అగజానన పద్మార్కం గజానన మహర్నిశం |
అనేకదం తం భక్తానాం ఏకదంత ముపాస్మహే ||

ఆదిదేవుడు వినాయకుడు. ఏ శుభకార్యంలో అయినా మన తొలిపూజలందుకునే వేలుపు ఆయనే. ఏడాదిలో ఎన్ని పండుగలున్నా తొలి పండుగగా వినాయక చవితినే (సెప్టెంబర్ 18) పెద్దలు పేర్కొంటారు. పల్లెల నుంచి పట్టణాల దాకా వినాయక చవితి వేళ ఆధ్యాత్మిక శోభ తోరణాలు కడుతుంది. చవితి పందిళ్లలో ఆబాల గోపాలమూ పత్రి, పూలతో... ఉండ్రాళ్లు, గుంజీళ్లతో... బొజ్జ గణపయ్యను ఆరాధించి పునీతులవుతుంటారు. తొమ్మిది రోజుల వేడుక అనంతరం వినాయక నిమజ్జనం దేశంలో అతిపెద్ద వేడుకగా కొనసాగుతుంది. ప్రకృతి ప్రియుడైన వినాయకుడిని మట్టిగణపతిగా పూజించుకుందాం. అప్పుడే ఈ పూజలకు అర్థం, పరమార్థం సిద్ధిస్తాయి. ఈ మాసారంభంలోనే శ్రీకృష్ణాష్టమి (సెప్టెంబర్ 6) విజయం చేస్తోంది. మానవజాతికి గీతాసందేశాన్ని అందించిన జగద్గురువు శ్రీకృష్ణుడు. ఆయన జన్మించిన కృష్ణాష్టమినాడు దేశమంతా కృష్ణనామ స్మరణతో, కోలాటాలతో, ఉట్టికొట్టే ఆటలతో కోలాహలంగా ఉంటుంది. పిల్లకు గోపీ కృష్ణుల వేషాలు వేసి, వారిలో కృష్ణుడిని చూసుకుని పెద్దలు మురిసిపోతారు. వెన్నముద్దలతో, బాలభోగాలతో వేడుకగా సాగే పండుగ సంప్రదాయం మనకు స్వామి అనుగ్రహాన్ని నిండుగా అందించాలని ఆకాంక్షిద్దాం. 

ఈ నెల 18న తిరుమలలో అధికమాస బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. శ్రీనివాసుడు తిరుమాడ వీధులలో ఊరేగుతూ భక్తులను అనుగ్రహిస్తాడు. సప్తగిరులు పులకించిపోతాయి. గతించిన పెద్దలను పేరుపేరునా స్మరించుకుంటూ వారి సౌఖ్యం కోసం దానధర్మాలు చేసే మహాలయ పక్షాలు ఈ మాసం చివరిలో 30న ప్రారంభమవుతున్నాయి. వారిని స్మరించి తరిద్దాం. అవిఘ్నమస్తు.

➠ భాద్రపద బహుళ పాడ్యమి మొదలు అమావాస్య వరకూ పదిహేను రోజులకు మహాలయ పక్షం అని పేరు. ఈ పదిహేను రోజులూ పితృదేవతారాధనకు సంబంధించినవే. ఈనెల 30వ తేదీ నుంచి మహాలయపక్షం ఆరంభమవుతోంది. ఈ మహాలయ పక్షాలను ఇంటివద్ద నిర్వర్తించవచ్చు. మహాలయ అమావాస్య (అక్టోబర్ 14) నాడు ఎవరైనా తమ పితృదేవతలకు శ్రాద్ధవిధిని జరుపుకోవచ్చు.

➠ ప్రకృతి ఆరాధనకు ప్రతీకగా నిలిచే పర్వం పోలాల అమావాస్య. ఆనాడు కంద పిలకలను పూజిస్తారు తెలుగు మహిళలు. పరమేశ్వరుని వాహనమైన నంది పుట్టినరోజు ఇదే. దేశంలోని కొన్నిప్రాంతాల్లో గో-వృషభ పూజ చేస్తారు. మరాఠీలు ప్రాచీదేవి అనే మాతృశక్తిని పోలాల అమావాస్యనాడు ఆరాధిస్తారు.

➠ తిరుమల బ్రహ్మోత్సవాలు మానవాళికి మహోత్సవాలు. ప్రతి సంవత్సరం సౌరమానం ప్రకారం కన్యామాసంలో వీటిని నిర్వహించడం ఆనవాయితీ. అధికమాసం వచ్చినప్పుడు మాత్రం ఒకే ఏడాదిలో రెండుసార్లు నిర్వహిస్తారు. ఈసారి అధిక శ్రావణమాసం వచ్చిన కారణంగా కన్యామాసమైన భాద్రపదంలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు, ఆశ్వయుజంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఉంటాయి.  

➠ శ్రావణ బహుళ అష్టమినాడు రోహిణీ నక్షత్రంలో శ్రీకృష్ణుడు జన్మించాడు. అదే కృష్ణాష్టమి పర్వదినం. కృష్ణభక్తులకు అతిముఖ్యమైన రోజు. ప్రపంచవ్యాప్తంగా అన్నిదేశాలలోనూ నేడు కృష్ణభక్తులున్నారు. వారంతా అవతారమూర్తిగా, లీలామానుష విగ్రహునిగా శ్రీకృష్ణుడు ప్రదర్శించిన లీలలను పాడుకుని పరవశిస్తుంటారు.

➠ వినాయక చవితి మన సంస్కృతికి ప్రతీక. ప్రతి ఇంటిలోనూ పసుపుతో, బంకమట్టితో వినాయకుణ్ణి రూపొందించి పూజిస్తారు. పళ్లూ కాయలతో పాలవెల్లిని తయారు చేస్తారు. దానికింద వినాయక ప్రతిమను ఏర్పాటు చేస్తారు. వినాయక చతుర్ధినాడు పూజలందుకునే వినాయకుణ్ణి వరసిద్ధి వినాయకుడని పిలుస్తారు. దేశమంతటా వినాయకచవితిని ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు.   

➠ మాతృశక్తికి ఎల్లలు లేవు. ప్రకృతి, సమస్త జంతుజాలం, వృక్షాదులు అన్నింటిలో ఆ శక్తియే నిండివుంది. ఈ విషయాన్ని అవగతం చేసుకుంటే అందరిలోనూ అన్నింటా అమ్మను చూడగలుగుతాం. మనసు అమృతం. వాక్కు అమృతం. ఆర్తులకు, ఆపన్నులకు అమృతహస్తం అందించి... సుధలు పంచడానికే పుట్టిన పున్నమి జాబిలి మాతా అమృతానందమయి. మానవాళిని సాంత్వనపరిచే లక్ష్యం కోసం జీవితాన్ని అంకితం చేసింది.

Recent Comments