గాయత్రీం కమలాసనాం సర్వప్రారబ్ధనాశినీం
సంసారదుఃఖశమనీం హంసాధిరూఢాం భజే!

ఆదిపరాశక్తిగా, అనేక మూలమంత్రాలకు అధిష్ఠాన దేవతగా కొలవబడే గాయత్రీమాత జయంతి (జూన్ 5) ఈ మాసపు దివ్య వైభవం. ఆ మహాతల్లికి ప్రణామాలు. కృషీవలురు సర్వసిద్ధమై పొలం పనులకు శ్రీకారంచుట్టే ఏరువాక పూర్ణిమ జూన్ 9న వస్తోంది. యుగాలుగా ఏరువాక పండగ సదాచారంగా మనకు సంక్రమించింది. శ్రమశక్తిని, ప్రకృతిని ఆరాధించే సంప్రదాయంగా కొనసాగుతోంది. శ్రమజీవుల ఆశలకు అంకురార్పణ జరిగే ఆనంద పర్వమిది. వరుణ దేవుడు అనుగ్రహంతో రైతుల కష్టాలు ఫలించి మంచి ఫలసాయాలు దక్కాలని మనసా కోరుకుంటున్నాం. ప్రపంచానికి భారతావని అందించిన గొప్పకానుక ఈ యోగవిద్య. మానసిక, శారీరక ఆరోగ్యాలకు దివ్యసంజీవని యోగ. యాంత్రికయుగంలో యావత్ప్రపంచం యోగసాధనని దినచర్యలో భాగంగా చేసుకుని సుఖిస్తోంది. ఒక మహత్తరశక్తిని ఆవిష్కరించిన యోగిపుంగవునకు కైమోడ్పులందిస్తూ, యోగాదినోత్సవ వేళ యోగాసన పద్ధతులను సచిత్రంగా, చిరు పుస్తకంగా ఈ సంచికతో ఉచితంగా అందిస్తున్నాం.

➠ పార్వతీ మాత ఉమాదేవిగా జ్యేష్ఠ శుద్ధ చవితినాడు అవతారం దాల్చింది. వింధ్యవాసినిగా కొలుపులందుకుంది. సావిత్రీదేవి ఈ మాసంలోనే కాలయముణ్ణి ఎదిరించి పతిప్రాణాలు తిరిగి తెచ్చుకుంది. స్త్రీలకు సౌభాగ్యాన్ని, పురుషులకు అధికారప్రాప్తిని కలిగించే ఎన్నో వ్రతాలకు ఆలంబనం జ్యేష్ఠమాసం.

➠ గురువు ఈశ్వరలీలా రథశిఖర వైజయంతి గురువు ఆత్మారోహగిరి శిఖరం మీది జ్యోతి గురువు జిజ్ఞాసువు దాహం తీర్చే ప్రపాశాల గురువు సుషుమ్నా సాక్షాత్ శివ స్వరూపం - సద్గురు శివానందమూర్తి 

➠ చుట్టూ మంచుకొండలు. ఎముకలు కొరికే చలి. కొద్దిపాటి అజాగ్రత్తతో వ్యవహరించినా ప్రాణాలు తీసే ప్రమాదకరమైన మార్గం. అనేక నియమనిబంధనలు. ఐనా ఏటా లక్షమంది యాత్రికులు దర్శించే స్వయంసిద్ధ లింగం అమరనాథ లింగం. అమరనాథ యాత్ర అంటేనే ఒళ్లు పులకరించే ఆనందం. 14వేల అడుగుల ఎత్తున ఉన్న గుహలో అమరనాథుని హిమలింగాన్ని దర్శించగానే అన్ని క్లేశాలు దూరమౌతాయి.

➠ కలౌ చండీ వినాయకౌ - కలియుగంలో చండిని, వినాయకుని ఆశ్రయించాలి. అమ్మవారి నవరాత్రులు అంటే తొమ్మిదిరోజుల పర్వాల పరంపర. చైత్ర నవరాత్రులు, శరన్నవరాత్రులతో పాటు మాఘ, ఆషాఢమాసాల్లో వచ్చే మరో రెండు నవరాత్రులు కూడా శక్తి ఆరాధనకు ప్రధానం. అంతగా ప్రాచుర్యంలో లేని మాఘ, ఆషాఢ నవరాత్రులనే గుప్తనవరాత్రులంటారు. 

➠ విశ్వజననిగా ప్రసిద్ధురాలు మాతృశ్రీ అనసూయా దేవి. బాపట్లకు సమీపంలోని జిల్లెళ్లమూడి గ్రామంలో సామాన్య గృహిణిగా ఆమె జీవనం సాగించింది. సర్వసమ్మతమైనదే నా మతం అంటూ ఆకలే అర్హతగా అన్నపూర్ణాలయంలో అందరికీ ఆహారం అందించింది. ఆమె ప్రబోధాలకు ఆచరణాత్మక రూపం శ్రీ విశ్వజననీ పరిషత్. ఈ సంస్థ తరఫున విద్య, వైద్యాలయాలు, హైమాలయం, ఆదరణాలయం వంటివెన్నో సమాజసేవలో తమవంతు పాత్ర పోషిస్తున్నాయి.

➠ సృష్టిలోని సౌందర్యా న్నంతా ఉలులకు అద్ది శిల్పుల చేతికి అందిస్తే అది అక్షరధామ్ అవుతుంది. సనాతన భారతీయ కళలు, మనవారి అసమాన ప్రజ్ఞావిశేషాలు, ఆలోచనా విలువలకు నిలువుటద్దంలా అక్షరధామం కనువిందు చేస్తుంది. ఉద్ధవ సంప్రదాయ పరంపరలో ముఖ్యగురువు శ్రీస్వామి నారాయణ్ పేరిట అక్షరధామ్ రూపుదిద్దుకుంది.

Recent Comments