"గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః
గురుస్సాక్షాత్ పరంబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః"

ధ్యానవేళ మనసులో మెదిలే రూపం గురువుదే. పూజించవలసింది గురువుల పాదాలనే. గురువుల వచనాలను మననం చేసుకుంటూ తరించాలి. మోక్షం పొందడానికి కారణం గురుకృప తప్ప మరొకటి కాదు. గురుపూర్ణిమ మహోత్సవం ఈనెల 13న వస్తోంది. యుగాలుగా మానవజాతిని సంస్కరించి, నాగరికతను నేర్పిన గురువులకు వందనాలు సమర్పిద్దాం. వారు నేర్పిన విలువలను నిలబెట్టుకుందాం. ఆషాఢ పూర్ణిమ వేళ పీఠాధిపతులు, ఇతర స్వాములు చాతుర్మాస్య దీక్షకు ఉపక్రమిస్తారు. వారి దీక్షలు లోకకల్యాణం కలిగించాలని కోరుకుందాం. మనకోసం దీక్షాబద్ధులైన వారికి పాదాభివందనం చేద్దాం. గత మాసం చివరిలో ఆరంభమైన బోనాల పర్వం జూలైలో పతాక స్థాయికి చేరుకుంటుంది. ఉజ్జయిని మహంకాళి, లాల్ దర్వాజా బోనాల పర్వాలు భాగ్యనగరాన్ని భక్తిసాగరంలో ఓలలాడిస్తాయి. ఈ సందర్భంగా తెలంగాణ ఆడపడుచులందరికీ శుభాకాంక్షలు. గ్రామదేవతలందరికీ నైవేద్యాలు సమర్పించే ఈ దివ్యమైన పండుగ అందరి కోరికలనూ నెరవేర్చాలని కోరుకుందాం.

మన పెద్దలు ‘సర్వం జగన్నాథం’ అంటారు. పూరీ జగన్నాథునికి భేదభావాలు లేని దేవుడు అని తాత్పర్యం. పూరీలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా జగన్నాథ రథోత్సవం (జూలై 1) నిర్వహిస్తున్నారు. అభీష్టాలను ప్రసాదించమని జగన్నాథుని వేడుకుందాం. దక్షిణాయన పుణ్యకాలం 17న ప్రారంభమవుతోంది. శ్రీమహావిష్ణువు యోగనిద్రకు ఉపక్రమించే తొలి ఏకాదశి (జూలై 10) పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామికి కైమోడ్పులు సమర్పిద్దాం. భక్తిపత్రిక జూలై 2022 సంచిక ఇప్పుడు మీ కరకమలాల్లో ఉంది. మీ ఆశీస్సులతో, ఆదరాభిమానాలతో భక్తిపత్రిక ఏడు సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకుని ఎనిమిదో ఏట అడుగుపెట్టింది. ఈ సంతోషవేళ పాఠకులకు, ప్రకటన కర్తలందరికీ కృతజ్ఞతాభివందనాలు. ఎప్పటిలాగే భక్తిపత్రికను ఆదరిస్తారని ఆశిస్తూ....

➠ చాంద్రమానం అనుసరించే తెలుగువారికి శ్రావణమాసం చాలా విశేషమైంది. మంగళవారాల్లో గౌరీదేవిని, శుక్రవారాల్లో లక్ష్మీదేవిని ఆరాధిస్తారు. ప్రత్యేకించి స్త్రీలు ముత్తయిదువలను ఇంటికి ఆహ్వానించి వాయినాలు అందిస్తారు. శ్రావణమాసంలోనే శ్రీకృష్ణాష్టమి, గాయత్రీజయంతి వంటి పర్వదినాలు వస్తాయి.

➠ సత్యనారాయణ వ్రతం చేయడం తెలుగువారి సంప్రదాయం. వ్రతం చేసినవారికి అంతా శుభమే జరుగుతుందని నమ్మకం. అన్నవరం దివ్యక్షేత్రంలో ఆ స్వామి వెలిసిన పవిత్రదినాన (జూలై 22) ఆవిర్భావోత్సవాలు జరుగుతాయి.

➠ ప్రకృతిలోని ప్రతి అణువూ జగన్మాత స్వరూపమే. అందుకే ఆమెను ప్రకృతి స్వరూపిణిగా శాస్త్రాలు వర్ణిస్తున్నాయి. తన బిడ్డల వంటి భక్తుల క్షుద్బాధను తీర్చటానికి ఆ తల్లి తానే స్వయంగా అన్నిరకాల కూరగాయలను ఆభరణాలుగా ధరించి, శతాక్షిగా అవతరించింది. ప్రజలందరికీ సాంత్వన చేకూర్చింది. అందుకే ఆ తల్లి శాకంభరిగా భక్తుల నీరాజనాలు అందుకుంటోంది.

➠ గత శతాబ్దపు మహోన్నత యోగగురువుల్లో స్వామి శివానంద ఒకరు. చిన్మయానంద వంటి గురువులకు గురువు స్వామి శివానంద. ఆయన స్థాపించిన దివ్యజీవన సంఘం ప్రపంచవ్యాప్తంగా సాధకులకు మార్గనిర్దేశం చేస్తోంది. తెలుగునేలపై కూడా డివైన్ లైఫ్ సొసైటీ హైదరాబాద్ కేంద్రంగా విశిష్ట సేవలు అందిస్తోంది.

➠ సూర్యుడు కర్కాటకంలో ప్రవేశించే దక్షిణాయనం పుణ్యప్రదమైనది. మన ప్రధాన పండుగలన్నీ దక్షిణాయనంలోనే వస్తాయి. అయితే శుభకార్యాలను ఉత్తరాయణంలోనే నిర్వహించుకుంటాం. కానీ మనం శక్త్యారాధన, రుద్రారాధన, పితృదేవతారాధనలకు మాత్రం దక్షిణాయనమే ప్రధానం.

➠ ఆషాఢ మాసంలో కృత్తికా నక్షత్రం వున్న రోజున ఆడి కృత్తిక జరుపుకుంటారు. ఆడికృత్తికనాడు సుబ్రహ్మణ్య భక్తులు తమిళనాడులో ‘ఆరు పడైవీడు’గా ప్రసిద్ధిచెందిన ఆరు ప్రధాన క్షేత్రాలను దర్శించి విశేష పూజలు చేస్తారు. వీటిని ఒకేరోజులో దర్శించలేం. ఆడికృత్తిక నాడు శరవణ భవ నామంతో కలిపి ఈ క్షేత్రాల పేర్లను తలుచుకుంటే దర్శించిన ఫలం లభిస్తుంది.

Recent Comments