వసంత వేళ సమీపించింది. శోభకృత్ నామ సంవత్సరం శోభాయమానంగా ప్రారంభం కానుంది. లేతచిగుళ్ల మాటున కోయిల పాటలు వినిపిస్తాయి. మన గడపలకు మామిడి తోరణాలు వెలుస్తాయి. ఉగాది పండుగపూట (మార్చి 22) ఉదయాన్నే తలస్నానం చేసి, షడ్రుచుల ప్రసాదం స్వీకరిస్తాం. పంచాంగానికి దండం పెట్టి దేశకాలమాన పరిస్థితులు, వ్యక్తిగత రాశి, కందాయ ఫలాలు ఎలా ఉంటాయో తెలుసుకోవడానికి శ్రద్ధగా పంచాంగ శ్రవణం చేస్తాం. ఉగాది పండుగనాడే వసంత నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమై చలవ పందిళ్లు వెలుస్తాయి.

కొత్త ఏడాదిలో తొలి పండుగ అయిన శ్రీరామనవమికి (మార్చి 30) నిర్వహించబోయే సీతారామ కల్యాణానికి సన్నాహాలు ప్రారంభమవుతాయి. శ్రీరాఘవం దశరథాత్మజ మప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహుం అరవింద దళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి సీతమ్మ మాయమ్మ, శ్రీరాముడు మా తండ్రి అని తెలుగువారంతా భక్తితో నిత్యం పాడుకుంటూ ఉంటారు. మనిషిగా పుట్టి, చక్రవర్తి కుమారునిగా పెరిగి, మనలాగే అనేక కష్టసుఖాలు రుచి చూసినవాడు రాముడు. సాక్షాత్తూ ధర్మమే రామునిగా పోతపోసుంది. యుగాలుగా రాముడు మానవజాతికి ఆదర్శదైవంగా నిలిచాడు. రామకల్యాణవేళ ప్రతి లోగిలీ కల్యాణ మంటపం అవుతుంది. భద్రాచలంతో పాటుగా ప్రసిద్ధ శ్రీరామ క్షేత్రాల్లో జరిగే సీతారాముల పెళ్లిని కనీవినీ ఆనందిద్దాం. వసంతోదయ మంగళవేళ సీతారాముల పెళ్లి తలంబ్రాలు మనందరికీ దీవెనలు కురిపించాలని ఆశిద్దాం. ఈ మాసంలోనే ఎందరెందరో దేవీ దేవతలు కల్యాణాలు జరిపించుకోబోతున్నారు. ఆ కల్యాణమూర్తులు మనకు సమస్త సన్మంగళాలు కలిగించాలని ఆశిద్దాం. తెలుగు నూతన సంవత్సరంలో మీ అందరికీ ఆయురారోగ్యాలు చేకూర్చాలని దేవదేవుని ప్రార్థిస్తున్నాను.

➠ ఫాల్గుణమాసంలో దాదాపు అన్ని నృసింహ క్షేత్రాల్లోనూ ఈ మాసంలో వార్షిక కల్యాణోత్సవ సహితంగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. యాదాద్రి లక్ష్మీ నృసింహ స్వామికి, అహోబిలం నృసింహస్వామికి కూడా ఫిబ్రవరి నెలలో బ్రహ్మోత్సవాలు ప్రారంభమై మార్చిలో కూడా కొనసాగుతున్నాయి. కోరుకొండ, ధర్మపురి వంటి ఇతర క్షేత్రాల్లో ఈ మాసంలోనే వివిధ తేదీల్లో కల్యాణోత్సవాలు ఉంటాయి.

➠ భారతీయ సంస్కృతి ఒక రంగుల హరివిల్లు. కాలానికి అనుగుణంగా మనలో ఆనందాలు నింపే పండుగలతో శోభిస్తుంది. వసంత రుతువు ప్రారంభంలో వచ్చే హోళీ అయితే చెప్పనే అక్కరలేదు. వయోభేదాలు మరిచి అందరూ వసంతాలాడి మైమరిచే రంగుల పండుగ హోళీ. ఆనందహేల అయిన హోళీ వెనుక సంప్రదాయ విశేషాలెన్నో ఉన్నాయి. 

➠ భద్రగిరి రామయ్యకు జరిగే ఉత్సవాలలో మకుటాయమైనవి రెండు. శ్రీరామనవమి నాడు జరిగే కల్యాణం, ఆ మరునాటి పట్టాభిషేకం. శ్రీరామకల్యాణ సేవ జీవితంలో శుభపరంపరలు ప్రసాదిస్తుంది. శ్రీరామపట్టాభిషేకం విజయాలను అందిస్తుంది.

➠ కడపకు సమీపంలోని ఒంటిమిట్ట కోదండ రామస్వామి దేవస్థానం అతి ప్రాచీనమైనది. ఏటా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ స్వామి కల్యాణానికి పట్టువస్త్రాలను సమర్పిస్తుంది. ఈ క్షేత్రంలో శ్రీరామనవమి నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. ఇతర క్షేత్రాలలో వలె శ్రీరామనవమినాడు కాకుండా చైత్ర పౌర్ణమికి ముందురోజు రాత్రిపూట కల్యాణం నిర్వహిస్తారు.

➠ ఆదిశంకరులు స్థాపించిన శృంగేరీ పీఠం జగద్గురు స్థానం. ఆదినుంచి ఆ పీఠాన్ని అధిరోహించిన ఆచార్యులందరూ ధర్మసంరక్షణ కోసమే పాటుపడుతూ, భారతావనికి మార్గనిర్దేశం చేస్తున్నారు. ప్రస్తుత శృంగేరీ పీఠాధిపతి శ్రీభారతీ తీర్థస్వామి మహాదార్శనికులు, పుంభావ శారద. ఈ తెలుగు నూతన సంవత్సరం ఆరంభంలో వారి అమృతవాక్కులను ఆలకించడం సకల శుభాలనూ కలిగిస్తుంది. 

➠ ఉగాదితో తెలుగువారి కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. ఆనాడు ఆరు రుచుల సమ్మేళనంగా ఉగాది పచ్చడిని సేవిస్తారు. జీవితంలో అన్నిరుచులనూ సమానంగా స్వీకరించాలనే సందేశాన్నిస్తారు. పంచాంగ శ్రవణం చేసి, పెద్దలకు నమస్కరిస్తారు.

Recent Comments