bhakthipathrika

వానలు కురుస్తున్నాయి. ఎటుచూసినా పచ్చని ప్రకృతి. ఈ కాలంలో పొంచివున్న మహమ్మారులను తరిమికొట్టడానికి తెలంగాణ ప్రజలు అత్యంత భక్తిశ్రద్దలతో అమ్మతల్లికి బోనాలు సమర్పిస్తుంటారు. గోల్కొండలో 7వ తేదీన జగదంబిక బోనాలు ప్రారంభమవుతాయి. బోనాలు అందుకునే అమ్మతల్లులు మనందరినీ చల్లంగా చూడాలని వేడుకుందాం. ప్రతి ఆషాఢంలో జనసంద్రంగా సాగే పూరీ జగన్నాథ రథోత్సవం (జూలై 7, 8) దేశానికే పర్వదినం. దక్షిణాయన వేళలో తొలి ఏకాదశి (17) ప్రధానపర్వం. అటుపైన గురుపూర్ణిమ (జూలై 21) వస్తుంది. గురువంటే మన సంప్రదాయంలో సాక్షాత్తూ పరమాత్మయే. మన గురుపరంపరను సంస్మరిస్తూ వారికి అంజలి ఘటించడం మన సంస్కారం. మహనీయులు, మాన్యులు అయిన పీఠాధిపతులు చాతుర్మాస్య దీక్షలను గురుపూర్ణిమ రోజునే ప్రారంభిస్తారు.

ఇంటింటా ధర్మజ్యోతిగా భక్తిపత్రికను ప్రారంభించి తొమ్మిదేళ్లు పూర్తయ్యాయి. ఇది మన పత్రికకు 10వ జన్మదిన సంచిక. 2015లో గోదావరి పుష్కరాల సందర్భంగా భక్తిటీవీకి అనుబంధంగా భక్తిపత్రికను ప్రారంభించాం. ఇంతకాలంగా భక్తిపత్రిక అశేష పాఠకాదరణ పొందుతూ, అప్రతిహతంగా ముందుకు సాగుతుంది. కరోనా సమయంలో కూడా క్రమం తప్పకుండా పత్రికను వెలువరించాం. భారతీయ ధర్మం, తత్త్వచింతన, మహనీయుల మహితోక్తులతో పాటు ఆయా ఆయా పండుగలు, ఆలయాలపై విశిష్ట వ్యాసాలతో భక్తిపత్రికను తీర్చిదిద్దుతున్నాం. భక్తిపరిమళాలు వెదజల్లేలా, ఆధ్యాత్మిక చింతనను పెంచేలా ఎన్నెన్నో వైవిధ్యభరితమైన శీర్షికలను నిర్వహిస్తున్నాం. ఎన్నో నేడు పత్రికలు పుట్టి కొద్దికాలానికే కనుమరుగవుతున్న పరిస్థితుల్లో భక్తిపత్రికను అప్రతిహతంగా కొనసాగిస్తూ సకాలంలో పాఠకదేపుళ్లకు చేరుపపుతున్నాం. ఈ క్రతువులో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తట్టుకుని నిలబడుతున్నాం. ఆధ్యాత్మిక పత్రికలలో భక్తిపత్రిక నేడు అగ్రస్థానంలో కొనసాగడానికి పాఠకులు, ప్రచురణకర్తల సహాయ సహకారాలే కారణం. మీ ఆదరాభిమానాలు ఇలాగే చిరకాలం కొనసాగాలని కోరుకుంటున్నాం.

Read More