దీపం జ్యోతిః పరంబ్రహ్మ
దీపం సర్వతమోపహం
దీపేన సాధ్యతే సర్వం
సంధ్యాదీప నమోస్తుతే

ఒక దీపమే మరో దీపాన్ని వెలిగించ గలదు. దీపం పక్కనే దీపాన్ని వెలిగిస్తే ఆ దీపాల వరుసకు లోకమంతా వెలుగులమయం అవుతుంది. అమావాస్య చీకట్లను పోగొట్టి జగత్తుకు వెలుగులు పంచే దీపావళి పర్వదినం మరుసటిరోజు నుంచి మనకు కార్తిక దీప సంప్రదాయం మొదలవుతుంది. ఇరు సంధ్యలలోనూ మన లోగిళ్లు, ఆలయాలు దీపతోరణాలై భాసిస్తుంటాయి. దీపం వెలుగుకు, జ్ఞానానికి సంకేతం. ఆధ్యాత్మికంగా దీపానికి చాలా ప్రాముఖ్యం ఉంది. మన సంస్కృతికి, సంప్రదాయానికి దీపారాధన పట్టుగొమ్మగా నిలిచింది. అటువంటి సంప్రదాయాన్ని ముందుతరాల వారికి సమున్నతంగా పరిచయం చేయడమే లక్ష్యంగా 2013 నుంచి భక్తిటీవీ కోటిదీపోత్సవాన్ని నిర్వహిస్తున్నాం.

ఏటా కార్తికమాసంలో దేశంలోని సుప్రసిద్ధ క్షేత్రాలనుంచి దేవతామూర్తులను వేదికపై నెలకొల్పి కల్యాణాలు నిర్వహిస్తున్నాం. ప్రసిద్ధ పండితులు ప్రవచనాలు అందిస్తున్నారు. పీఠాధిపతులు అనుగ్రహ భాషణ పూర్వక ఆశీస్సులు అందచేస్తున్నారు. అతిరథ మహారథుల అతిథులుగా విచ్చేస్తున్నారు. వారందరి సమక్షంలో వేలాదిమంది ప్రజలు వెలిగించిన కోటిదీపాలు వెలుగుతుంటే భక్తకోటి తన్మయమవుతుంది. భక్తిటీవీ కోటిదీపోత్సవంలో పాల్గొనే భక్తులకు పూజాసామగ్రి, దీపారాధన వస్తువులను రచన టెలివిజన్ ప్రై. లిమిటెడ్ పక్షాన పూర్తి ఉచితంగా అందిస్తున్నాం. లాభాపేక్ష లేకుండా... ఇటువంటి కార్యక్రమం ఇదొక్కటే... అన్నరీతిలో అందరి ప్రశంసలూ అందుకుంటూ... ఏటికేడాది సరికొత్త హంగులతో నవనవోన్మేషంగా భక్తి టీవీ కోటిదీపోత్సవాన్ని నిర్వహిస్తున్నాం. 

నవంబర్ 14 నుంచి 27 వరకు హైదరాబాద్ లోని ఎన్టీఆర్ గ్రౌండ్స్ వేదికగా... ఈసారి నిర్వహించబోయే భక్తిటీవీ కోటిదీపోత్సవానికి మీరందరూ సకుటుంబంగా తరలివచ్చి, జయప్రదం చేయాలని కోరుతున్నాం.

➠ భక్తిటీవీకి నేడు దేశంలోనే ఓ విశిష్ట స్థానం ఉంది. కోట్లాది ప్రేక్షకుల ఆశీస్సులతో ధర్మరక్షణ యజ్ఞంలో అప్రతిహతంగా అడుగులేస్తోంది. ప్రతి ఇంటా భక్తిటీవీ మార్మోగుతోంది. దృశ్యవేదమై ప్రతిధ్వనిస్తోంది. భక్తిటీవీ అంటే కేవలం ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రసారం చేసే మాధ్యమం కాదు. సనాతన సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించే వారధి. బుల్లితెరనే కోవెలగా మార్చిన ఆధ్యాత్మిక నిధి.

