ఏరువాక పున్నమినాటికి తొలకరి రుతువు ప్రవేశిస్తుంది. రైతన్నలు వ్యవసాయ పనులు ప్రారంభిస్తారు. విత్తనాలు చల్లడానికి వీలుగా నేలను దున్నడం మొదలుపెడతారు. ఏరువాకా సాగారో అంటూ ఉత్సాహంగా సాగే కృషీవలుల శ్రమ ఫలించాలని, అధిక దిగుబడులతో నేలతల్లి కరుణించాలని కోరుకుందాం. ప్రపంచానికి భారతదేశం అందించిన అద్భుత కానుక యోగశాస్త్రం. వ్యాకరణంతో భాషను సంస్కరించి, ఆయుర్వేదంతో ఆరోగ్యాన్ని ప్రసాదించి, యోగశాస్త్రంతో జ్ఞానాన్ని సుస్థిరం చేసిన పతంజలి మహర్షికి మునుముందుగా నమస్కరిద్దాం. పతంజలి కాలం నుంచి యోగశాస్త్రం అనేక మార్గాల్లో విస్తరించింది. జూన్ 21, అంతర్జాతీయ యోగదినోత్సవం సందర్భంగా నేటికాలపు అనారోగ్యాలకు యోగశాస్త్రం అందించే పరిష్కారాలను పరిశీలిద్దాం. గీతాజయంతిలాగా సౌందర్యలహరి పుట్టిన రోజును కూడా జూన్ 1న మనవారు ఘనంగా జరుపుకుంటారు. సౌందర్యలహరి గ్రంథాన్ని ఆదిశంకరులు కైలాసం నుంచి తీసుకువచ్చారని చెబుతారు. 

ఆషాఢమాసం వస్తూనే పూరీ జగన్నాథ రథచక్రాలు ముందుకు కదులుతాయి. ఒక్క పూరీక్షేత్రంలోనే కాకుండా అంతర్జాతీయంగా అనేక దేశాల్లో జగన్నాథ రథోత్సవం భక్తులను పునీతం చేస్తోంది. ఆ దివ్యమైన వేడుక వెనుకనున్న సంప్రదాయాలను స్మరిద్దాం. ఆషాఢమాసం శక్తి ఆరాధనకు ప్రత్యేకించినది. ఈ ఆషాఢంలోనే శుక్ల ఏకాదశినాడు శ్రీమహావిష్ణువు యోగనిద్రకు ఉపక్రమిస్తాడు. తొలి ఏకాదశి పేరుతో ఈ పర్వాన్ని జూన్ 29న జరుపుకోబోతున్నాం. ఆ రోజునుంచి కార్తికం వరకు నాలుగునెలల పాటు విష్ణుమూర్తి యోగనిద్రలో ఉంటాడు కనుక, జగత్తుల పాలనా బాధ్యతలను ఆయన తన సోదరి అయిన పార్వతికి ఇస్తాడని చెబుతారు. అందుకే ఆషాఢంలో ప్రత్యేకంగా తెలంగాణ ప్రజలు జగన్మాతకు బోనాలు సమర్పిస్తారు. ఈ ఏడాది జూన్ 22 నాడు గోల్కొండ జగదంబిక తొలిబోనం స్వీకరిస్తుంది. మన ఆడపడుచులు సమర్పించే బోనాలతో, శివసత్తుల ఊరేగింపులతో సంతోషించిన జగన్మాత మనందరికీ కోరిన వరాలన్నీ అందించాలని వేడుకుందాం.

➠ వటసావిత్రి వ్రతం చేసుకుంటే దాంపత్యం కలకాలం వర్ధిల్లుతుందని నమ్ముతారు. అంతులేని సౌభాగ్య సంపదలు లభిస్తాయని, మంచి సంతానం కూడా కలుగుతుందని వ్రతకథలో కనిపిస్తుంది. భౌగోళికంగా మహారాష్ట్రతో సరిహద్దుగల తెలంగాణ ప్రాంతంవారు కూడా ఈ వ్రతాన్ని నియమనిష్ఠలతో చేస్తారు. సౌభాగ్యాన్ని, సంతానాన్ని ఇవ్వమని ప్రార్థిస్తారు.

➠ ఆషాఢమాసం వచ్చిందంటే తెలంగాణ మాగాణమంతా శివసత్తుల ఊరేగింపులతో పరవశించిపోతుంది. జగన్మాతకు బోనాల సమర్పణతో అన్నిచోట్లా పండుగ వాతావరణం కనిపిస్తుంది. ఆషాఢంలోని ప్రతి ఆదివారంనాడు ఎక్కడో ఒకచోట బోనాలు సమర్పిస్తూనే ఉంటారు. దీనికి ప్రారంభ సూచనగా జూన్ 22న గోల్కొండలో తొలి బోనాలు నిర్వహిస్తారు. 

➠ నీటిబండిపై వచ్చే వరుణదేవా! నీ రథాన్ని భూమిపైకి పంపు అని వేదం కోరుకుంది. శ్రీకృష్ణదేవరాయలు ఏరువాక పున్నమినాడు రైతులను సత్కరించేవాడని చరిత్ర చెబుతోంది. ఏడాది పొడవునా దేశప్రజలందరూ తినే బువ్వను పండించడానికి రైతన్న చేసే తొలి ప్రయత్నమే ఏరువాక.

➠ జూన్ 21 అంతర్జాతీయ యోగదినోత్సవం సందర్భంగా అన్ని వయసులవారూ సులభంగా వేయగలిగే 44 యోగాసనాలను అందిస్తున్నాం. ఆసనాలు వేసే విధానాలను గురించి ముందుగా చదివి తెలుసుకోండి. ప్రతి ఆసనం వల్ల ఆరోగ్య ప్రయోజనాలున్నట్లే... నిషేధాలూ ఉన్నాయి. గమనించగలరు.

➠ ఆషాఢమాసంలో శుక్లపక్ష ఏకాదశి తిథినాడు నారాయణుడు క్షీరసాగరంలో శేషతల్పం మీద నాలుగు నెలలపాటు కొనసాగే యోగనిద్రకు ఉపక్రమిస్తాడు. కనుక ఆ ఏకాదశిని శయనైకాదశి లేదా తొలి ఏకాదశి అంటారు. తొలి ఏకాదశినాడు విష్ణుమూర్తిని పూజించి స్వప్నమహోత్సవం జరిపితే మహాపాపాలు సైతం చిటికెలో తొలగిపోతాయి. యజ్ఞాలు చేసిన పుణ్యం లభిస్తుంది. 

➠ పూరీ జగన్నాథ రథోత్సవం ప్రపంచ ప్రసిద్ధి పొందింది. వేలాదిమంది భక్తులు పాల్గొనే ఈ రథయాత్రలో జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర వేర్వేరు రథాలలో ఊరేగుతారు. భార్యా సమేతుడైన దైవాన్ని కాకుండా తోబుట్టువులతో కలిసి వున్న స్వామిని అర్చించడం జగన్నాథ క్షేత్రంలోనే కనిపిస్తుంది. జగన్నాథ రథయాత్రలో పాటించే సంప్రదాయాల్లో అనేక ఆసక్తికర విశేషాలున్నాయి.

Recent Comments