వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం
వందే పన్నగభూషణం శశిధరం వందే పశూనాం పతిమ్
వందే సూర్య శశాంక వహ్నినయనం వందే ముకుందప్రియం
వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరమ్

శివుడు ఆదిదేవుడు. సర్వజీవులకూ ఆరాధ్యుడు. ఆడంబరాలు, ఆర్భాటాలూ లేని సామాన్యుల దేవర. కాసిన్ని నీళ్లు, ఒక్క మారేడుదళం తప్ప భక్తుల నుంచి మరేమీ ఆశించనివాడు. చేసిన కొద్దిపాటి పూజకే గొప్పగా పొంగిపోయి వరాలు కురిపించే బోళాశంకరుడు. ఆయనను భక్తులందరూ సేవించుకునే మహాశివరాత్రి పర్వదినం ఈనెల 11వ తేదీన వస్తోంది. ప్రసిద్ధ శివాలయాలే కాకుండా మారుమూల గుళ్లలో కూడా శివరాత్రివేళ అభిషేకాలు, విశేష పూజలు జరుగుతాయి. రంగురంగుల ప్రభలు కట్టుకుని, బాజాబజంత్రీలతో భక్తులు శివాలయాలను సందర్శిస్తారు. శివరాత్రి దీక్షలను భక్తిశ్రద్ధలతో పాటించి తరిస్తారు. నడిరాత్రిలో లింగోద్భవ ముహూర్తాన్ని ఆనందోత్సాహాలతో అనుభవించి పరవశిస్తారు. శ్రీశైల మల్లన్న, శ్రీకాళహస్తీశ్వరుడు బ్రహ్మోత్సవ వార్షిక కల్యాణాలను జరిపించుకుంటారు. శివరాత్రి వేలుపు మనల్నందరినీ కాపాడాలని వేడుకుందాం. శివరాత్రి తరువాత మాఘమాసం పూర్తవుతూనే నృసింహ కల్యాణాల మాసమైన ఫాల్గుణమాసం (మార్చి 14 - ఏప్రిల్ 12) ప్రవేశిస్తుంది. ఇక వసంతానికి స్వాగతం పలుకుతూ, ఆటపాటలతో పెద్దలు, పిన్నలందరూ వినోదించే హోళీ పౌర్ణమి ఈనెల 28న రానున్నది. కరోనా నేపథ్యంలో ఉత్సవాలలో పాల్గొనేటప్పుడు తగు జాగ్రత్తలు పాటిద్దాం. ఆధ్యాత్మికతను, ఆరోగ్యాన్ని సమతూకంగా నిర్వహించుకుందాం.

➠ మూలమ్నాయ శంకరపీఠం కంచి. ఎందరెందరో జగద్గురువులు ఆ పీఠంపై నిలిచి జాతికి ధర్మమార్గ నిర్దేశం చేస్తూ వస్తున్నారు. ప్రస్తుత పీఠాధిపతి అయిన శ్రీశంకర విజయేంద్ర సరస్వతీ స్వామి విశిష్ట ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలతో పీఠప్రతిష్ఠను ఇనుమడింప చేస్తున్నారు. ఆయన జన్మదినం ఈనెల 9వ తేదీన, కంచి పూర్వపీఠాధిపతి శ్రీజయేంద్ర సరస్వతీ స్వామి ఆరాధన 26వ తేదీన వస్తోంది. ఈ సందర్భంగా ఆ విశిష్ట గురుపరంపరకు భక్తిపత్రిక ప్రణతులర్పిస్తోంది.

➠ శ్రీలక్ష్మీనరసింహస్వామి కొలువైన యాదాద్రి కొత్త శోభను సంతరించుకుంది. ప్రపంచస్థాయి ఆధ్యాత్మిక క్షేత్రంగా రూపుదిద్దుకుంటోంది. పూర్తిగా కృష్ణశిలతో సంప్రదాయరీతిలో యాదాద్రిని పునర్నిర్మిస్తున్నారు. అయిదేళ్లనుంచి జరుగుతున్న ఈ నిర్మాణ పనులు ఇప్పుడు పూర్తి కావచ్చాయి. మరోపక్క ఫిబ్రవరి 16 నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. 23వ తేదీన స్వామి కల్యాణం జరగనుంది. ఈ నేపథ్యంలో యాదాద్రి ఆలయ విశేషాలు.

➠ త్రిమూర్తులకు సమాన ప్రాధాన్యం ఇస్తూ త్రికూటాలయాలు నిర్మించడం ప్రాచీన సంప్రదాయం. తొలినాళ్లలో ముగ్గురినీ లింగరూపంలోనే అర్చించేవారు. ఆధునికకాలంలో అవి శివాలయాలుగానే స్థిరపడ్డాయి. బ్రహ్మ,విష్ణు, రుద్రగిరులతో
అలరారే కోటప్పకొండకు త్రికూటాచలమని పేరు. దక్షిణామూర్తి స్వరూపుడైన శివుడు ఇక్కడ స్వయంభువు. 

➠ కోడెమొక్కుల రాజన్న తెలంగాణ ప్రజలు ఎములాడ రాజన్నగా పిలుచుకుంటారు. రాజరాజేశ్వర స్వామిగా పురాణ ప్రసిద్ధిగాంచిన శివుడు వేములవాడలో నెలకొన్నాడు. తెలంగాణలోని సుప్రసిద్ధ శైవక్షేత్రమైన వేములవాడలో మహాశివరాత్రికి జాతర
జరుగుతుంది. ఈనెల 31న స్వామి కల్యాణం నిర్వహిస్తారు.

➠ స్వర్ణముఖి నదీతీరాన ఉన్న సుప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీకాళహస్తి. మూగజీవాలకు సైతం పరమేశ్వరుడు మోక్షపదవిని అనుగ్రహించిన మహాపుణ్యస్థలి. పంచభూతాలలో ఒకటైన వాయులింగేశ్వరుడు కొలువుదీరిన సద్యోముక్తి క్షేత్రం ఈ దక్షిణ కైలాసం. మహాశివరాత్రి సందర్భంగా శ్రీకాళహస్తిలో మార్చి 6 నుంచి 19వ తేదీ వరకూ బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు.

➠ పరమేశ్వరుడు నిరాకారంగా లింగరూపుడు. సాకారంగా బహురూపుడు. శివనామానికి ‘విశ్వమంతటికీ ఆధారమై ఉన్నవాడు’ అని అర్థం. ఆయన అసలు తత్త్వం... శాంతం, శుద్ధం, శుభం, క్షేమం. అటువంటి పరమేశ్వరుడి అనుగ్రహంతో జీవితాన్ని శివమయం చేసుకొనే అవకాశమే మహాశివరాత్రి ఆచరణ!

Recent Comments