భక్తిపత్రిక జూలై 2017 సంచిక ఇప్పుడు మీ కరకమలాల్లో ఉంది. అందరి ఆశీస్సులతో, ఆదరాభిమానాలతో భక్తిపత్రిక రెండు సంవత్సరాలు విజయవంతంగా పూర్తిచేసుకుని మూడో ఏడాదిలోకి అడుగుపెట్టింది. ఈ సంతోషవేళ ఆదరిస్తున్న అందరికీ  కృతజ్ఞతాభివందనాలు.

ధ్యాన మూలం గురోర్మూర్తిః పూజా మూలం గురోఃపదమ్
మంత్ర మూలం గురోఃవాక్యం మోక్ష మూలం గురోః కృపా

ధ్యాన, పూజ, మంత్ర, మోక్షాలన్నింటికీ మూలం గురువే. అందుకే గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మైశ్రీ గురవేనమః అంటూ శిరసు వంచుతాం. జూలై 9న గురుపూర్ణిమ మహోత్సవం వస్తున్నది. మనం ఈనాడిలా నాగరికంగా, మానవతా విలువలను కాపాడుకుంటూ  ఉన్నతంగా జీవిస్తున్నామంటే దానికి కారణం యుగాలుగా మానవ జాతిని పలువిధాలుగా సంస్కరించిన గురువులు. ఆధ్యాత్మిక, సామాజికాది పలురంగాల్లో మానవాళిని సావధానంగా ముందుకు నడిపించిన మహనీయులెందరో. భక్తి ప్రపత్తులతో వారిని, వారి సద్బోధలను సంస్మరించుకునే సదవకాశం ఈ పొద్దు మనకు లభించింది. వినమ్రంగా గురువందనం చేసుకుందాం.

➠ తిరుమల తిరుపతి స్వామికి నిత్య కల్యాణం పచ్చతోరణం. ఏడాది పొడవునా ప్రతిరోజూ ఏదో ఒక ఉత్సవం, వేడుక తిరుమల కొండపై నిర్వహిస్తూనే ఉంటారు. శ్రీవారి సన్నిథిలో ఆషాఢమాసంలో జరిగే ముఖ్యకార్యక్రమం ఆణివర ఆస్థానం. వార్షిక ఆదాయ వ్యయాల నివేదిక, పుష్పపల్లకీ సేవ ప్రధానంగా నిర్వహించే ఆణివర ఆస్థానం దక్షిణాయనం ప్రారంభదినం నాటి విశేష కార్యక్రమం.

➠ గురువు ప్రాతఃస్మరణీయుడు. గురుదేవుడున్న చోట సర్వదేవతలు సంచరిస్తూ ఉంటారు. గురువాక్యం మంత్రానికి ఆద్యం. గురుకృపయే మోక్షం. ఆచార్యుడు, తండ్రి, అన్న, రాజు, మేనమామ, మామ, తల్లి, మాతామహుడు, పితామహుడు, కులంపెద్ద, పినతండ్రి ఈ 11మందీ గురువులేనని శాస్త్ర కథనం. ప్రపంచంలో అనేకరకాలైన విద్యలున్నాయి. ఎవరు ఏ విద్య నేర్పినా ఆయన ‘గురు’సంబోధనతో వందనీయుడే.

➠ ఆషాఢ మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశికి తొలి ఏకాదశి అని పేరు. ఈరోజు నుంచి శ్రీమహావిష్ణువు నాలుగునెలలపాటు యోగనిద్రకు ఉపక్రమిస్తాడు. కార్తికంలో వచ్చే ఉత్థాన ఏకాదశినాడు తిరిగి మేల్కొంటాడు. దక్షిణాయన ప్రారంభకాలంలో వచ్చే తొలి ఏకాదశి పర్వం విష్ణుభక్తులకు పరమపవిత్రం. ఉపవాస జాగరణలతో ఈ పర్వదినాన్ని భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు.

➠ ఆ గురుశిష్యులిద్దరూ జగద్గురువులు. శృంగేరి శారదా పీఠాధిపతులు. శ్రీభారతీ తీర్థ మహాస్వామిని వెంటనంటి ఉంటూ విధుశేఖరులు జాతికి విద్యావరదానం చేస్తున్నారు. నాగపంచమి పర్వదినం శృంగేరీ పీఠ ఉత్తరాధికారి, విద్వణ్మణి విధుశేఖర భారతీస్వామి జన్మోత్సవం.

➠ ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చే మకర సంక్రాంతి తెలుగువారికి పెద్దపండుగ. సూర్యుడు కర్కాటకంలో ప్రవేశించే దక్షిణాయనం కూడా పుణ్యప్రదమైనదే. మన ప్రధాన పండుగలన్నీ దక్షిణాయనంలోనే వస్తాయి. శుభకార్యాలను ఉత్తరాయణంలోనే నిర్వహించే మనం శక్త్యారాధన, రుద్రారాధన, పితృదేవతారాధన మాత్రం దక్షిణాయనంలోనే చేస్తాం.

➠ వికాసమే జీవనం. సంకోచమే నా గురుదేవుడు మరణం. మనపై మనకు విశ్వాసం, భగవంతుడిపై విశ్వాసం అనేవి పరిపూర్ణ వికాస మంత్రాలు. ముప్పై మూడు కోట్ల పౌరాణిక దేవతలపైన మీకు నమ్మకం ఉన్నా... మీపై మీకు ఆత్మవిశ్వాసం లేకపోతే నిష్కృతి ఉండదు అని చాటిన నిత్యచైతన్య స్ఫూర్తి స్వామి వివేకానంద.

Recent Comments