శుద్ధస్ఫటిక సంకాశం శితికంఠం కృపానిధిం
సర్వేశ్వరం సదాశాంతం ఏకబిల్వం శివార్పణం

మహారుద్రుని కరుణతో భక్తిటివి కోటిదీపోత్సవం దిగ్విజయంగా ముగిసింది. ఎందరో మహనీయుల దివ్యాశీస్సులతో రెండు తెలుగు నగరాల్లో సరికొత్త చరిత్ర సృష్టించింది. 23 రోజులపాటు సాగిన ఈ దీపయజ్ఞం అణువణువున ఆధ్యాత్మిక చైతన్యాన్ని రగిలించింది. లక్షలాదిమందికి స్ఫూర్తిదాయకమైంది. ఇంటింటా పవిత్ర దీపాలు వెలిగాయి. భక్తిప్రదాలై నిలిచాయి. అజ్ఞానాంధకారాన్ని తొలగించే, జ్ఞానజ్యోతులైనాయి. దీపం పరబ్రహ్మ స్వరూపమై భాసిల్లాలనే మా ప్రయత్నం సఫలమైంది. రాబోయే కార్తిక మాసాలను కూడా యిదే స్ఫూర్తి చైతన్యాలతో, భక్తి శ్రద్ధలతో కాంతిమయం చేసుకోవాలన్నదే మా ఆకాంక్ష. ఈ నెలారంభంలో హనుమద్వ్రతం, దత్తాత్రేయ జయంతి, అన్నపూర్ణా జయంతి, తిరువణ్ణామలై కార్తిగై దీపం రావడం ఒక విశేషం. డిసెంబర్ 16 నుంచి ధనుర్మాసం ప్రారంభమవుతోంది. రాబోయే సంక్రాంతికి నాంది పలుకుతూ నేలతల్లిని అలంకరించే సందడి మొదలవుతుంది. రంగవల్లులు, గొబ్బిళ్లు, కనులవిందు చేసే జానపద కళాకారులతో సంక్రాంతి నెల కళాత్మకంగా సాగుతుంది. డిసెంబర్ 17న కొమరవెల్లి మల్లన్న కల్యాణం భక్తకోటికి దివ్యవిశేషం. మహామానవుడు శ్రీరమణ మహర్షి అవతరించిన రోజు డిసెంబర్ 30. ఆ మహనీయునికి అంజలి ఘటిద్దాం. పూర్ణయోగి అరవిందుని మహాసమాధి సందర్భం కూడా ఈ నెలలోనే 5వ తేదీన వస్తోంది. ఈ మాసాంతంలో భద్రాద్రి రామయ్య తెప్పోత్సవం గోదావరిని పునీతం చేయనుంది. పుణ్య వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయాలలో ఉత్తరద్వారాలు దర్శనమిస్తాయి.

➠ అన్నం బ్రహ్మేతి వ్యజానాత్ అన్నాయి ఉపనిషత్తులు. పరబ్రహ్మ అన్నస్వరూపంగా అన్నపూర్ణగా తన మాతృప్రేమను చాటుకున్నాడు. ఆ తల్లి కరుణాకటాక్షాలతోనే నేలతల్లి ధాన్యరాశుల్ని అందించి ఇంటి గాదెల్ని, ఇంటిలోని వారి కడుపులను నింపగలుగుతోంది.

➠ అద్వైతయోగాన్ని పరిపూర్ణంగా ఆవిష్కరించిన మహాయోగి భగవాన్ రమణులు. భక్తి, కర్మ, జ్ఞాన, రాజయోగాల అంతర్లీన తత్వాన్ని ఏకోన్ముఖంగా అందించారు. అరుణాచల క్షేత్రాన్ని ఎన్నడూ దాటివెళ్లని, కౌపీనం తప్ప మరేదీ కట్టని రమణ మహర్షి చెంతకు ప్రపంచమే తరలి వచ్చింది.

➠ స్మరణాత్ అరుణాచలే అని సాక్షాత్తూ శివుడే సెలవిచ్చాడు. జ్ఞానులు మాత్రమే చిదంబరాన్ని దర్శిస్తారు. తిరువారూరులో జన్మించినవారు, కాశీలో మరణించినవారు మోక్షానికి అర్హులవుతారు. కాని అరుణాచలం అని ఊరుపేరు మాత్రం తలిస్తే చాలు... మోక్షార్హత లభిస్తుందన్నారు. అరుణగిరిపై కార్తిక దీపాన్ని దర్శిస్తే ముక్తి లభిస్తుందని భక్తుల విశ్వాసం.

➠ శ్రీరామదూత హనుమంతుడు ప్రతిచోటా కొలువుదీరి ఉంటాడు. హనుమంతుడు కేవలం దేవతామూర్తి కాదు. మంత్రమూర్తి. రాజనీతిజ్ఞుడు. యోగస్వరూపుడు. యుద్ధవిశారదుడు. అన్నింటినీ మించి ధర్మమూర్తి. హనుమద్వ్రతం విశిష్టమైనది. సకల హితాలనూ చేకూర్చుతుంది.

➠ అత్రివరదుడైన దత్తాత్రేయుడు కల్పతరువు ఆదిగురువు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ఏకరూపంగా ప్రభవించినవాడు. త్రిగుణాతీతుడు ఆయన శ్రీమన్నారాయణుని ఆరో అవతారమని చెబుతారు. విష్ణుపరమైన జగత్ పాలనా కర్తవ్యాన్ని అవధూత భూమికలో నిర్వహిస్తున్నవాడు. చూసే దృష్టి ఉంటే సృష్టిలో అణువణువునా గురుస్వరూపాలు దర్శనమిస్తాయని ప్రవచించాడు.

➠ వైకుంఠ ఏకాదశి పర్వదినాన విష్ణుమూర్తి ఆలయాలన్నీ కిటకిటలాడతాయి. తెల్లవారుజామునుంచే ఉత్తర ద్వార దర్శనం కోసం భక్తులు బారులు తీరుతారు. వైకుంఠ ఏకాదశినాడు ఉత్తర ద్వారదర్శనం చేస్తే మోక్షం లభిస్తుందని, ముక్కోటి దేవతల ఆశీస్సులు లభిస్తాయని భావిస్తారు.

Recent Comments