"దీపం జ్యోతిః పరంబ్రహ్మ దీపం సర్వ తమోపహం
 దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీప నమోస్తుతే"

చిరుదీపం వెలిగిస్తే చిమ్మచీకట్లు తలవంచుకుని తొలగిపోతాయి. వేనవేల దీపకాంతులతో అమావాస్య చీకట్లను పోగొట్టే దివ్యదీపావళి నవంబర్ 4న మనలో ఆనందోత్సాహాలను నింపనుంది. ఒకనాటి నరకాసురునిపై విజయంలా కరోనా మహమ్మారిపై విజయ సాధన లక్ష్యాన్ని ఈ దీపావళి మనకు అందిస్తోంది. దీపావళినాడే శ్రీచినజీయర్ స్వామి తిరునక్షత్రం కూడా రానుంది. ఆ మహా స్వామి తలపెట్టిన రామానుజాచార్య సమతా స్ఫూర్తి కేంద్రం ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్న తరుణంలో వారి ఆశీస్సులను, మంగళాశాసనాలను అందుకుందాం. దీపావళి పూర్తికాగానే మన లోగిళ్లన్నీ ఉభయ సంధ్యలలోనూ దీపకాంతులతో శోభిస్తూ ఉంటాయి. పవిత్ర కార్తికమాసం ప్రవేశిస్తుంది. మహాదేవునికి అభిషేకలు బిల్వార్చనలు నిర్వహిస్తుంటారు. దీపోత్సవాలు దామోదర కల్యాణాలు, వనభోజనాలతో కార్తికం అంతటా పవిత్ర వాతావరణం నెలకొంటుంది. చలిపంజా దెబ్బకు ఆరోగ్యం దెబ్బతినకుండా ఉండేందుకు ఎటువంటి కట్టడి, ఆహార నియమం అవసరమో అదంతా కార్తికం మనకు నేర్పిస్తుంది.

తెలుగువారికి కార్తికం రాగానే భక్తిటీవీ కోటిదీపోత్సవం గుర్తుకు వస్తుంది. మహాదేవుని దయ, మహనీయుల దివ్యాశీస్సుల బలం వల్ల మేం సంకల్పించిన నాటినుంచి ఇప్పటిదాకా కోటిదీపోత్సవం దిగ్విజయంగా సాగుతూ వస్తోంది. కరోనా కష్టకాలంలో కూడా కిందటి ఏడాది దీపోత్సవ సంప్రదాయాన్ని విడిచిపెట్టకుండా కొనసాగించాం. అయితే ఈసారి ప్రజాసమక్షంలో హైదరాబాద్ లోని ఎన్టీఆర్ స్టేడియం వేదికగా భక్తి టీవీ కోటిదీపోత్సవాన్ని నిర్వహించాలని సంకల్పించాం. కరోనా నిబంధనలను తుచ తప్పకుండా పాటిస్తూ క్రమశిక్షణతో సహకరిస్తామని భక్తులు ఇచ్చిన భరోసాతో ముందుకు సాగుతున్నాం. నవంబర్ 12 నుంచి 22 వరకు భక్తిటీవీ కోటిదీపోత్సవం ఎన్టీఆర్ స్టేడియం వేదికగా జరగనుంది. ఈ మహోత్సవంలో మీరు మీరు కూడా పాలుపంచుకుని, మహాదేవుని అనుగ్రహానికి పాత్రులుకండి.

➠ నాగులచవితికి నాగన్న... స్నానం సంధ్యలు నాగన్న... పువ్వులు పడగలు నాగన్న... మడిబట్టలతో నాగన్న... అంటూ తెలుగువారు నాగుల చవితి పండుగను నియమ నిష్ఠలతో ఆచరిస్తారు. పుట్టలో పాలుపోసి ఉపవాసవ్రతాలు ఆచరిస్తారు. నాగులచవితి పర్వం వెనుక అంతరార్ధం, సంప్రదాయ విశిష్ఠతలు...

