శ్రీ మహాలక్ష్మికి క్షీరాబ్ధి కన్యకకు జయ మంగళం
వరము లిచ్చే తల్లి వరమహా లక్ష్మికి శుభ మంగళం

ఈ సంచిక శ్రావణ భాద్రపదాలకు సేతువై, వ్రతాలకు, పండగలకు నెలవై రూపొందింది. ముందుగా శ్రావణ శుక్రవారం (ఆగస్ట్ 4వ తేదీ) శ్రీ వరలక్ష్మీ వ్రతం వేంచేస్తోంది. ముత్తయిదువులు భక్తి ప్రపత్తులతో అమ్మవారిని కొలుస్తారు. ఆ వరాలతల్లి కోరిన శుభాలన్నింటినీ అందించాలని కోరుకుందాం. విఘ్నరాజు వినాయక వ్రతం ఈ నెల 25న మొదలై పదిరోజుల పాటు భక్తి సందడి చేయనుంది. విఘ్నేశ్వరుడు ఆది దేవుడు. ఆ స్వామి అందరికీ పూజ్యుడు. చదువులిచ్చే బొజ్జ గణపయ్య పిల్లకు పరమ ఆప్తుడు. పిల్లలు ఆయనకు ఇష్టమైన పత్రి, పూలను సేకరించి స్వామిని పూజించుకుంటారు. విఘ్నేశ్వరుని చిత్తవృత్తులన్నీ ప్రకృతితో ముడిపడి ఉన్నాయి. అంతేకాని కొండంత రూపం, కొండంత పత్రి నిర్మలమైన భక్తికి నిదర్శనాలు కానేకావు. కృత్రిమ రంగుల హంగులతో ప్రకృతికి, పరిసరాలకు ముప్పుతెచ్చే వినాయక విగ్రహాలకు స్వస్తి చెబుదాం. నలుగుపిండితో ఉద్భవించిన గణపయ్యను మామూలు మట్టితో మలచుకుందాం. పర్యావరణ పరిరక్షణే ఆ దేవుడు సంతసించే అసలైన పూజ. వినాయక వ్రత విధానాన్ని ఈ సంచికతో చిరుపుస్తకంగా అందిస్తున్నాం.

➠ అనుబంధాలను బలోపేతం చేసి, అనురాగాలను వర్ధిల్లచేసే అపురూప పర్వం రక్షాబంధనం.సోదరీ సోదరుల మధ్య ప్రేమ, ఆప్యాయతలను కలబోసుకునే పండుగగా రక్షాబంధనం భారతీయ కుటుంబ వ్యవస్థను పదిలంగా కాపాడుతోంది. ఒకప్పుడు ఉత్తరాది సంస్క‌ృతిలో మిళితమైన పండుగ రక్షాబంధన్. ఇప్పుడు రాఖీ వేడుకకు ఎల్లలు లేవు.

➠ ప్రకృతి ఆరాధనకు ప్రతీకగా నిలిచే పర్వం పోలాల అమావాస్య. ఈనాడు కంద పిలకలను పూజిస్తారు తెలుగు మహిళలు. పరమేశ్వరుని వాహనమైన నంది పుట్టినరోజు ఇదే. దేశంలోని కొన్నిప్రాంతాల్లో గో-వృషభ పూజ చేస్తారు. మరాఠీలు ప్రాచీదేవి అనే మాతృశక్తిని పోలాల అమావాస్యనాడు ఆరాధిస్తారు.

➠ శ్రీరామకృష్ణులు బోధనా పర్వమంతా ఒక ఎత్తైతే సాధనా జీవితమంతా మరో ఎత్తు. ఆయన అవలంబించని మతం లేదు. చివరిగా సర్వ మతాల సారం ఒక్కటేనని అనుభవ పూర్వకంగా వెలిబుచ్చారు. పరమహంసగా ప్రఖ్యాతి పొందారు.

➠ సుబ్రహ్మణ్యుడు ఆరుముఖాలు కలవాడు కనుక షణ్ముఖుడయ్యాడు. శూరపద్ముడు, సింహముఖుడు, తారకాసురుడు అనే రాక్షసులను సంహరించేందుకు జన్మించినవాడు. వాటిని ఆరుపడైవీడు అని వ్యవహరిస్తారు. ఆడికృత్తిక పర్వదినం సందర్భంగా ఈ క్షేత్రాలన్నింటిలో మహోత్సవాలు జరుగుతాయి. 

➠ రాఘవేంద్ర యతీంద్రులు కారణజన్ములు. జీవన యాత్రలో అలసిన వారికి సేదనిచ్చే కల్పతరువు. అధ్యాత్మ క్షీరాన్ని ప్రసాదించే కామధేనువు. మంత్రాలయ మహాక్షేత్రం దర్శించినవారినీ ఆయన ఆప్యాయ స్పర్శతో ఊరటకలగ చేస్తున్న భావన కలుగుతుంది. రాఘవేంద్రుల ఆరాధన సందర్భంగా మంత్రాలయంలో విశేష ఉత్సవాలు జరుగుతాయి. 

➠ శ్రావణ బహుళ అష్టమి రోహిణీ నక్షత్రయుక్త అష్టమినాడు శ్రీకృష్ణ పరమాత్మ అవతరించాడు. స్మార్తులు అష్టమినాడు (ఆగస్టు 14) వైష్ణవులు రోహిణీ నక్షత్రం నాడు (ఆగస్టు 15) శ్రీకృష్ణాష్టమీ వ్రతాన్ని ఆచరిస్తారు.

Recent Comments