోంది. చదువుల తల్లి సరస్వతీదేవిని ఆరాధించే వసంత పంచమి 26న వస్తోంది. ఆనాడు చిన్నారులకు అక్షరాభ్యాసాలు చేయిస్తారు. పలక, బలపం పట్టించి ‘ఓం నమశ్శివాయ సిద్ధం నమః’ అని మునుముందుగా పెద్దల చేత అక్షరాలు దిద్దిస్తారు. ఆ వెనువెంటనే సూర్యదేవుని అనుగ్రహాన్ని పొందేందుకు సాధనమైన రథసప్తమి పర్వదినం జనవరి 28న వేంచేస్తోంది. ప్రత్యక్ష దైవమైన సూర్యుడే శివుడని శాస్త్రాలు చెబుతున్నాయి. దైవమే స్వయంగా ఎంచుకున్న మాసమిది. మన ఆరాధనలతో తాను సంతృప్తి చెంది కోరిన వరాలను అనుగ్రహించాలని వేడుకుందాం. కొత్త ఏడాదిలో అందరికీ శుభాలు కలగాలని దైవాన్ని ప్రార్థిద్దాం.
➠ దక్షిణ భారతదేశంలోని ప్రముఖ పుణ్య క్షేత్రాల్లో శబరిమల ఒకటి. ఆ కొండపై కొలువున్న అయ్యప్పస్వామిని దర్శించుకోవడానికి ఏటా లక్షలాది మంది భక్తులు దేశ విదేశాల నుంచి తరలివస్తారు. వారిలో తెలుగు యాత్రికుల సంఖ్య అపారం. అయ్యప్ప దీక్షలో అతిముఖ్యమైన తేదీ మకర సంక్రాంతి. ఆనాడు (జనవరి 14) శబరిమల కొండపైన మకరజ్యోతి దర్శనమిస్తుంది.
➠ సరస్వతీదేవికి సంబంధించి మూలానక్షత్రం, పంచమి తిథి ప్రధానమైనవి. దసరా రోజుల్లో మూలానక్షత్రం రోజున మహాసరస్వతిని ప్రత్యేకంగా పూజిస్తారు. మాఘమాసంలోని వసంత పంచమి రోజు సరస్వతీదేవి జన్మతిథి కనుక, ఆ రోజున కూడా ఆమెను ప్రత్యేకంగా ఆరాధిస్తారు. విద్యను, జ్ఞానాన్ని మాత్రమే కాకుండా శక్తియుక్తులు, సమస్త సంపదలు కూడా సరస్వతీ అనుగ్రహంతో కలుగుతాయి.
➠ తెలంగాణలో ఆదివాసులు నిర్వహించుకునే నాగోబా జాతర అత్యంత ప్రసిద్ధి పొందింది. పర్యాటకులను ఆకర్షిస్తోంది. గోండు తెగలవారి నాగారాధన సంప్రదాయాలను చూడడానికి విశేషంగా భక్తులు తరలి వెళ్తుంటారు.
➠ సంగీతశక్తి, రామభక్తి కలగలసిన మహోన్నత సంగీతమూర్తి త్యాగరాజు. తాను నమ్ముకున్న రాముడినే జీవన సర్వస్వంగా భావించి, రామభక్తి సామ్రాజ్యానికి చక్రవర్తి అయ్యారు. తేట తెలుగుపదాల వరదతో వేలాది కృతులు రచించి అమ్మభాషకు ఎనలేని సేవచేశారు. త్యాగరాజు కర్ణాట సంగీత యుగకర్త. శాసనకర్త.
➠ సూర్యుడే మనకు ప్రత్యక్షదైవం. అత్యంత ప్రాచీన కాలంలో భారతీయులందరూ సూర్యారాధకులే. ‘శ్రియందేహి, యశోదేహి, ఆరోగ్యందేహి భాస్కరా!’.... అని పెద్దలు ప్రార్థిస్తారు. మానవులకు సంపదలను, యశస్సును, ఆరోగ్యాన్ని సూర్యుడే ప్రసాదిస్తాడు. రథసప్తమినాడు సూర్యదేవుని నిష్టగా పూజించిన వారికి అవన్నీ సమకూరుతాయి.
➠ పండుగలు మన సంస్కృతీ చిహ్నాలు. సంప్రదాయ వైభవాలు. పర్వం అనే శబ్దం నుంచి పబ్బం పండగ అనే రూపాలు వచ్చాయి. మకర సంక్రమణం తెలుగువారికి పెద్దపండుగ. ధాన్యసిరులు ఇంటికి వచ్చే సంక్రాంతి పండుగను వ్యవసాయ ప్రధాన దేశం కనుక మనవారు ఉత్సాహంగా జరుపుకుంటారు. మకర సంక్రమణం ఖగోళశాస్త్ర రీత్యా కూడా విశిష్టమైనది.