మన పవిత్ర మాసాల్లో వైశాఖం ముఖ్యమైనది. అక్షయ తృతీయతో వైశాఖ ప్రాశస్త్యం ప్రారంభమవుతుంది. మహాలక్ష్మికి ఇష్టమైన పర్వదినం అక్షయ తృతీయ (మే 3). ఆనాడు చేసిన దానం, వ్రతం ఏదైనా అనంత పుణ్యబలాన్ని సంపాదించి పెడుతుంది. ఈ అక్షయ తృతీయనాడే సింహాచలం అప్పన్నస్వామి నిజరూప దర్శనభాగ్యం లభిస్తుంది. ఏడాది పొడవునా స్వామికి పూసి ఉంచే చందనాన్ని తొలగిస్తారు. మళ్లీ మూడు విడతలుగా చందనసేవను సమర్పిస్తారు. అక్షయ తృతీయ నుంచే చార్ ధామ్ యాత్రలు ప్రారంభమవుతాయి. మంచుకొండల్లో శీతాకాలమంతా మూసి ఉంచే గంగోత్రి, యమునోత్రి, బదరీనాథ్, కేదారనాథ్ ఆలయాలను అక్షయ తృతీయ నుంచి తెరిచి ఉంచుతారు. ఇక వైశాఖమాసంలోనే నృసింహ జయంతి (మే 14), హనుమజ్జయంతి (మే 25) పర్వదినాలు వస్తాయి. కోరిన వెంటనే భక్తుల కోర్కెలను నెరవేర్చే దైవం నృసింహుడు. కాగా రుద్రాంశ సంభూతుడైన హనుమంతుడు నిష్ఠకు, సేవాపరాయణత్వానికి ప్రతీక. 

యోగాన్ని కోరుకునేవారికి భోగం ఉండదు. భోగంలో పడితే యోగం కుదరదు. కానీ హనుమంతుని సేవిస్తే యోగభోగాలు రెండూ కరతలామలకం అవుతాయి. మోక్షం కోరితే తన ప్రభువైన శ్రీరామచంద్రుని వద్దకు చేయిపట్టి తీసుకువెళ్లేది హనుమంతుడేనని పెద్దలు చెబుతారు. అటుపైన వైశాఖంలోనే పురాణ కాలంలో పరశురామునితో ప్రారంభించి... మన ఆధ్యాత్మిక, సాంస్కృతిక జీవనాన్ని ప్రభావితం చేసిన మహనీయులెందరో జన్మించారు. అద్వైతాన్ని బోధించిన ఆదిశంకరులు, విశిష్టాద్వైత ప్రవక్త రామానుజులు, శైవుడే శివుడన్న బసవేశ్వరుడు, అహింసా మార్గాన్ని ప్రవచించిన గౌతమ బుద్ధుడు, విశిష్ట తత్త్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి, స్వామి చిన్మయానంద వంటి వారెందరో ఈ మాసంలోనే జన్మించారు. ఆధునిక గురువులలో శ్రీగణపతి సచ్చిదానంద స్వామీజీ, శ్రీశ్రీరవిశంకర్ గురూజీల జన్మదినాలు కూడా ఈ మాసంలోనే వస్తున్నాయి. ఆడంబరాలకు పోవడం కంటే అంతరంగంలో భక్తిప్రపత్తులు కలిగి ఉంటే మేలు. ఇతరులకు సాయపడడమే అసలైన దైవపూజ అని వైశాఖమాసం మనకు సందేశమిస్తోంది.

➠ అక్షయ తృతీయ నాడు దేవతలను, పితృదేవతలను ఆరాధించాలి. గోదానం, భూదానం, సువర్ణదానం, వస్త్రదానం వంటివి చేయాలి. అన్నింటికంటే పూర్ణజల కుంభ దానం... నీటితో నింపిన పాత్రను దానం చేయాలని స్పష్టంగా పురాణాలు పేర్కొంటున్నాయి. అక్షయ తృతీయ రోజున చేసే జప, హోమ, దానాదులన్నీ అక్షయమవుతాయి కనుకనే ఇది అక్షయతృతీయ అయింది. ఈ పర్వదినం గురించి అందరూ గుర్తుంచుకోవలసిన అంశం ఇదే. 

➠ నిత్యకల్యాణ వైభవ సంపన్నుడు శ్రీనివాసుడు. ద్వారకా తిరుమలలో ఏటా రెండుసార్లు తిరు కల్యాణ మహోత్సవాలు అదనంగా జరిపించుకుంటాడు. ఆ వేంకటేశుని వైశాఖ తిరు కల్యాణోత్సవాల సందర్భంగా వివిధ అలంకారాలతో, వాహన సేవలతో ద్వారకా తిరుమల క్షేత్రం ఇలవైకుంఠంగా మారుతుంది.

➠ నమ్మినవారికి కొంగుబంగారమైన దైవం సత్యనారాయణ స్వామి. అనంత లక్ష్మీ సమేతుడైన ఆ స్వామి భక్తుల మనస్సంకల్పాలు నెరవేరుస్తుంటాడు. ఆంధ్రరాష్ట్రాన్ని నైమిశారణ్యంగా చేస్తూ అన్నవరం దివ్యక్షేత్రంలో రత్నగిరిపై వెలిసిన దైవం సత్యనారాయణ స్వామి. ప్రతి సంవత్సరం అన్నవరం సత్యనారాయణ స్వామికి వైశాఖమాసంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా వార్షిక కల్యాణోత్సవం నిర్వహిస్తారు.

➠ వైశాఖ బహుళ దశమి నాడు హనుమజ్జయంతి. దీనిని తెలుగువారంతా వైభవంగా నిర్వహిస్తారు. సుందరకాండ, హనుమాన్ చాలీసా పారాయణలు నిర్వహిస్తారు. స్వామికి సిందూర లేపనాలు, తమలపాకులతో పూజలు, వడమాల సమర్పణలు ప్రత్యేకంగా చేస్తారు. హనుమంతుని గుణగానం చేసినవారిలో భక్తిశ్రద్ధలు, ఆత్మవిశ్వాసం మెరుగవుతాయి.

➠ దుష్టసంహారం కోసం సద్యోమూర్తిగా ఆవిర్భవించినవాడు నృసింహుడు. శ్రీహరి ధరించిన అవతారాలన్నీ అమోఘాలు, అనిర్వచనీయాలే. ఒక్కో అవతారం ఒక్కో ప్రత్యేకతను కలిగిఉంది. నృసింహావతారంలో శిరస్సు సింహంగా, మిగిలిన దేహమంతా మానవునిగా ఉంటుంది. ఈస్వామిని సేవిస్తే శీఘ్రంగా కరుణిస్తాడని ప్రతీతి.

➠ శంకరుడంటే కారణజన్ముడు. జగద్గురువు. వివిధ దేవీదేవతలపై స్తోత్రాలు రచించారు కాబట్టి కేవలం కవి కాదు. వేదాంతానికి చెందిన ప్రకరణ భాష్యాలను ప్రవచించారు కాబట్టి పండితుడు, వైరాగ్య పూర్ణుడైన తత్వవేత్త మాత్రమే కాదు. ధర్మస్థాపకుడు. ఆసేతుశీతాచలం ఆర్యావర్తమంతా గెలిచి అద్వైతాన్ని సుస్థిరం చేసినవాడు. భారతీయుల తత్త్వదర్శనాన్ని శిఖరాగ్ర స్థాయికి తీసుకువెళ్లిన ఘనుడు.

Recent Comments