➠ మన ప్రాచీన పుణ్యనదుల్లోసింధునది ఒకటి. మన ప్రాచీనతను, అలనాటి వైభవాన్ని నిరూపించే పురావస్తు ఆధారాలు సింధులోయలోనే ఇప్పటికీ ఎక్కువగా లభ్యమవుతున్నాయి. అటువంటి సింధునదికి ఇది పుష్కరాల సమయం. దేవగురువైన బృహస్పతి కుంభరాశిలో ప్రవేశించిన తొలి పన్నెండు రోజులనూ సింధునదికి పుష్కరతిథులుగా భావిస్తారు. నవంబర్ 20వ తేదీ నుంచి డిసెంబర్ 1 వరకూ సింధు పుష్కరాలు జరగనున్నాయి.

➠ శ్రీసత్యనారాయణ స్వామి తెలుగువారి ఇలవేలుపు. పెళ్లిళ్లు, గృహ ప్రవేశాల వంటి శుభకార్యాల సందర్భంగా సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తారు. సకల అభీష్టాలు సిద్ధించడానికి సత్యదేవ వ్రతం సర్వోత్తమమైనదని భక్తుల నమ్మకం. కార్తిక పౌర్ణమికి అన్నవరంలో సత్యనారాయణ స్వామి వెలసిన రత్నగిరికి భక్తులు ప్రదక్షిణ చేస్తుంటారు.

➠ సృష్టిలో తొలిదీపం భగవంతుడే! ఆయన జ్యోతి స్వరూపుడు. అందుకే ఏ దేవుని, దేవత నామావళిని మనం గమనించినా పరం జ్యోతి, జ్యోతిసే నమః అని పరంజ్యోతియే నమః, జ్యోతిస్వరూపాయై నమః అని ఉంటుంది. తాను ప్రకాశిస్తూ అన్నింటినీ ప్రకాశింప చేసే రూపం ఏదో అదే జ్యోతి. అదే భగవంతుడు. వెలుగులకు వెలుగు, సమస్త లోకాలను కాంతిమయం చేయగలిగిన వాడు పరమాత్ముడే. 

➠ కార్తికమాసం దేవతలందరిదీ. ముఖ్యంగా శివకేశవులిద్దరినీ ఈ మాసంలో పూజిస్తారు. కార్తికమాసం దేవతలదే కాదు మానవులది. ఏ కొందరో కాదు... పెద్దలదీ, పిన్నలదీ అందరిదీ. స్నాన, భోజన నియమాలు పెద్దలకు ఆరోగ్యాన్ని, పిల్లలకు పండుగ వాతావారణాన్ని తెచ్చిపెడతాయి. కార్తిక శరత్తు ఈ నేలపై ఉన్న జీవులందరికీ సమానమైనదే.

➠ దీపావళి అంటే దీపాల వరస అని అర్థం. చీకటిని పారదోలి వెలుగునిచ్చే ఆయుధం దీపమే. దీపావళిని కొన్ని ప్రాంతాల్లో దివ్వెల పండగ అని, మరికొన్ని ప్రాంతాల్లో దివిటీల పండగ అని పిలుస్తారు. నరకాసుర వధతో ముడిపడిన దీపావళి కథ ద్వాపరయుగానికి చెందినది. దానికంటే ముందునుంచి వేదకాలంలోనే రుషులు కొరవులు వెలిగించి దీపావళి పండుగ నిర్వహించేవారు. చారిత్రకకాలం నుంచి దీపావళిని ఉత్సాహంగా పిల్లాపెద్ద అందరూ నిర్వహించుకుంటున్నారు. దీపాలు వెలిగించి, టపాసులు కాల్చి ఆనందంగా జరుపుకునే జాతీయ పండుగల్లో దీపావళికి ప్రత్యేకస్థానం ఉంది.

Recent Comments