వైశాఖమాసం (మే 9 - జూన్ 6) తెలుగునెలల్లో రెండోది. వసంతశోభ వెల్లివిరిసే సమయమిది. ఇదే తరుణంలో ఎండలు ముదురుతుంటాయి. అందుకే వైశాఖం పచ్చిందంటే మనవారు కూడళ్లలో చలివేంద్రాలు ఏర్పాటు చేస్తుంటారు. మండువేసవిలో మంచినీళ్లు దానం చేయడం. కంటే గొప్పది లేదంటారు. మనం చేసుకునే పుణ్యకార్యక్రమాలకు లక్ష్మీదేవి స్వయంగా అక్షయ ఫలాలను అనుగ్రహించే మహత్తర పర్వదినం అక్షయ తృతీయ (మే10). ఆరోజు మహాలక్ష్మీపూజ నిర్వహిస్తారు. పొదుపుకి, మదుపుకి అనుకూలంగా ఆనాడు కొద్దిగానైనా బంగారాన్ని కొనుక్కోమని పెద్దలు చెబుతుంటారు. ఆరోజునే సింహాచలం లక్ష్మీనరసింహ స్వామికి చందనోత్సవం నిర్వహిస్తారు. ఏడాది పొడవునా చందనపు పూతలోనే దర్శనమిచ్చే ఆ స్వామి నిజరూపాన్ని చూడగలిగే ఒకే ఒక్కరోజు అక్షయ తృతీయ. నదీమ తల్లులను సేవించుకునే పుష్కర పుణ్యకాలం మే 1 నుంచే ప్రారంభం అవుతోంది. నర్మదా పుష్కరాల సందర్భంగా తీర్థక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడతాయి. బదరీ నారాయణుడు, కేదారనాథుడు తమ దర్శనాలను అనుగ్రహించే శుభతరుణం కూడా ఇదే. పరశురాముడు, ఆదిశంకరుడు మొదలు ఎందరెందరో విశ్వగురువులు తెలుగు నెలల ప్రకారం వైశాఖంలోనూ.

ఇంగ్లీషు నెలల ప్రకారం మే మాసంలోనే పుట్టడం యాదృచ్ఛికం. గౌతమబుద్ధుడు, రామానుజులు, వీరబ్రహ్మేంద్రస్వామి, బసవేశ్వరుడు వంటి గురువులు ఈమాసంలోనే పుట్టారు. దైవాలు సైతం ఈమాసంలోనే పుట్టారు. శుక్లపక్షం చివరిలో నృసింహ జయంతి (మే 22) నాడు, బహుళపక్షంలో హనుమజ్జయంతి (జూన్ 1) నాడు వస్తాయి. నృసింహజయంతి సందర్భంగా ఆలయాలన్నింటిలో ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. వైశాఖానికి మాధవమాసమని పేరున్న కారణంగా అనేక వైష్ణవాలయాల్లో కల్యాణాలు, బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తుంటారు. అన్నవరం సత్యనారాయణ స్వామి కల్యాణం కూడా (మే 19) ఈ మాసంలోనే జరగనుంది. అదే కాకుండా తెలుగునాట అనేక జాతరలు కూడా జరగబోతున్నాయి. ఆ దేవీ దేవతలందరూ మనందరినీ చల్లగా చూడాలని, అందరికీ క్షేమం కలగాలని కోరుకుందాం.

➠ నిత్యకల్యాణ వైభవ సంపన్నుడు శ్రీనివాసుడు. ద్వారకా తిరుమలలో ఏటా రెండుసార్లు తిరు కల్యాణ మహోత్సవాలు అదనంగా జరిపించుకుంటాడు. ఆ వేంకటేశుని వైశాఖ తిరు కల్యాణోత్సవాల సందర్భంగా వివిధ అలంకారాలతో, వాహన సేవలతో ద్వారకా తిరుమల క్షేత్రం ఇల వైకుంఠంగా మారుతుంది.

➠ దేవగురువైన బృహస్పతి వృషభరాశిలో ప్రవేశించిన సమయంలో నర్మదానదికి పుష్కరాలు జరుగుతాయి. పుష్కరాల సమయంలో నదీస్నానం, పితృతర్పణం, తీర్థవిధులు, దానాదులు నిర్వర్తించడం మేలని శాస్త్రం చెబుతోంది.

➠ తిరుచానూరు పద్మావతీదేవిని దర్శించకుండా తిరుమల యాత్ర పరిపూర్ణం కాదు. పద్మసరస్సులో పుట్టి ఆకాశరాజు కూతురుగా శ్రీనివాసుని చేపట్టిన అలమేలు మంగ సాక్షాత్తూ మహాలక్ష్మియే. పద్మావతీ శ్రీనివాసుల వార్షిక కల్యాణం వైశాఖమాసంలో నిర్వహిస్తారు.

➠ భక్తుడు కోరుకున్న వెంటనే అవతరించిన వాడు నరసింహుడు. ఆ స్వామిలో ప్రత్యేకత కూడా అదే. ఆయనను మనం దర్శించిన వెంటనే, ప్రార్థించిన వెంటనే మన కోరికను నెరవేరుస్తాడు. ఫాల్గుణంలో స్వామి కల్యాణాలు సాధారణంగా జరుగుతుంటాయి. వైశాఖంలో శుద్ధ చతుర్దశి నాడు నృసింహ జయంతి.

➠ అక్షయ తృతీయ నాడు దేవతలను, పితృదేవతలను ఆరాధించాలి. గోదానం, భూదానం, సువర్ణదానం, వస్త్రదానం వంటివి చేయాలి. అన్నింటికంటే పూర్ణజలంతో నిండిన కుండను లేదా పాత్రను దానం చేయాలని స్పష్టంగా పురాణాలు పేర్కొంటున్నాయి.

➠ సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామికి జరిగే ఉత్సవాల్లో చందనోత్సవం ప్రధానమైనది. స్వామి వారు సంవత్సరంలో ఒక్కరోజు మాత్రం వైశాఖ శుద్ధ తదియ నాడు నిజరూపంలో దర్శనమిస్తారు. ఆరోజు అక్షయ తృతీయ. అక్షయ తృతీయకు ముందు రోజు రాత్రి (మే 9) స్వామివారి దేహం నుంచి చందనాన్ని పూర్తిగా తొలగిస్తారు.

Recent Comments