"ధ్యానమూలం గురోర్మూర్తిః పూజామూలం గురోఃపదం
మంత్రమూలం గురోఃవాక్యం మోక్షమూలం గురోఃకృపా"

గురుస్వరూపమే ధ్యానించదగినది. గురువు పాదమే పూజించదగినది. గురువాక్యాన్ని మించిన మంత్రం లేదు. గురుకృపను సాధించడమే మోక్షం. ఆధ్యాత్మిక, సామాజిక రంగాల్లో మనకు పథనిర్దేశం చేసే గురువులే దైవాలు. అందుకే గురువును పరబ్రహ్మగా భావించి శిరసు వంచుతాం. జులై 5వ తేదీన గురుపూర్ణిమ వస్తున్నది. యుగయుగాలుగా మానవజాతిని సంస్కరించి, ముందుకు నడిపిస్తున్న గురువులెందరో ఉన్నారు. ఆదిగురువు నుంచి ఆధునిక గురువుల దాకా స్మరించుకుని వారి బోధనలను ఆచరణలో పెడదాం. ఈ పున్నమి వేళలోనే పూజ్యపీఠాధిపతులు, సాధుసన్యాసులు నిష్ఠనియమాలతో చాతుర్మాస్య దీక్షలకు ఉపక్రమిస్తారు. లోకకల్యాణం, లోకసౌభాగ్యం లక్ష్యంగా సంకల్పించి వారు చేపట్టే దీక్షలు ఫలవంతం కావాలని, ఆ శ్రేయోఫలాలు మనకు అందాలని ఆకాంక్షిద్దాం.

వచ్చె వచ్చె బోనాలు... అమ్మతల్లులు తెచ్చెతెచ్చె బోనాలు అంటూ ఆషాఢమాసం సందర్భంగా తెలంగాణ బోనాల పేరిట భక్తితోరణం అవుతుంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో నిర్వహణలో పరిమితులున్నప్పటికీ బోనాల వైభవ ప్రాభవాలు చిరస్థాయిగా ఉంటాయి. శక్తిస్వరూపిణి మన ఆరోగ్యాలను చల్లగా చూడాలని కోరుకుందాం. పండుగలకు నెలవైన దక్షిణాయనాన్ని సూచించే తొలి ఏకాదశి జూలై 1న రానున్నది. ఆ శేషతల్పశాయికి నమామి. శ్రావణమాసం వరలక్ష్మీ వ్రతం (జూలై 31) సందర్భంగా వ్రతవిధానాన్ని అందిస్తున్నాం. ఆరోగ్య, ఐశ్వర్యాలను ఆకాంక్షిస్తూ తెలుగింటి గృహిణులు జరుపుకునే వరలక్ష్మీ వ్రతం జాతికి సకల శ్రేయస్సులనూ కలిగించాలని కోరుకుంటున్నాను. భక్తిపత్రిక ఆరో జన్మదిన సంచిక ఇప్పుడు మీ కరకమలాల్లో ఉంది. ఇంటింటా ధర్మజ్యోతిగా వెలుగొందుతూ... ధార్మిక ప్రబోధాలను, సంప్రదాయ విశేషాలను సరళశైలిలో అందిస్తూ వస్తున్న భక్తిపత్రికను ఆదరిస్తున్న పాఠకులకు, ప్రకటన కర్తలకు కృతజ్ఞతాభివందనాలు.

 

➠ బోనాల ఉత్సవాలు హైదరాబాద్, సికింద్రాబాద్ పరిసరాల్లో ప్రారంభమయ్యాయి. కరోనా నేపథ్యంలో నిరాడంబరంగా నిరాడంబరంగా నిర్వహిస్తున్నారు. సాధారణంగా ఆషాఢ మాసం పూర్తయ్యేవరకు ప్రతి గురు, ఆదివారాల్లో గోల్కొండ కోట దగ్గర బోనాల జాతర
నిర్వహిస్తారు. బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో, సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో, లాల్ దర్వాజలోని సింహవాహిని ఆలయంలో, అక్కన్న మాదన్న మహంకాళి ఆలయంలో వరుస వారాల్లో బోనాలు సమర్పిస్తారు. 

➠ ఆషాఢ మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశికి తొలి ఏకాదశి అని పేరు. నాటి నుంచి శ్రీమహావిష్ణువు నాలుగునెలలపాటు యోగనిద్రకు ఉపక్రమిస్తాడు. కార్తికంలో వచ్చే ఉత్థాన ఏకాదశినాడు తిరిగి మేల్కొంటాడు. దక్షిణాయన ప్రారంభకాలంలో వచ్చే తొలి ఏకాదశి పర్వం విష్ణుభక్తులకు పరమపవిత్రం. ఉపవాస జాగరణలతో ఈ పర్వదినాన్ని భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు.

