తిథులు, మాస ఫలాలు మీ చేతిలో ఉంచుతుంది భక్తి పత్రిక... నిత్యకృత్యంలో చేసే పనుల్లో సైతం నైపుణ్యాన్ని పెంచుకోవడమే యోగం అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు. మీ అందరి ఆదరాభిమానాలతో విజయవంతంగా మూడు సంవత్సరాలు పూర్తి చేసుకుంది భక్తి పత్రిక. ఈ సందర్భంగా శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి దండాలు, త్రికరణాలు అనే అంశంపై సాకల్యంగా అనుగ్రహించిన అనుగ్రహ భాషణాన్ని పాఠకులకు సమర్పిస్తున్నాం. త్రిగుణాల నుండి త్రివర్ణ పతాకం దాకా త్రిదళంగా, గుచ్ఛంగా వచ్చే విశేషాలను ప్రత్యేక వ్యాస పరంపరలో అందిస్తున్నాం. శ్రీశంకరుల వారి సౌందర్యలహరి ఆవిర్భవించిన జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి ఈనెల 24న వస్తోంది. అలాగే.. పూరి జగన్నాథస్వామి స్నానోత్సవం జూన్ 28న రాబోయే రథోత్సవానికి నాంది పలుకుతోంది. నవధాన్యాలను పండించే అన్నదాతలు కాడి బుజాన వేసుకొనే తరుణం ఏరువాక పున్నమి ఈనెల 28న వస్తోంది. కార్తెలన్నీ కనికరించి.. వరుణుడి అనుగ్రహంతో తెలుగు నేలలు బంగారు పంటలు పండాలని కాంక్షిస్తున్నాం. కర్షకలోకానికి శుభాకాంక్షలు పలుకుతున్నాం... 

➠ పరమశివుడు త్రిపుండ్రధారి. ఆయన త్రినేత్రుడు. మూడు కన్నులవాడు. సత్త్వగుణ ఆధిక్యాన్ని నిరూపించేందుకు త్రిశూలం ధరించి ఉంటాడు. మూడు దళాల బిల్వ పత్రాలతో అర్చన చేస్తే ఉబ్బు లింగడు పొంగిపోయి వరాలు కురిపిస్తాడు. 'త్రినేత్రుడు' అనే వ్యాసంలో హరిఫణిరాజదత్త రాసిన వివరణ చూద్దాం...

➠ ఆ సురుచిర దరహాసం ప్రపంచాన్ని ఆయన మధురవాక్కు కోట్లాది హృదయాల్ని గెలిచింది. నడుస్తున్న నారాయణ స్వరూపంలా విశిష్టాద్వైత సిద్ధాంతానికి పట్టుగొమ్మలా భావిస్తున్న శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్ స్వామి అనుగ్రహ భాషణం 'భావశుద్ధితోనే పరమాత్మ సాక్షాత్కారం' అనే వివరణలో చూద్దాం..

➠ పితృదేవతలందరూ తమ వంశీకులు భక్తి శ్రద్ధలతో శ్రాద్ధకర్మలను ఆచరించాలని ఆశతో ఎదురు చూస్తారంది వాయుపురాణం. భారతదేశంలో మూడు ముఖ్య క్షేత్రాలు త్రిగయలుగా ప్రసిద్ధి వహించాయి. బీహార్ లోని గయను శిరోగయ అని.. ఒరిస్సాలోది జాజ్ పూర్ నాభిగయ అని... ఆంధ్రప్రదేశ్ లో పిఠాపురం పాదగయగా ప్రసిద్ధి చెందింది. ఈ మూడు క్షేత్రాలలో ఒక్కచోటైనా పితరులకు పిండప్రదానం చేయడం ఉత్తమం అంటారు పెద్దలు. గయాయాం.. గయాయాం అనే వ్యాసంలో డి. విజయలక్ష్మి రాసిన వివరణ చూద్దాం...  

➠ లోకంలో ఒక వస్తువు ఉన్నదంటే దాని నిర్మాత ఒకరున్నారని గ్రహించాలి. భగవంతుడే అందరి సృష్టికర్త అని పురాణాలు చెబుతున్నాయి. సృష్టికి ఆధారమైన వాడు.. చరాచర జగత్తును సృష్టించినవాడు ఆయనే. త్రిమూర్తులు వ్యాసంలో డా. కప్పగంతు రామకృష్ణ వివరణ చూద్దాం....  

➠ జ్ఞానము, ఉపాసన, కర్మ అనే మూడు సాధనల ద్వారా పరమేశ్వరిని తెలుసుకోవచ్చు. దేవీ తత్త్వాన్ని అవగతం చేసుకున్న యోగసాధకుడు కుండలినిలో అమ్మ సూక్ష్మతమ రూపాన్ని దర్శించగలుగుతాడు. త్రిశక్తి స్వరూపిణి అనే వ్యాసంలో మల్లాప్రగడ శ్రీమన్నారాయణ మూర్తి రాసిన వ్యాసం చూద్దాం... 

➠ అలాగే ధర్మసందేహాలు, బలివాడ కాంతారావు తిరుపతి వివరణ, మాసఫలం వంటివి కూడా చూడవచ్చు. ఈ సంచికతో పాటు యోగాసనాలు ప్రత్యేక అనుబంధ సంచికను ఉచితంగా అందిస్తున్నాం.

Recent Comments