వానలు కురుస్తున్నాయి. ఎటుచూసినా పచ్చని ప్రకృతి. ఈ కాలంలో పొంచివున్న మహమ్మారులను తరిమికొట్టడానికి తెలంగాణ ప్రజలు అత్యంత భక్తిశ్రద్దలతో అమ్మతల్లికి బోనాలు సమర్పిస్తుంటారు. గోల్కొండలో 7వ తేదీన జగదంబిక బోనాలు ప్రారంభమవుతాయి. బోనాలు అందుకునే అమ్మతల్లులు మనందరినీ చల్లంగా చూడాలని వేడుకుందాం. ప్రతి ఆషాఢంలో జనసంద్రంగా సాగే పూరీ జగన్నాథ రథోత్సవం (జూలై 7, 8) దేశానికే పర్వదినం. దక్షిణాయన వేళలో తొలి ఏకాదశి (17) ప్రధానపర్వం. అటుపైన గురుపూర్ణిమ (జూలై 21) వస్తుంది. గురువంటే మన సంప్రదాయంలో సాక్షాత్తూ పరమాత్మయే. మన గురుపరంపరను సంస్మరిస్తూ వారికి అంజలి ఘటించడం మన సంస్కారం. మహనీయులు, మాన్యులు అయిన పీఠాధిపతులు చాతుర్మాస్య దీక్షలను గురుపూర్ణిమ రోజునే ప్రారంభిస్తారు.
ఇంటింటా ధర్మజ్యోతిగా భక్తిపత్రికను ప్రారంభించి తొమ్మిదేళ్లు పూర్తయ్యాయి. ఇది మన పత్రికకు 10వ జన్మదిన సంచిక. 2015లో గోదావరి పుష్కరాల సందర్భంగా భక్తిటీవీకి అనుబంధంగా భక్తిపత్రికను ప్రారంభించాం. ఇంతకాలంగా భక్తిపత్రిక అశేష పాఠకాదరణ పొందుతూ, అప్రతిహతంగా ముందుకు సాగుతుంది. కరోనా సమయంలో కూడా క్రమం తప్పకుండా పత్రికను వెలువరించాం. భారతీయ ధర్మం, తత్త్వచింతన, మహనీయుల మహితోక్తులతో పాటు ఆయా ఆయా పండుగలు, ఆలయాలపై విశిష్ట వ్యాసాలతో భక్తిపత్రికను తీర్చిదిద్దుతున్నాం. భక్తిపరిమళాలు వెదజల్లేలా, ఆధ్యాత్మిక చింతనను పెంచేలా ఎన్నెన్నో వైవిధ్యభరితమైన శీర్షికలను నిర్వహిస్తున్నాం. ఎన్నో నేడు పత్రికలు పుట్టి కొద్దికాలానికే కనుమరుగవుతున్న పరిస్థితుల్లో భక్తిపత్రికను అప్రతిహతంగా కొనసాగిస్తూ సకాలంలో పాఠకదేపుళ్లకు చేరుపపుతున్నాం. ఈ క్రతువులో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తట్టుకుని నిలబడుతున్నాం. ఆధ్యాత్మిక పత్రికలలో భక్తిపత్రిక నేడు అగ్రస్థానంలో కొనసాగడానికి పాఠకులు, ప్రచురణకర్తల సహాయ సహకారాలే కారణం. మీ ఆదరాభిమానాలు ఇలాగే చిరకాలం కొనసాగాలని కోరుకుంటున్నాం.
➠ వేదాకాలం నుంచి నేటివరకు మన మహర్షులు, పెద్దలు, శాస్త్రవేత్తలు పదిసంఖ్య విశిష్టతను ఎన్నోరకాలుగా విశదీకరించారు. మన నడవడికను చక్కదిద్దుకోవడానికి పనికివచ్చే ఎన్నో గొప్ప విషయాలు 'పది' నేపధ్యంలో కనిపిస్తాయి. భక్తిపత్రిక పదో వార్షికోత్సవం సందర్బంగా మన ధర్మంలో పది సంఖ్యతో ముడిపడిన విశేషాల సమాహారమిది...
➠ ఎందరో గురువులు ఈ భారతావనిపై అవతరించి మానవులను ముక్తిమార్గం వైపు పయనింప జేశారు. జ్ఞానస్వరూపులైన త్రిమూర్తులు ఏకోన్ముఖంగా అవతరించిన మహమనీయ గురురూపం దత్తాత్రేయ స్వామి. తెలుగునేలపై నడయాడిన దత్తావధూత శ్రీనృసింహ సరస్వతి. ఆయన సంచరించిన అనేక ప్రాంతాలు నేడు ప్రసిద్ధ దత్తక్షేత్రాలుగా భాసిల్లుతున్నాయి.
➠ ఆషాఢ మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశికి తొలి ఏకాదశి అని పేరు. ఈరోజు నుంచి శ్రీమహావిష్ణువు నాలుగు నెలలపాటు యోగనిద్రకు ఉపక్రమిస్తాడు. కార్తికంలో వచ్చే ఉత్థాన ఏకాదశినాడు తిరిగి మేల్కొంటాడు. దక్షిణాయన ప్రారంభకాలంలో వచ్చే తొలి ఏకాదశి పర్వం విష్ణుభక్తులకు పరమపవిత్రం. ఉపవాస జాగరణలతో ఈ పర్వదినాన్ని భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు.
➠ నాలుగు నెలల కాలంపాటు చేసే దీక్ష కనుక చాతుర్మాస్య దీక్ష అని పేరు. ఈ వ్రతాన్ని గతంలో గృహస్థులు కూడా నిర్వహించేవారు. ప్రస్తుతం సన్యాస మార్గంలో ఉన్నవారు మాత్రమే నిర్వహిస్తున్నారు. చాతుర్మాస్య దీక్షలో ఉన్న సన్యాసులు ఒకేచోట నాలుగునెలల కాలంపాటు ఉండి, తమ వద్దకు వచ్చే శిష్యులకు ప్రబోధం చేస్తారు.
➠ ఆషాఢమాసం రెండోరోజున పూరీ జగన్నాథుని రథోత్సవం చూడడానికి రెండుకన్నులూ చాలవు. దాదాపు 53 సంవత్సరాల తరువాత ఈసారి పూరీ జగన్నాథ రథోత్సవం రెండురోజుల పాటు జరగనుంది. రథోత్సవం ప్రతి ఆషాఢంలోనూ రెండోరోజున నిర్వహించడం ఆనవాయితీ.
➠ ఆషాఢమాసం వచ్చిందంటే తెలంగాణ నేలపై బోనాల సంబురాలు మొదలవుతాయి. నెత్తిన బోనం కుండలతో, ఘటాలతో.... పోతురాజుల విన్యాసాలతో, ఫలహారపు బళ్లతో భాగ్యనగర వీధులన్నీ కళకళలాడుతాయి. తల్లీ బైలెల్లినాదో... చల్లంగ మమ్మేలు మాయమ్మో... అంటూ జానపదుల పాటలు హుషారెత్తిస్తాయి.