"పడమటి దిక్కున వరదగుడేసే...
ఉరుముల మెరుపుల వానలు కురిసే
ఏరువాకా సాగారో రన్నో చిన్నన్నా..."
మన రైతన్నలు వ్యవసాయ పనులను ప్రారంభించే ఏరువాక పూర్ణిమ జూన్ 13న వస్తోంది. పశువులను, వ్యవసాయ పనిముట్లను కడిగి, అలంకరించి పూజిస్తారు. విత్తనాలు చల్లడానికి వీలుగా నేలను దున్నడం ఏరువాక పున్న మినాడే మొదలుపెడతారు. పదిరకాలైన పాపాలను కడిగివేసే శక్తి గంగకు ఉందంటారు. అందుకే గంగాజయంతిని దశపాపహర దశమిగా భావిస్తారు. ఆ మరునాడు వచ్చే ఏకాదశినాడు విష్ణు భక్తులు నీరుసైతం ముట్టుకోకుండా ఉపవాసం చేసి తరిస్తారు. ద్వాదశినాడు (జూన్ 11) ఆదిశంకరుల కైలాసగమనం. శంకరులు కైలాసానికి వెళ్లి స్ఫటిక లింగాలను, సౌందర్యలహరీ గ్రంథాన్ని తీసుకువచ్చారని కథనం. ఆనాడు సౌందర్యలహరీ ఆవిర్భావదినం. జగన్మాత అనుగ్రహం అందరికీ కలగాలని ప్రార్థిద్దాం.
మన యోగశాస్త్రాన్ని నేడు ప్రపంచమంతా అనుసరిస్తోంది. జూన్ 21న అంతర్జాతీయ యోగదినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. యువతరం యోగసాధనలపై ఆసక్తి, శ్రద్ధ పెంచుకుంటోంది. ఇది మంచి పరిణామం. అందరూ అనుసరించదగిన ఆదర్శం. ఈసారి నైరుతి ఋతుపవనాలు చక్కని వర్షపాతాన్ని అందించాలి. జూన్ నెల పూర్తవుతూనే ఆషాఢమాసం ప్రవేశిస్తోంది. గోల్కొండతో మొదలుపెట్టి తెలంగాణ ప్రజలు అమ్మవారికి బోనాల పేరిట నైవేద్యాలు సమర్పిస్తారు. ఘటాల ఊరేగింపులతో శాంతించిన ప్రకృతి మాత మనకు ఆరోగ్యాన్ని, సంపదలను అనుగ్రహించాలని వేడుకుందాం. నూతన విద్యా సంవత్సరం ప్రారంభంలో మన చిన్నారుల విద్యాభ్యాసం ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగాలని కోరుకుందాం.
➠ మన సనాతన ధర్మంలో ప్రకృతి ఆరాధనకు ఎంతో ప్రాధాన్యం ఉంది. మనలో ప్రాణశక్తిగా ప్రవహించే జీవత్వానికి దైవ స్పర్శ ప్రధాన అంశం. ఆ ప్రాణశక్తి చెట్లు, మొక్కల ద్వారా లభిస్తుందని నమ్ముతారు. అందుకే మనవారు వృక్షాలను పూజిస్తారు.
➠ ఆషాఢమాసం వచ్చిందంటే తెలంగాణ మాగాణమంతా శివసత్తుల ఊరేగింపులతో పరవశించిపోతుంది. ఆషాఢంలోని ప్రతి ఆదివారంనాడు ఎక్కడో ఒకచోట బోనాలు సమర్పిస్తూనే ఉంటారు. దీనికి ప్రారంభ సూచనగా జూన్ 30న గోల్కొండ బోనాలు నిర్వహిస్తారు.
➠ ప్రాణమే దైవం. అటువంటి ప్రాణాన్ని వాయురూపంలో మనవారు ఆరాధిస్తారు. వెన్నెముకను నిట్టనిలువుగా నిలిపి ఉంచి, ప్రాణమనే దైవాన్ని తనలోకి స్వీకరించిన మానవుడే ఉత్తముడని ఉపనిషత్తులు బోధించాయి. కుండలినీశక్తిని ప్రాణశక్తిలో మిళితం చేసే రాజయోగ రహస్యాలను స్వామి వివేకానంద బోధించారు.
➠ గంగ పుట్టిన రోజే దశపాపహర దశమి. మనలోని సకల కల్మషాలనూ గంగ కడిగివేయగలదని చెబుతారు. అలా గంగ కడిగివేసే పదిరకాలైన పాపాలను ప్రక్షాళన చేసుకోవడానికి ఉద్దేశించినదే గంగాదశమి.
➠ నేటి యాంత్రిక యుగంలో శాంతి కరువవుతోంది. మానసిక ఆందోళనల నుండి బయటపడాలనే తాపత్రయం అందరికీ ఉంటుంది. సంతోషకర వాతావరణంలో ప్రశాంతంగా గడపడమే కదా ఎవరైనా కోరుకునేది. శాంతస్థితిని సాధించాలంటే ధ్యానమే మంచి సాధనం అంటున్నారు ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు శ్రీశ్రీ రవిశంకర్.
➠ హనుమంతుడు తొమ్మిది అవతారాలను ధరించాడు. వాటిలో ఆరోది సువర్చలా సమేత ఆంజనేయస్వామి. హనుమద్వ్రతం, పూర్వాభాద్ర నక్షత్రం, జ్యేష్ఠ శుద్ధ దశమి తిథుల్లో హనుమంతుని కల్యాణాలు ప్రత్యేకంగా నిర్వహిస్తారు.