శతమూలా శతాంకురా... అంటూ దేవీసూక్తం వంద సంఖ్యను పూర్ణత్వానికి ప్రతీకగా చెప్పింది. ఓ పత్రిక కావచ్చు... ఓ సంస్థ కావచ్చు... ఓ జీవితం కావచ్చు... వందకు చేరువకావడం ఎంతో ఆనందాన్ని తెచ్చిపెట్టే సందర్భం. గోదారమ్మ పుష్కర పేరంటం సాక్షిగా 2015 జూలై నెలలో ప్రారంభమైన భక్తిపత్రిక ఈ మాసంతో 100వ సంచికగా మీ కరకమలాలను అలంకరించింది. మన సంస్కృతీ సంప్రదాయాల్లోని గొప్పదనం సామాన్యులకు కూడా అర్థం కావాలనే సంకల్పంతో భక్తిపత్రికను ప్రారంభించాం. మా సంకల్పానికి ఎంతోమంది ఆధ్యాత్మిక పండితులు, పండితులు తమ రచనలతో వెన్నుదన్నుగా నిలిచారు. ఎంతో కఠినమైన విషయాలను కూడా సులభశైలిలో అందిస్తున్న భక్తిపత్రికను మొదటి అడుగునుంచే పాఠకులు అక్కున చేర్చుకున్నారు. ఇంటింటా ధర్మజ్యోతిగా, తెలుగువారి ఆధ్యాత్మిక కరదీపికగా మీ అందరి సహాయ సహకారాల వల్లనే భక్తిపత్రిక వెలుగొందుతోంది. 100వ సంచిక సందర్భంగా శుభాకాంక్షలు తెలియచేస్తున్న పాఠకులకు, ప్రకటన కర్తలకు శుభాకాంక్షలు అందచేస్తున్నాం. మునుముందు పత్రికను మరింత అందంగా తీర్చిదిద్దేందుకు.. మీ అందరి సహకారం ఇకముందు కూడా ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాం. 

ఈ విజయానంద సందర్భంలోనే విజయదశమి పర్వదినం కూడా (అక్టోబర్ 23) విచ్చేస్తోంది. సహస్ర పరమాదేవీ శతమూలా శతాంకురా సర్వగ్ం హరతుమే పాపం దూర్వా దుస్స్వప్ననాశినీ అనంతంగా సాగిపోయే ఈ చరాచర సృష్టిని జగన్మాత తానే అన్నింటికీ బీజమై పోషిస్తోంది. కాశ్మీరం నుంచి కన్యాకుమారి దాకా శక్తి స్వరూపిణిని నవరూపాలలో తొమ్మిది రోజులపాటు ఆరాధించి తరిస్తారు. బొమ్మల కొలువులు, పూజలు, ఉత్సవాలు, వ్రతాలతో ఆసేతు హిమాచలం దుర్గమ్మ కోవెలగా భాసిల్లుతుంది. తెలంగాణ ప్రజలు ‘బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు బతుకమ్మ ఉయ్యాలో’ అంటూ జగన్మాతను పూలతో తయారుచేసి పూజిస్తారు. బంగారు బతుకమ్మలు... వాడవాడలా వెలిసే దుర్గమ్మలు మన కోరికలన్నీ నెరవేర్చి, అందరికీ ఆనందాలు పంచిపెట్టాలని కోరుతున్నాం.

➠ అట్లతద్దోయ్ ఆరట్లోయ్! ముద్దపప్పోయ్ మూడట్లోయ్! చిప్పచిప్ప గోళ్లు, సింగరయ్య గోళ్లు! మా తాత గోళ్లు, మందాస రాళ్లు! అంటూ ఆడపిల్లలు ఆడిపాడే పండుగ అట్లతద్ది. పౌరాణికంగా ‘చంద్రోదయ ఉమావ్రతం’ అంటారు. తొలినాడు పరమేశ్వరుణ్ణి పతిగా పొందడానికి పార్వతీదేవీ ఈ నోము నోచిందని చెబుతారు. ఉత్తరాదిన పెద్ద పండుగ అయిన కార్వాచౌత్- తో సమానమైన తెలుగువారి పండుగ అట్లతద్ది.

➠ సాయీ అంటే ఓయీ అంటాడు. నువ్వేదిక్కంటే అక్కున చేర్చుకుంటాడు. వ్యాధులు, బాధలను చెయ్యి పెట్టి తీసేసినట్టు తీసేస్తాడు... అని షిరిడీ సాయి బాబా మీద ఎందరెందరో భక్తులకు అచంచల భక్తి విశ్వాసాలున్నాయి. ఏటా విజయదశమి సందర్భంగా షిరిడీలో సాయి సమాధి మహోత్సవాలు (అక్టోబర్ 5) నిర్వహిస్తారు. లక్షలాది భక్తులు సాయిమందిరాన్ని దర్శించుకుంటారు.

➠ సృష్టిని నడిపించేది... జగతికి గతి గమ్యాలను నిర్దేశించేది జగన్మాత. మానవ జన్మల కర్మల వలయాన్ని క్రమంగా అమలు చేసేది ఆ పరాశక్తియే. ఈ నేలపై ఆమె వెలిసిన ఒక్కో క్షేత్రానికి ఒక్కో ప్రత్యేకత ఉంది. దసరావేళ ఈ శక్తి క్షేత్రాలు భక్తజనంతో అపురూప శోభలతో విరాజిల్లుతుంటాయి. ఈ శుభతరుణాన అమ్మవారి దర్శనం అన్ని శుభాలను కలిగిస్తుంది.

➠ ప్రకృతినే దేవతగా పూజించే పూల పండుగ బతుకమ్మ. ప్రకృతి నుంచి సేకరించిన పూలను తిరిగి ప్రకృతికే సమర్పించడం బతుకమ్మ పండుగ విశిష్టత. విభిన్నమైన పూలతో బతుకమ్మను చేసి, పూజించి తెలంగాణ ఆడపడుచులు ఆనందోత్సాహాలతో సంప్రదాయంగా, వేడుకగా జరుపుకుంటారు. తొమ్మిది రోజుల పాటు తెలంగాణ అంతటా ఒక జాతరగా బతుకమ్మ పండుగ సాగుతుంది.

➠ భాద్రపద మాసంలో వచ్చే అమావాస్యను మహాలయ అమావాస్య అంటారు. భాద్రపద పౌర్ణమి తరువాత కృష్ణ పాడ్యమినుంచి (సెప్టెంబర్ 30) అమావాస్య వరకూ (అక్టోబర్ 14) వరకు ఉన్న రోజుల్ని పితృదేవతలను ఆరాధించే రోజులుగా పరిగణిస్తారు. పక్షంలో ఒకరోజున కానీ, మహాలయ అమావాస్య నాడు కానీ పితృదేవతలకు తప్పనిసరిగా తర్పణలు, పిండప్రదానాలు చేయాలి.   

➠ దసరా పండుగ సమయంలో తిరుమలలో శ్రీవారికి నవరాత్ర బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. పెద్దశేష వాహనంతో మొదలై, చక్రస్నానం వరకు పదిరోజుల పాటు మాడవీధులన్నీ భక్తజన సంద్రాలుగా మరుతాయి. స్వర్ణరథోత్సవం, గరుడవాహనం వంటి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. వేదాలే శిలలైన కొండలపై వెలిసిన వేంకటనాథుని బ్రహ్మోత్సవ వైభవాన్ని వర్ణించడానికి మాటలు చాలవు.

Recent Comments