➠ హైందవ సాంప్రదాయంలో దీపారాధనకు అత్యంత ప్రాధాన్యముంది. దీపం మంగళకరం. సౌభాగ్యప్రదం. దేవతలు అగ్నిముఖంగా త్వరగా ప్రసన్నులవుతారు. శివుడు అగ్నిస్వరూపుడు. అమ్మవారిని సైతం ఆదిశంకరులు జ్యోతిస్వరూపంగా పేర్కొన్నారు. పుణ్యఫలాలతో పాటు, తాత్త్విక వివేచనను కూడా పెంచే దీపారాధన వైభవం వేనోళ్ల కొనియాడదగినది. కార్తికంలో వెలిగించే దీపం సర్వశ్రేయోదాయకం. 

➠ కార్తికమాసంలో ఉదయం, సాయంత్రం దీపం వెలిగిస్తాం. ఇంటిలో, ఆలయంలో, దీపోత్సవాలలో దీపారాధన విశేషంగా చేస్తాం. కార్తికపౌర్ణమి, ద్వాదశి తిథులలో దీపదానం చేస్తాం. ఉసిరికాయపై వెలిగించి ఇచ్చే దీపదానం విశిష్టమైనది. దీపదానం జ్యానవైరాగ్య సిద్ధులను కలుగచేస్తుంది.

➠ శివుడికి అభిషేకమంటే అమితమైన ప్రీతి. అందుకే భక్తిటీవీ కోటిదీపోత్సవంలో కొలువై ఉన్న మహాదేవునికి ప్రతినిత్యం ప్రదోషకాల అభిషేకాలు కొనసాగుతాయి. వివిధ ద్రవ్యాలతో విశేషంగా అర్చనలు జరుగుతుంటాయి. మహాదేవునికి ఒక్కో ద్రవ్యంతో అభిషేకం చేస్తే ఒక్కొక్క ఫలితం సిద్ధిస్తుందని శాస్త్రాలు చెప్పాయి. వాటిని అనుసరించి... అన్ని ద్రవ్యాలతో జరిగే అఖండ అభిషేకాలను పవిత్రకార్తికంలో దర్శించడానికి కోటి దీపోత్సవం చక్కని వేదిక.

➠ దీపారాధన భారతీయ సంస్కృతిలో ప్రధానాంశం. పూజాదికాలు చేసేప్పుడు మొదటిగా జ్యోతిప్రజ్వలనం చేసి నమస్కరిస్తారు. షోడశోపచారాలలో దీపసమర్పణ ముఖ్యం. దీపం వెలిగించే చోట జ్యోతిస్వరూపులూ, కాంతి శరీరులూ అయిన దేవతలు కొలువుంటారు. కార్తికమాసంలో ఇరుసంధ్యలలోనూ ఇంటిలో దీపాలు వెలిగించాలి. దీపోత్సవాలలో పాల్గొని సామూహికంగా దీపారాధన క్రతువును నిర్వహించాలి.

➠ సమస్త దేవతలకూ మహాదేవుని మహిమ తత్త్వ సందేశాలు ఆకాశదీపాలు అందిస్తాయి. ప్రతి గుమ్మంలో కార్తీక దీపం దర్శనమిస్తుంది. ఈ తరుణంలో, కార్తికంలో వెలిగే ప్రతి ప్రమిద మంగళప్రదం. అది వెలుగుతో పాటు ఓంకార పరిమళాన్ని వెదజల్లుతుంది. సుభిక్షం సుందరం సురుచిరం కార్తికదీపం. భక్తిటీవీ కోటిదీపోత్సవంలో కార్తిక దీపాల వైభవమంతా కన్నులకు కడుతుంది. మరుపురాని మధురానుభూతులను మీ సొంతం చేస్తుంది.

Recent Comments