శరత్కాలం ఆసన్నమైంది. నవరాత్రి ఉత్సవాలకు దేవీ ఆలయాలన్నీ సిద్ధమవుతున్నాయి. అమ్మలగన్నయమ్మ రోజుకొక్క అలంకారంతో భక్తులను అనుగ్రహించే సమయమిది. పురాణకాలంలో లోకకంటకుడైన మహిషాసురుని మర్దించి లోకకల్యాణాన్ని కలిగించింది. నేటికాలంలో కనిపించని శత్రువులా విరుచుకుపడుతున్న మహమ్మారులను కూడా తెగటార్చి జగజ్జనని దీనజనులను కాపాడాలని వేడుకుందాం. దసరా రోజుల్లో జనసామాన్యానికి పరిచయమైనవి, అందరూ ఉత్సాహంగా జరుపుకునేవి దుర్గాష్టమి (అక్టోబర్ 13), మహర్నవమి (14), విజయదశమి(15). ఈ దసరా రోజుల్లోనే జీవనపోరాటంలో నిత్యం ఉపయోగపడే పనిముట్లు, యంత్రాలు, వాహనాలు వగైరాలకు ఆయుధపూజ నిర్వహిస్తారు. జమ్మి పత్రాలను పంచి పెద్దల దీవెనలు తీసుకోవడం, పాల పిట్టను చూడడం, బొమ్మల కొలువులు పెట్టడం వంటి ఎన్నో సంప్రదాయాలు దసరాల్లో చోటు చేసుకుంటాయి. నవరాత్రులలో అమ్మవారికి నవాన్న నైవేద్యాలు పెడుతుంటారు. 

మరోపక్క తెలంగాణ బతుకమ్మ ఉత్సవాలు అక్టోబర్ 6 నుంచి 14 వరకు జరుగుతాయి. పూలనే అమ్మవారిగా భావించి, ప్రకృతి ఆరాధన చేస్తారు. బంగారు బతుకమ్మ ఉయ్యాలో... అంటూ తెలంగాణ ఆడపడుచులు తమ కోర్కెలు చెప్పుకుంటూ పాటలు పాడతారు. పితృదేవతా ఆరాధనా పర్వమైన మహాలయ అమావాస్య అక్టోబర్ 6న వస్తోంది. మన జన్మకు కారణమైన పెద్దలనుసంస్మరించుకునే అవకాశం ఈ పర్వ సమయంలో కలుగుతుంది. ఈ నెలలోనే 19వ తేదీన విజయనగరం పైడితల్లి సిరిమానోత్సవం వస్తున్నది. షిరిడీ సాయి సమాధి ఉత్సవం (15), ద్వారకా తిరుమల కల్యాణోత్సవం (19) వంటి విశిష్ట సందర్భాలెన్నో ఈ మాసంలోనే ఉన్నాయి. పండుగలు తెచ్చిపెట్టే ప్రమోదాలన్నీ మనకు చిరకాలం కొనసాగాలని... అందరి ఆరోగ్యం, ఆయుష్షు వర్ధిల్లాని జగన్మాతను వేడుకుందాం.

➠ ఆదిపరాశక్తి లోకకంటకుడైన మహిషాసురుణ్ణి సంహరించిన ప్రదేశం మైసూరు. ఇదే పురాణ కాలంలో మహిషాసురపురం అని, కాలక్రమంలో మైసూరుగా మారిందని చెబుతారు. మహిషాసురుడితో పాటు, చండముండులనే అసురుల్ని సైతం ఇక్కడే సంహరించినందువల్ల అమ్మవారికి చాముండేశ్వరి అనే పేరు వచ్చింది. మరిన్ని విషయాలు మీ భక్తి పత్రికలో..!

➠ అరసవల్లి అనే అచ్చతెలుగు పదం హర్షవల్లినుంచి పుట్టింది. అంటే ఆనందధామం అని అర్ధం. ఆయురారోగ్యాలను, సంతాన, విద్యా లాభాలను కలిగించే అరసవల్లి సూర్యనారాయణుని ఆనందధామంలో ఈనెల 1 నుంచి 3 వరకు మూడు రోజుల పాటు కనిపించే అద్భుత దృశ్యం... కిరణోత్సవం సందర్భంగా....

➠ విజయదశమి పర్వదినాన సాయి పుణ్యతిథిని షిర్డీలో వైభవోపేతంగా నిర్వహిస్తారు. నాలుగురోజుల పాటు ఈ ఉత్సవాలు కొనసాగుతాయి. దేశవిదేశాల నుంచి లక్షలాది భక్తులు షిర్డీని సందర్శిస్తారు. విరోధాలు, విభేదాలు, వైషమ్యాలు లేని సమాజస్థాపనే సాయి ఆకాంక్ష. ఆ సద్గురువు చూపిన బాటలో నడవడమే అసలైన సాయి ఆరాధన.

➠ విజయనగరం సిరిమానోత్సవం అతిపెద్ద వేడుక. రెండున్నర శతాబ్దాలకు పైబడి నిరంతరాయంగా సిరిమానోత్సవం జరుగుతోంది. ఏటికేడాది పైడితల్లిని దర్శించవచ్చే భక్తుల సంఖ్య పెరుగుతోంది. సిరిమాను ఉత్సవంలో అమ్మవారిని దర్శించిన వారికి కోరిన కోర్కెలు తప్పక నెరవేరుతాయని విశ్వాసం.

➠ శృంగేరిలో శరన్నవరాత్ర ఉత్సవాలు చూడడానికి రెండుకళ్లూ చాలవు. శృంగేరి పీఠ అధిష్ఠాత్రి శారదాంబకు విశేష అలంకారాలు చేస్తారు. ఈ ఉత్సవాల నేపధ్యంలో పీఠాధిపతులు దర్బారు నిర్వహించడం విద్యారణ్యుల కాలం (14వ శతాబ్ది) నుంచి సంప్రదాయంగా వస్తోంది. శ్రీభారతీ తీర్థ మహాస్వామితో పాటు ఉత్తరాధికారి శ్రీవిధుశేఖర భారతీ స్వామి దసరా పండుగనాడు విజయనగర రాజలాంఛనాలతో దర్శనమిస్తారు.

➠ బతుకమ్మ అంటే పూల పండుగ. ఆటపాటల పండుగ. పలువర్ణాల పూలసోయగాలు, బృందాలుగా ఆడిపాడే అతివలతో... బతుకమ్మ సంబరాల వేళ ప్రకృతి శోభాయమానమౌతుంది. బతుకమ్మ సంబురాల వేళ తెలంగాణాలోని పల్లె పల్లె పూల అలంకరణలతో, పడతుల ఆటపాటలతో, నిమజ్జనవేళ జనసందోహంతో పరిమళిస్తుంది. పిల్లాజెల్లాతో కలసి బతుకమ్మ వద్ద ఆడిపాడే ప్రతి మహిళా ప్రకృతి ప్రతిబింబంగా శోభిస్తుంది.

Recent Comments