ఆంజనేయం మహావీరం
బ్రహ్మవిష్ణు శివాత్మకం
బాలార్క సదృశాభాసం
రామదూతం నమామ్యహం
చూచిరమ్మంటే కాల్చి వచ్చే దక్షత గల కార్యశీలి హనుమంతుడు. అపరిమిత శక్తి సంపన్నుడే కాకుండా గొప్ప మాటకారిగా కూడా పేరు తెచ్చుకున్నాడు. చిరంజీవిగా, విశిష్టదైవంగా దివ్యకీర్తిని పొందాడు. హనుమంతుని శరణువేడితే అసాధ్యాలను సుసాధ్యం చేస్తాడు. నేటి మహమ్మారి నేపథ్యంలో మనవంతుగా రక్షణచర్యలు తీసుకుందాం. దానితో పాటు హనుమంతుని కరుణ కూడా మనపై ఉండాలని ఆయనను వేడుకుందాం. హనుమజ్జయంతి (జూన్ 4) సందర్భంగా ఆ శ్రీరామదూతకు జయము పలుకుదాం. ప్రపంచానికి భారతదేశం అందించిన దివ్యమైన కానుక యోగశాస్త్రం. వ్యాకరణంతో భాషను సంస్కరించి, ఆయుర్వేదంతో ఆరోగ్యాన్ని ప్రసాదించి, యోగశాస్త్రంతో జ్ఞానాన్ని సుస్థిరం చేసిన పతంజలి మహర్షికి ఈ సందర్భంగా నమస్కరిద్దాం. పతంజలి కాలంనుంచి యోగశాస్త్రం అనేక మార్గాల్లో విస్తరించింది. నేడు విశ్వవ్యాప్తంగా ప్రతి ఒక్కరినీ ఆకర్షిస్తోంది. అంతర్జాతీయ యోగదినోత్సవం (జూన్ 21) సందర్భంగా నేటికాలపు అనారోగ్యాలకు యోగశాస్త్రం అందించే పరిష్కారాలను పరిశీలిద్దాం. దశపాపహర దశమి, సౌందర్యలహరి ఆవిర్భావ దినోత్సవం అయిన ఆదిశంకరుల కైలాసగమనం, ఏరువాక పున్నమి, పూరీ జగన్నాథ స్నానోత్సవం వంటి విశిష్ట పర్వాలెన్నో ఈ మాసంలోనే వస్తున్నాయి. మన పండుగలన్నింటినీ ఆనందంగా నిర్వహించుకుందాం. అన్ని సందర్భాల్లోనూ మాస్క్ పెట్టుకోవడం, సామాజిక దూరం పాటించడం వంటి ప్రాథమిక నియమాలను తప్పనిసరిగా పాటిద్దాం. మహమ్మారిపై గెలుపును శాస్త్రవేత్తలు, వైద్యులు ధృవీకరించేవరకూ నియమాలను ఉల్లఘించవద్దు. సర్వేజనాః సుఖినోభవంతు. 

➠ అష్టాదశ శక్తి పీఠల్లో అత్యంత శక్తిమంతమైనది కామాఖ్యాదేవి క్షేత్రం. అస్సాంలోని బ్రహ్మపుత్రా నది ఒడ్డున, గౌహతికి సమీపంలో నీలాచల పర్వతంపై ఉంది. ఇక్కడ వెలసిన దేవిని కామాఖ్య అని, కామరూపిణి అని పిలుస్తారు. సతీదేవి యోనిభాగం పడ్డ ప్రదేశం కనుక దీనిని సృష్టికి మూల కారణమైన స్థానంగా భావిస్తారు. ఇక్కడ ప్రతి సంవత్సరం ఆషాఢమాసంలో అంబుబాచి మేళా జరుగుతుంది. 

➠ శివుడు గంగను తలపైన ధరించాడు. శ్రీమహావిష్ణువు సాగరాన్నే ఇంటిని చేసుకున్నాడు. బ్రహ్మదేవుడు కమలంలో జన్మించాడు. ఆ కమలం నీటిలో పుడుతుంది. నదులు మాతృ స్వరూపాలని, సకల పాపాలు హరిస్తాయని మార్కండేయ పురాణం చెబుతోంది. అటువంటి పవిత్రమైన నదుల వరసలో మొదటిది, తలమానికమైనది గంగ. ఆమె మోక్షస్వరూపిణి. గంగాపానం, గంగాస్నానం సకల పాపాల నుంచి విముక్తులను చేస్తుంది. విష్ణులోక ప్రాప్తి కలిగిస్తుంది.

➠ నీటిబండిపై వచ్చే వరుణదేవా! నీ రథాన్ని భూమిపైకి పంపు అని వేదం కోరుకుంది. శ్రీకృష్ణదేవరాయలు ఏరువాక పున్నమినాడు రైతులను సత్కరించేవాడని చరిత్ర చెబుతోంది. ఏడాది పొడవునా దేశప్రజలందరూ తినే బువ్వను పండించడానికి రైతన్న చేసే తొలి ప్రయత్నమే ఏరువాక.

➠ మాతృశ్రీ అనసూయా దేవి విశ్వజననిగా ప్రసిద్ధురాలు. బాపట్లకు సమీపంలోని జిల్లెళ్లమూడి గ్రామంలో సామాన్య గృహిణిగా ఆమె జీవనం సాగించింది. సర్వసమ్మతమైనదే నా మతం అంటూ ఆకలే అర్హతగా అన్నపూర్ణాలయంలో అందరికీ ఆహారం అందించింది. ఆమె ప్రబోధాలకు ఆచరణాత్మక రూపం శ్రీవిశ్వజననీ పరిషత్. ఈ సంస్థ తరఫున విద్య, వైద్యాలయాలు, హైమాలయం, ఆదరణాలయం వంటివెన్నో సమాజసేవలో తమవంతు పాత్ర పోషిస్తున్నాయి.

➠ చెట్టు సర్వప్రాణికోటికీ జీవనాధారం. చెట్లు లేనిదే భూమిపై జీవరాశి ఉనికిని ఊహించలేం. జంతుజాలం, మానవులు లేకపోయినా వృక్షాలు జీవించగలవు. కానీ చెట్లు లేకుండా మానవులతో పాటుగా ఏ జీవరాశులూ జీవించలేవు. దైవం అన్నింటికంటే ముందుగా చెట్లను సృష్టించి సకల జీవరాశులకూ మేలు చేశాడు. మన వనసీమలు మనకు వరాలు.

➠ జ్యేష్ఠ శుద్ధ ద్వాదశినాడు ఆదిశంకరులు కైలాసగమనం చేసినట్లు శంకరవిజయం చెబుతోంది. అయ్య కానుకగా అయిదు చంద్రమౌళీశ్వర లింగాలను, అమ్మ కానుకగా సౌందర్యలహరిని కైలాసం నుంచే శంకరులు తీసుకువచ్చారు. పరతత్త్వ నిరూపణ చేస్తూ, శ్రీవిద్యా రహస్యాలను బోధించే సౌందర్యలహరిపై ప్రపంచవ్యాప్తంగా అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. సాధకులకు, ముముక్షువులకు చరమలక్ష్య సిద్ధిని సౌందర్యలహరి ప్రసాదిస్తుంది.