➠ ఆ గురుశిష్యులిద్దరూ జగద్గురువులు. శృంగేరి శారదా పీఠాధిపతులు. శ్రీభారతీ తీర్థ మహాస్వామిని వెంటనంటి ఉంటూ విధుశేఖరులు జాతికి విద్యావరదానం చేస్తున్నారు. నాగపంచమి పర్వదినం (జూలై 25) శృంగేరీ పీఠ ఉత్తరాధికారి, విద్వన్మణి విధుశేఖర భారతీస్వామి జన్మోత్సవం.

➠ యతులకు అత్యంత ప్రధానమైనది గురుపూర్ణిమ. ఆరోజున ఆచార్యపీఠాలన్నీగురు ఆరాధనా కార్యక్రమాన్నినిర్వహించాలని నియమం. అదేరోజున చాతుర్మాస్య వ్రతం కూడా ప్రారంభమౌతుంది. నాలుగు నెలలపాటు కఠోర దీక్షానియమాలతో సంన్యాసాశ్రమంలోని వారంతా ఈ వ్రతాన్ని పాటిస్తారు.

➠ ఆషాఢ పూర్ణిమను సింహాచలంలో గిరిపున్నమి అని వ్యవహరిస్తారు. అక్షయ తృతీయ నుంచి నాలుగు విడతలుగా చందన సేవను స్వీకరించిన సింహాద్రి అప్పన్న గిరిపున్నమి నాటికి సంపూర్ణ రూపాన్ని ధరిస్తాడు. పున్నమికి ముందురోజు సాయంకాలం నుంచి 32 కిలోమీటర్ల దూరం కాలినడకన సింహాచల గిరి ప్రదక్షిణ చేసి వచ్చిన వేలాది భక్తులు పున్నమినాడు స్వామి దర్శనం చేసుకుంటారు.

➠ ప్రకృతిలోని ప్రతి అణువూ జగన్మాత స్వరూపమే. అందుకే ఆమెను ప్రకృతి స్వరూపిణిగా శాస్త్రాలు వర్ణిస్తున్నాయి. గాలి, నీరు, చెట్టు, పుట్టా... ఒకటేమిటి చివరకు మన నిత్యభోజనంలో ప్రధానమైన కూరలతో సహా అన్నీ ఆ తల్లి దయ వల్ల లభించేవే. తన బిడ్డల
వంటి భక్తుల క్షుద్బాధను తీర్చటానికి ఆ తల్లితానే స్వయంగా అన్నిరకాల కూరగాయలను ఆభరణాలుగా ధరించి, శతాక్షిగా అవతరించింది. ప్రజలందరికీ సాంత్వన చేకూర్చింది. అందుకే ఆ తల్లి శాకంభరిగా భక్తుల నీరాజనాలు అందుకుంటోంది.

➠ శ్రావణమాసంలో స్త్రీలు మంగళగౌరీ, వరలక్ష్మీ వ్రతాలు జరుపుకుంటారు. ఈ రెండు వ్రతాలు సౌభాగ్యాన్ని, సుమంగళీత్వాన్ని కలిగిస్తాయని విశ్వసిస్తారు.

➠ గత శతాబ్దపు మహోన్నత యోగగురువుల్లో స్వామి శివానంద ఒకరు. ఆయన స్థాపించిన దివ్యజీవన సంఘం ప్రపంచవ్యాప్తంగా సాధకులకు మార్గనిర్దేశం చేస్తోంది. ఆధ్యాత్మికతకు మానవసేవను జతచేసి విద్య, వైద్యం వంటి దాదాపు నలభైరంగాల్లో సేవలను అందిస్తోంది. స్వామి శివానంద సరస్వతి ఆశయాలకు అనుగుణంగా తెలుగునేలపై కూడా డివైన్ లైఫ్ సొసైటీ విశిష్ట సేవలు అందిస్తోంది.

➠ శనివారం, త్రయోదశి తిథి కలిసివస్తే శనిత్రయోదశిగా భావిస్తారు. శని దోష నివారణల కోసం ఆరోజున అభిషేకాలు, జపదానాలు నిర్వహిస్తారు. శనిమహాదశ, ఏల్నాటి శని, అష్టమ - అర్థాష్టమ శనిదోషాలు మానవుణ్ణి పరీక్షిస్తాయి. ధర్మమార్గంలో ప్రవర్తించేలా తీర్చిదిద్దుతాయి. శనిదోషం అందరికీ ఒకేలాంటి ఫలితాలనివ్వదు అనే అంశాన్ని ఇక్కడ గుర్తుంచుకోవాలి.

Recent Comments