మనోజవం మారుతతుల్యవేగం / జితేంద్రియం బుద్ధిమతాం వరిష్ఠం
వాతాత్మజం వానరయూధముఖ్యం / శ్రీరామదూతం శిరసానమామి
శ్రీరామదూత అయిన హనుమంతుడి పుట్టిన రోజు అయిన హనుమజ్జయంతిని జూన్ 1న తెలుగువారు నిర్వహించుకుంటారు. ఆరోజున ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడతాయి. స్వామికి ఇష్టమైన తమలపాకు పూజలు, వడమాల సమర్పణలు విరివిగా జరుగుతాయి. విశేష క్రతువులు నిర్వహిస్తారు. హనుమంతుడు సంగీతప్రియుడు. రామనామ సంకీర్తనతో ఆయన సంతోషిస్తాడు. ఎక్కడ రామనామం వినిపిస్తుందో అక్కడ అంజలిబద్ధుడై, కన్నులనిండా ఆనందబాష్పాలు నింపుకుని హనుమంతుడు ఉంటాడని, ఆయన చిరంజీవి అని మనవారి నమ్మకం. ఈ హనుమజ్జయంతి శుభవేళ స్వామి అనుగ్రహ ఆశీస్సులు అందరిపైనా వర్షించాలని కోరుకుందాం. జూన్ 16న గంగాజయంతి వస్తోంది. దీనినే దశపాపహర దశమి అని కూడా పిలుస్తారు. ఒక్కసారి తనలో మునక వేసినంతనే మానవుల సకల పాపాలనూ గంగ తొలగించగలదని పెద్దలు చెబుతుంటారు. ఈ పుణ్యవేళలో గంగాస్నాన ఫలం అందరికీ లభించాలని కోరుకుందాం.
ప్రపంచానికి భారతదేశం అందించిన అమూల్యమైన కానుక యోగశాస్త్రం. ఇది అత్యంత పురాతనమైన శాస్త్రాల్లో ఒకటి. పురాణకాలంనుంచి అనేక విధాలుగా కనిపిస్తుంది. యోగశాస్త్రంలో వందలకొద్దీ శాఖలున్నాయి. వాటిలో ముఖ్యంగా యోగాసనాలు, ప్రాణాయామం, ముద్రల వల్ల అనేక ఆరోగ్యలాభాలు కలుగుతాయని నేటి వైజ్ఞానికులు నిరూపిస్తున్నారు. ఏటా జూన్ 21న అంతర్జాతీయ యోగ దినోత్సవం జరుపుకుంటారు. 'యోగీభవ అర్జున' అన్న శ్రీకృష్ణుని సందేశాన్ని అమలు పరుద్దాం. చేతనైనంతలో యోగసాధనతో ఆరోగ్యకరమైన సమాజాన్ని తీర్చిదిద్దుకుందాం. ఆరుగాలం శ్రమించి ముక్కారు పంటలు పండించే రైతన్నలు నిర్వహించుకునే తొలి పండుగ ఏరువాక. వర్షాకాలం ప్రారంభానికి ముందుగా నేలను దున్నే సందర్భం ఇది. 'వానల్లు కురవాలి వానదేముడా' అంటూ రైతులు చేసే ప్రార్థనను ప్రకృతి ఆలకించాలని ఆశిద్దాం. అకాల వర్షాలు ఉండకూడదనీ, సకాలంలో పడే వర్షాలు భూమిని సస్యశ్యామలం చేయాలనీ కోరుకుందాం.
➠ జీవులకు ప్రాణశక్తిని ఇచ్చేవాటిలో చెట్లు ముఖ్యమైనవి. అందుకే మనవారు చెట్లను దేవతాస్వరూపాలుగా పూజిస్తారు. మర్రిచెట్టును సావిత్రి స్వరూపంగా పూజించే ప్రత్యేక సందర్భం వటసావిత్రి వ్రతం. భర్త ప్రాణాలకోసం యముడినే ఎదిరించిన సావిత్రికథ ఈ వ్రతంతో ముడిపడి ఉంటుంది.
➠ రోళ్లుపగిలే రోహిణి కార్తెలో నేల నెర్రెలు విచ్చుతుంది. మృగశిర కార్తె లేదా ఆరుద్రకార్తెలు మనకు సాధారణంగా వర్షపాతాన్నిస్తాయి. దానితో నేలతల్లి దాహార్తి తీరుతుంది. ఈ సంవత్సరం మృగశిర కార్తె జూన్ 7 నుంచి, ఆరుద్రకార్తె జూన్ 22 నుంచి ప్రారంభమవుతున్నాయి. ఏరువాక పున్నమి జూన్ 22న వస్తోంది.
➠ సృష్టిలోని సౌందర్యా న్నంతా ఉలులకు అద్ది శిల్పుల చేతికి అందిస్తే అది అక్షరధామ్ అవుతుంది. సనాతన భారతీయ కళలు, మనవారి అసమాన ప్రజ్ఞావిశేషాలు, ఆలోచనా విలువలకు నిలువుటద్దంలా అక్షరధామం కనువిందు చేస్తుంది. నేడు అనేక ప్రపంచ దేశాల్లో అక్షరధామాలున్నాయి.
➠ గంగ పుట్టిన రోజే దశపాపహర దశమి. దీనినే దశహర అని కూడా పిలుస్తారు. మనలోని సకల కల్మషాలనూ గంగ కడిగివేయగలదని చెబుతారు. అలా గంగ కడిగివేసే పదిరకాలైన పాపాలను ప్రక్షాళన చేసుకోవడానికి ఉద్దేశించినదే గంగాదశమి.
➠ నెమ్మదిగా నడుస్తాడు కాబట్టి శనికి మందుడని పేరు. నవగ్రహాలలో శనిది కర్మాధికారి స్థానం. జీవుల పాపపుణ్యాలకు తగిన ఫలాలను అనుగ్రహిస్తాడు. ఫలితాలను అందించడంలో మాత్రం శని అత్యంత వేగంగా, ప్రభావశీలంగా పనిచేస్తాడు. నిజానికి శనిప్రభావాలు అందరికీ ఒకేలా వర్తించవు.
➠ హనుమంతుడు వానరప్రముఖుడే అయినా వాల్మీకి దృష్టిలో, హనుమత్ భక్తుల దృష్టిలో కేవలం వానరుడు కాదు. హనుమంతుడంటే ప్రశస్తమైన దౌడలు కలవాడని అర్థం. మాటతీరు ఎలా ఉండాలో తెలిసినవాడు ఆయన. వైశాఖ బహుళ దశమి హనుమజ్జయంతి. ఆ స్వామి గుణగణాలను తెలుసుకుందాం.